Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ: ‘భరత్ అనే నేను’

By:  Tupaki Desk   |   20 April 2018 9:04 AM GMT
మూవీ రివ్యూ: ‘భరత్ అనే నేను’
X
చిత్రం : ‘భరత్ అనే నేను’

నటీనటులు: మహేష్ బాబు - కియారా అద్వాని - ప్రకాష్ రాజ్ - శరత్ కుమార్ దేవరాజ్ - రవిశంకర్ - ఆమని - సితార - బ్రహ్మాజీ - రావు రమేష్ - పోసాని కృష్ణమురళి - పృథ్వీ - రాహుల్ రామకృష్ణ తదితరులు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
ఛాయాగ్రహణం: తిరు - రవి.కె.చంద్రన్
నిర్మాత: డీవీవీ దానయ్య
రచన - దర్శకత్వం: కొరటాల శివ

మహేష్ బాబు-కొరటాల శివ కాంబినేషన్లో ఇంతకుముందు ‘శ్రీమంతుడు’ లాంటి బ్లాక్ బస్టర్ వచ్చింది. మళ్లీ వీళ్లిద్దరూ కలిసి చేసిన ‘భరత్ అనే నేను’ ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి రేకెత్తించింది. భారీ అంచనాల మధ్య ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

భరత్ రామ్ (మహేష్ బాబు).. రాఘవ రామ్ (శరత్ కుమార్) అనే రాజకీయ నేత కొడుకు. అతను చిన్నతనంలోనే తల్లిని కోల్పోతాడు. తర్వాత లండన్ కు వెళ్లిపోయి అక్కడే చదువుకుని పట్టభద్రుడవుతాడు. అదే సమయంలో రాఘవరామ్ అనారోగ్యంతో చనిపోవడం హైదరాబాద్ రావాల్సి వస్తుంది. తర్వాత అనుకోని పరిస్థితుల్లో అతనే ముఖ్యమంత్రి పదవిని చేపడతాడు. ఇక్కడ వ్యవస్థలో లోపాలు.. ప్రజల కష్టాలు చూసిన భరత్.. పరిస్థితుల్ని మార్చడానికి నడుం బిగిస్తాడు. ఈ క్రమంలో అతడికి ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి.. వాటిని అతను ఎలా అధిగమించాడు.. అతడి ప్రయాణం ఎలా ముందుకు సాగింది.. అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

సినిమా అనేది వినోద ప్రధానంగా ఉండాలని మెజారిటీ ప్రేక్షకులు కోరుకుంటారు. ఫిలిం మేకర్స్ ఆలోచన కూడా ఇలాగే ఉంటుంది. అయితే చాలా కొద్దిమంది దర్శకులు మాత్రం సినిమాకు సామాజిక బాధ్యత కూడా ఉందని భావిస్తారు. ఎంతో కొంత మంచి చెప్పాలని చూస్తారు. ఐతే ఆ మంచిని ఎలా చెబుతారన్నది కీలకం. కేవలం సందేశాలిస్తే చూడటానికి జనాలు సిద్ధంగా ఉండరు. తాము చెప్పాలనుకున్న మంచిని వినోదం పూత పూసి చెప్పి ప్రేక్షకుల్ని మెప్పించడం అంత సులువైన విషయం కాదు. నిజంగా అలా చెప్పగలిగితే ప్రేక్షకులు ఆ సినిమాపై అమితమైన ప్రేమను చూపిస్తారు. మూడే మూడు సినిమాల అనుభవంతోనే టాలీవుడ్ అగ్ర దర్శకుల్లో ఒకడిగా కొరటాల శివ పేరు తెచ్చుకోవడానికి ఈ మార్గం ఎంచుకోవడమే కారణం. ఇప్పటిదాకా తాను తీసిన మూడు సినిమాల్లోనూ అతను ఏదో ఒక మంచి చెప్పాలనే చూశాడు. జనాలతో ముడిపడ్డ కథా వస్తువును ఎంచుకుని.. దానికి కమర్షియల్ హంగుల్ని అందంగా అద్ది.. మెజారిటీ ప్రేక్షకుల్ని అలరించే సినిమాలు అందించాడు. ఆ కోవలోనే వచ్చిన తాజా సినిమా ‘భరత్ అనే నేను’.

ఒక కథ ఎంత ఎక్కువమంది జనాలకు కనెక్టయితే.. అది అంత పెద్ద విజయం సాధిస్తుంది. ఆ కథలోని పాత్రలతో.. అంశాలతో ఐడెంటిఫై కాగలగడం అనేది కీలకమైన విషయం. ఈ విషయంలో కొరటాల గత సినిమాల కంటే ఒక మెట్టు పైనే నిలుస్తుంది ‘భరత్ అనే నేను’. వినోదం పాళ్లు తక్కువైనప్పటికీ ఎక్కువమందికి కనెక్టయ్యే కథాంశం ఇందులో ఉంది. ఇష్టమున్నా లేకపోయినా రాజకీయాలనేవి ప్రతి ఒక్కరి జీవితంలో భాగం. కానీ ఆ నేపథ్యంలో పకడ్బందీ సినిమాలు తెలుగులో చాలా తక్కువ అనే చెప్పాలి. ఐతే కొరటాల శివ మాత్రం వర్తమాన రాజకీయ.. సామాజిక పరిస్థితుల నేపథ్యంలో ఒక బలమైన సినిమానే అందించాడు. సమకాలీన పరిస్థితులపై అవగాహన ఉండటం వేరు. ఆ పరిస్థితుల్ని తెరమీద ఆసక్తికరంగా చూపించడం వేరు. ఈ విషయంలో కొరటాల సమతూకం పాటించిన తీరు ‘భరత్ అనే నేను’లో ప్రత్యేకంగా అనిపించే విషయం. సినిమాలో చూసేవన్నీ తెలిసిన విషయాలే.. కథాకథనాలు.. సన్నివేశాల్లో మరీ కొత్తదనం ఏమీ కనిపించదు. అయినప్పటికీ దాదాపు మూడు గంటల పాటు చాలా వరకు ఆసక్తి సన్నగిల్లకుండా తన మార్కు ‘సింప్లిసిటీ’తో సినిమాను నడిపించడంలో.. ప్రేక్షకుల్ని అలరించడంలో కొరటాల విజయవంతమయ్యాడు. కాకపోతే నెమ్మదిగా.. హడావుడి లేకుండా సినిమాను నడిపించే కొరటాల ఈసారి మరీ నెమ్మదించాడు. అదే సినిమాలో పెద్ద కంప్లైంట్.

చాలా చోట్ల ‘లీడర్’ను తలపించే ‘భరత్ అనే నేను’ కథ.. అందులో మాదిరే చాలా వరకు రాజకీయాల చుట్టూనే తిరుగుతుంది. ఐతే అందులో లాగా ప్లాన్ చేసి కాకుండా అనుకోకుండా ముఖ్యమంత్రి అయిపోతాడు హీరో. హీరో సీఎం కుర్చీ ఎక్కే వరకు చాలా నెమ్మదిగా.. సాధారణంగా సాగుతుందీ కథనం. ఐతే మహేష్ సీఎంగా ఛార్జ్ తీసుకోగానే కథనం కూడా రీఛార్జ్ అవుతుంది. సీఎం పాత్రలో మహేష్ స్క్రీన్ ప్రెజెన్స్.. పదవి చేపట్టగానే అతను తీసుకునే తొలి నిర్ణయాలతో ముడిపడ్డ సన్నివేశాలు ఆసక్తి రేకెత్తిస్తాయి. ప్రేక్షకులల్లో ఉత్సాహం తీసుకొస్తాయి. ట్రాఫిక్ సమస్యతో ముడిపడ్డ ఎపిసోడ్ తో ప్రతి ఒక్కరూ రిలేటవుతారు. అసెంబ్లీ సన్నివేశాలు కూడా ఆసక్తికరంగా సాగి ఆకట్టుకుంటాయి. రాజకీయాలు.. ప్రజా సమస్యల చుట్టూ కథను నడిపిస్తూనే.. సీఎం రొమాంటిక్ ట్రాక్ ను కూడా నడిపిస్తూ రిలీఫ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు కొరటాల. సీఎం ఒకమ్మాయిపై ఆసక్తి చూపించడం కొంచెం కొత్తగా అనిపిస్తుంది కాబట్టి దాంతో ముడిపడ్డ సన్నివేశాలు భిన్నంగా అనిపిస్తాయి. ఎంటర్టైన్ చేస్తాయి.

‘భరత్ అనే నేను’ ప్రథమార్ధంతో పోలిస్తే ద్వితీయార్దం కొంచెం రొటీన్ గా.. అనిపిస్తుంది. కమర్షియల్ హంగుల మీద.. హీరోయిజం మీద శ్రద్ధ పెట్టడం ఇందుకు కారణం. ఐతే తన ప్రతి సినిమాలోనూ ద్వితీయార్ధంలో మాస్ కు గూస్ బంప్స్ ఇచ్చే ఒక ఎపిసోడ్ పెట్టడం కొరటాలకు అలవాటు. ‘మిర్చి’లో కారు అద్దం పగిలే ఎపిసోడ్.. ‘శ్రీమంతుడు’లో మామిడి తోట సీన్.. ‘జనతా గ్యారేజ్’లో రాజీవ్ కనకాల ఎపిసోడ్ అలాంటివే. ఇందులో కూడా అలాంటి ఎపిసోడే ఒకటుంది. రాయలసీమలో అరాచకాలు చేస్తున్న నాయకుడి అడ్డాకు వెళ్లి అతడికి బుద్ధి చెబుతాడు హీరో. మహేష్ ఫ్యాన్స్.. మాస్ ఆడియన్స్ ను ఉర్రూతలూగిస్తుంది ఈ బ్లాక్. ‘జనతా గ్యారేజ్’లో రాజీవ్ కనకాల తరహాలోనే ఇక్కడ రాహుల్ రామకృష్ణను ఉత్ప్రేరకంలా వాడుకున్నాడు దర్శకుడు.

ఐతే ఈ ఎపిసోడ్ తర్వాత కథనం అప్ అండ్ డౌన్స్ తో సాగుతుంది. ఐతే ప్రి క్లైమాక్స్ లో వచ్చే ప్రెస్ మీట్ ఎపిసోడ్ హైలైట్ గా నిలుస్తుంది. మహేష్ ఈ సన్నివేశాన్ని నిలబెట్టాడు. కానీ అప్పుడొచ్చే ఊపుకు తగ్గట్లుగా ముగింపు లేదు. క్లైమాక్సే సినిమాకు పెద్ద మైనస్ లాగా అనిపిస్తుంది. ఏదో హడావుడిగా.. మొక్కుబడిగా సినిమాను ముగించిన భావన కలుగుతుంది. రాజకీయాలు.. ప్రజా సమస్యల చుట్టూ సాగే కథ అంటే వినోదానికి అవకాశం తక్కువే కానీ.. కొరటాల సాధ్యమైనంతగా ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడానికే ప్రయత్నించాడు. అయినప్పటికీ వినోదం పాళ్లు తగ్గిన భావన కలుగుతుంది. కథాకథనాల్లో కొత్తదనం లేకపోవడం.. సినిమా నెమ్మదిగా సాగడం ఇందులో చెప్పుకోవాల్సిన ఇతర ప్రతికూలతలు. కానీ ఓవరాల్ గా ఒక మంచి సినిమా చూసిన భావనను ‘భరత్ అనే నేను’ కలిగిస్తుందనడంలో సందేహం లేదు.

నటీనటులు:

మహేష్ కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్సెస్ లో ఇది ఒకటిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. ముఖ్యంగా సినిమాకు కీలకంగా మారిన ప్రెస్ మీట్ సీన్లో మహేష్ అభినయం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ‘ఐయామ్ నాట్ డన్ యెట్’ అంటూ ఆవేశాన్ని.. ఆవేదనను చూపించేటపుడు మహేష్ పెర్ఫామెన్స్ కు ఫిదా అయిపోతాం. మొదట్లో మహేష్ నటన గత సినిమాల్ని గుర్తుకు తెచ్చి కొంచెం మొనాటనీగా అనిపించినా చివరికి వచ్చేసరికి ఫీలింగ్ మారిపోతుంది. హీరోయిన్ కియారా అద్వానీ అందంగా ఉంది. ఆమె లుక్స్ ఆకట్టుకుంటాయి. కానీ నటన పరంగా ఆమె చేయడానికి ఏమీ లేకపోయింది. తన పాత్ర సినిమాలో ఓ కీలక మలుపుకు కారణమైంది కానీ.. ఆమె ప్రత్యేకత చూపించడానికి మాత్రం అవకాశం లేకపోయింది. ప్రకాష్ రాజ్ చాన్నాళ్ల తర్వాత కీలకమైన పాత్రలో రాణించారు. ఆయన అనుభవం సినిమాలో కనిపిస్తుంది. రవిశంకర్.. పోసాని కృష్ణమురళి.. శరత్ కుమార్.. సితార.. బ్రహ్మాజీ లాంటి వాళ్లు పాత్రలకు తగ్గట్లుగా బాగా నటించారు. దేవరాజ్ ప్రత్యేకత ఏమీ కనిపించలేదు. మిగతా వాళ్లంతా మామూలే.

సాంకేతిక వర్గం:

దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఆకట్టుకుంటుంది. వచ్చాడయ్యో సామీ.. భరత్ అనే నేను.. పాటలు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఐతే పాటలన్నీ బాగున్నప్పటికీ సినిమాలో మంచి మాస్ నంబర్ మిస్సయిన ఫీలింగ్ కలుగుతుంది. సినిమా థీమ్ ప్రకారం అలాంటిది కుదర్లేదేమో. ఇక నేపథ్య సంగీతంతో చాలా సన్నివేశాల్ని ఎలివేట్ చేశాడు దేవి. రవి.కె.చంద్రన్-తిరుల ఛాయాగ్రహణం టాప్ క్లాస్ అనడంలో సందేహం లేదు. నిర్మాణ విలువల విషయంలోనూ ఢోకా లేదు. ప్రతి ఫ్రేమ్ చాలా రిచ్ గా తెరకెక్కింది. ఇక రచయిత.. దర్శకుడు కొరటాల శివ తన అలవాటైన రీతిలో.. తన పరిమితుల్లోనే మంచి ఔట్ పుట్ ఇచ్చాడు. అతను మంచి విషయాలు చాలానే చెప్పాడు కానీ.. ఎక్కడా ప్రీచింగ్ లాగా అనిపించకపోవడం.. అన్ని విషయాలూ కథలో ఇమిడిపోయేలా చూసుకోవడం విశేషం. సినిమా అంతా కూడా సమకాలీన అంశాలతో జనాలకు కనెక్టయ్యేలా ఉండేలా చూసుకున్నాడు కొరటాల. రచయితగా.. దర్శకుడిగా అతడికి మంచి మార్కులు పడతాయి. కాకపోతే కథనాన్ని చెప్పడంలో కొరటాల నెమ్మదితనం ఈసారి మరీ ఎక్కువైంది. క్లైమాక్స్ విషయంలోనూ కొరటాల కొంచెం భిన్నంగా ఆలోచించాల్సింది.

చివరగా: భరత్.. హామీ నిలబెట్టుకున్నాడు!

రేటింగ్- 3.25/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre