Begin typing your search above and press return to search.

ట్రైల‌ర్ టాక్: 200 కోట్ల ఖ‌రీదైన‌ గుడ్డును వండేసిందా?!

By:  Tupaki Desk   |   31 Jan 2022 2:11 PM GMT
ట్రైల‌ర్ టాక్: 200 కోట్ల ఖ‌రీదైన‌ గుడ్డును వండేసిందా?!
X
జాతీయ ఉత్త‌మ న‌టి ప్రియ‌మ‌ణి `ఫ్యామిలీమ్యాన్` వెబ్ సిరీస్ లో అద్భుత న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్న సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత వ‌రుస‌గా వెబ్ సినిమాలు సిరీస్ ల‌లో న‌టించేందుకు ఆస‌క్తిగా ఉన్నారు ప్రియ‌మ‌ణి. ప్ర‌స్తుతం ప్రియ‌మ‌ణి న‌టించిన `భామా క‌లాపం` హాట్ టాపిక్ గా మారింది. ఆహా- ఓటీటీలో ఇది ఈ ఫిబ్ర‌వ‌రిలో విడుద‌ల కానుంది. తాజాగా భామాకలాపం ట్రైలర్ ను హీరో విజయ్ దేవరకొండ ఆవిష్కరించారు.

ట్రైలర్ ఆద్యంతం ర‌క‌ర‌కాల ట్విస్టులు ట‌ర్నులు ర‌క్తి క‌ట్టించాయి. ప్రియమణి తన పాక నైపుణ్యాన్ని చూపించేందుకు పోటీప‌డుతుంటే ఇంత‌లోనే మ్యూజియంలోంచి ఒక గుడ్డు మిస్స‌వుతుంది. ఆ గుడ్డు విలువ 200 కోట్లు. అయితే ఆ గుడ్డును కొట్టేసింది ఎవ‌రో కానీ బోలెడంత హంగామా న‌డుస్తుంది. యూట్యూబ్ ఛానెల్ ని నడుపుతున్న అనుపమ (ప్రియ‌మ‌ణి) గృహ‌ణి కం కుక్ గా క‌నిపిస్తుంది. రుచికరమైన వంటకాల్లో అనుప‌మ నిపుణురాలు .. కేవలం వాసనతో వంటకం రుచిని అంచనా వేయగలదు. కానీ గుడ్డు తప్పిపోవడంతో ఆ త‌ర్వాత ఆ టెన్ష‌న్ త‌న‌ను చుట్టుకుంటుంది. కోల్ కతా మ్యూజియం నుండి 200 కోట్ల రూపాయల విలువైన `గుడ్డు`ను దొంగిలించింది? ఎవ‌రు అన్న స‌స్పెన్స్ ని పోలీసులు ఎలా ఛేదించారు అన్న‌ది తెర‌పైనే చూడాలి.

ఈ క‌థ‌లో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అనుపమను అనుమానించి త‌ను నివసించే అపార్ట్ మెంట్ ప్రాంతానికి తాళం వేస్తారు. స్టోరి ఆద్యంతం థ్రిల్లర్ అంశాలు మైమ‌రిపించాయి. ఇంత‌కీ ఖ‌రీదైన ఆ గుడ్డు ఎక్కడుంది? అనుపమ వండేసిందా? అన్న‌ది తెర‌పై చూడాలి. అనుపమ పాత్రకు జీవం పోసింది ప్రియ‌మ‌ణి. ఎంతో నేచుర‌ల్ పెర్ఫామెన్స్ తో ఆక‌ట్టుకుంటోంది. ఈ చిత్రానికి భ‌ర‌త్ క‌మ్మ ర‌చ‌యిత కాగా.. అభిమన్యు దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 11 నుంచి ప్రేక్షకుల ముందుకు ఇది ఆహాలో అందుబాటులోకి రానుంది.