Begin typing your search above and press return to search.

భానుప్రియను అడగడం లేదా? ఆమె చేయడం లేదా?

By:  Tupaki Desk   |   29 April 2021 11:30 PM GMT
భానుప్రియను అడగడం లేదా? ఆమె చేయడం లేదా?
X
తెలుగు తెరను ఒక దశలో ప్రభావితం చేసిన కథానాయికల జాబితాలో విజయశాంతి .. రాధ .. సుహాసిని .. భానుప్రియ కనిపిస్తారు. సుహాసిని సున్నితమైన కథానాయికగా అనిపించుకుంటే. హీరోలతో సమానంగా డాన్సులు వేయడంలో విజయశాంతి .. రాధ .. భానుప్రియ ఫుల్ మార్కులు కొట్టేశారు. ఇక ఈ ముగ్గురిలో క్లాసికల్ డాన్స్ చేయాలంటే మాత్రం భానుప్రియనే. ఆ తరహా పాత్రలు భానుప్రియ చేయవలసిందే .. ఆమెకి ప్రత్యామ్నాయమే లేదు. 'స్వర్ణకమలం' వంటి సినిమా చేయాలంటే భానుప్రియవంటి ఆర్టిస్ట్ కావల్సిందే కదా.

టాలీవుడ్ లో ఆనాటి అగ్రహీరోలందరి సరసన భానుప్రియ ఆడిపాడారు. విశాలమైన కళ్లతోనే ఆమె నవరసాలను కుమ్మరించేవారు. కళ్లు అంటే భానుప్రియవే అన్ని అప్పట్లో చెప్పుకునేవారు. అంత చక్కని కళ్లున్న హీరోయిన్ ఇంతవరకూ తెలుగు తెరకి మళ్లీ తారసపడలేదంటే అతిశయోక్తి కాదేమో. హీరోయిన్ గా ఒక దశాబ్దం పాటు తెరను ఏలేసిన ఆమె, ఆ తరువాత నుంచి ముఖ్యమైన పాత్రలను పోషించడం మొదలుపెట్టారు. అలా భానుప్రియ చేసిన 'పెదరాయుడు' .. 'అన్నమయ్య'.. 'లాహిరి లాహిరి లాహిరిలో' సినిమాలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.

ఆ తరువాత నుంచి హీరోలకు తల్లి పాత్రల్లోను భానుప్రియ మెప్పించారు. అలా 'ఛత్రపతి' సినిమాలో ఆమె పోషించిన పార్వతి పాత్రను ప్రేక్షకులు ఇంతవరకూ మరిచిపోలేదు. ఆ మధ్య వచ్చిన 'మహానటి'లో 'దుర్గమాంబ' పాత్రలో తప్ప ఆ తరువాత తెరపై ఆమె మళ్లీ కనిపించలేదు. 'నాట్యం' సినిమాకి సంబంధిచి భానుప్రియ పేరు వినిపించిందంతే. ఇతర పాత్రల కోసం భానుప్రియను అడగడం లేదా? లేదంటే చేయడానికి ఆమె ఆసక్తిని చూపడం లేదా? అనేది అభిమానులకు అర్థం కావడం లేదు. తమ అభిమాన నటిని తెరపై చూడాలనే వాళ్లంతా కోరుకుంటున్నారు.