Begin typing your search above and press return to search.

రాజమౌళి నెంబర్ వన్ డైరెక్టర్ అవుతాడని ముందే చెప్పాను!

By:  Tupaki Desk   |   29 May 2022 11:30 AM GMT
రాజమౌళి నెంబర్ వన్ డైరెక్టర్ అవుతాడని ముందే చెప్పాను!
X
భానుచందర్ .. యాక్షన్ హీరోగా తెలుగు తెరపై మంచి మార్కులు కొట్టేసిన హీరో. ఆ తరువాత ఫ్యామిలీ ఆడియన్స్ తో కూడా శభాష్ అనిపించుకున్న హీరో. టాలీవుడ్ లో చిరంజీవి .. బాలకృష్ణ .. నాగార్జున .. వెంకటేశ్ స్టార్ హీరోలుగా చక్రం తిప్పుతున్న సమయంలోనే, తమిళ ఇండస్ట్రీ నుంచి అర్జున్ .. సుమన్ .. భానుచందర్ వంటి యాక్షన్ హీరోలు ఇక్కడికి వచ్చారు. వాళ్లని కూడా తెలుగు హీరోలుగానే ప్రేక్షకులు ఆదరించారు. అందువల్లనే వాళ్లు ఇక్కడ తమ కెరియర్ ను సుదీర్ఘ కాలం పాటు కొనసాగించారు.

భానుచందర్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యం నుంచి రావడం వలన, ఇక్కడి ప్రేక్షకుల్లో తనదైన ముద్రవేయగలిగారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "మొదటి నుంచి కూడా నాకు హీరోను కావాలనే ఉండేది. అందువలన ఆ దిశగానే ప్రయత్నాలు చేస్తూ వచ్చాను. కెరియర్ ఆరంభంలో తెలుగులో నేను చేసిన సినిమాలు నాకు చాలా హెల్ప్ అయ్యాయి. ఆ సినిమాలు భారీ విజయాలను సాధించడం వలన నేను ఇక్కడ నిలదొక్కుకోగలిగాను. టీనేజ్ లో ఒక రకమైన దూకుడు ఉంటుంది. ఆ ఏజ్ లో నేను కూడా డ్రగ్స్ కి బానిసను అయ్యాను.

అయితే మనసును మార్షల్ ఆర్ట్స్ వైపు మళ్లించడం వలన నేను ఆ దురలవాటు నుంచి బయటపడ్డాను. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. భగవంతుడు ఇచ్చిన అవవయాలను .. ఆయన ఇచ్చిన స్థాయిలో కోట్లు పెట్టినా రీప్లేస్ చేయలేము.

అందువల్లనే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి .. ఈ రోజుకీ నేను ఇంత ఫిట్ గా ఉండటానికి కారణం నేను పెట్టిన శ్రద్ధనే. ఇప్పటికీ నేను యాక్టివ్ గా సినిమాలు చేస్తూనే ఉన్నాను. యంగ్ డైరెక్టర్స్ కూడా నాకు అవకాశాలు ఇవ్వడం ఆనందాన్నిస్తోంది. ఇప్పుడు చాలా మంది డైరెక్టర్స్ వచ్చేస్తున్నారు.

నేను ఇష్టపడే దర్శకులలో రాజమౌళి ఒకరు. ఆయన 'సింహాద్రి' సినిమాలో నాకు ఒక మంచి వేషం ఇచ్చారు. ఆ సినిమాకి నేను డబ్బింగ్ చెబుతున్నప్పుడే ఆయనలో చాలా విషయం ఉందనే విషయం నాకు అర్థమైంది. నేను కబురు చేస్తే ఆయన వచ్చారు.

" ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది .. మీరు నెంబర్ వన్ డైరెక్టర్ అవుతారు" అన్నాను. ఆయన అప్పుడు నవ్వి ఊరుకున్నారు. ఈ రోజున ఆయన భారతీయులు గర్వించదగిన దర్శకులుగా ఎదిగారు. ఆయనకి సినిమా తీయడమే కాదు .. దానిని ఎలా బిజినెస్ చేసుకోవాలో కూడా తెలుసు. ఆయన నుంచి మిగతా వాళ్లు నేర్చుకోవలసింది అదే" అంటూ చెప్పుకొచ్చారు .