Begin typing your search above and press return to search.

భామా క‌లాపం టీజ‌ర్: ఇది ఒక‌ డేంజ‌ర‌స్ పెళ్లాం క‌థ‌!

By:  Tupaki Desk   |   23 Jan 2022 2:30 PM GMT
భామా క‌లాపం టీజ‌ర్: ఇది ఒక‌ డేంజ‌ర‌స్ పెళ్లాం క‌థ‌!
X
ఫ్యామిలీమ్యాన్ వెబ్ సిరీస్ లో న‌టించిన‌ జాతీయ ఉత్త‌మ‌న‌టి ప్రియ‌మ‌ణి త‌న‌దైన మార్క్ న‌ట‌న‌తో అభిమానుల రేంజును పెంచుకుంది. ఇప్పుడు జాతీయ స్థాయిలో ప్రియ‌మ‌ణికి ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. ఓ వైపు బుల్లితెర‌.. మ‌రోవైపు వెండితెర అవ‌కాశాలు అందుకుంటున్న ప్రియ‌మ‌ణి వ‌రుస వెబ్ సినిమాలు సిరీస్ ల‌తోనూ బిజీ అవుతోంది. తాజాగా ప్రియమణి నటించిన భామాకలాపం వెబ్ ఫిల్మ్ టీజ‌ర్ విడుద‌లైంది. ఆహా సిరీస్ ఇది. తెలుగు స్ట్రీమింగ్ స్పేస్ లో ప్రియ‌మ‌ణికి తొలి మూవీ కూడా.

ఇంత‌కుముందు విడుద‌ల చేసిన గ్లింప్స్ ఆక‌ట్టుకుంది. దుర్గా మాత‌ను పోలి ఉండే పాత్ర‌లో ప్రియ‌మ‌ణి పాత్ర స‌స్పెన్స్ ఆక‌ట్టుకుంది. తాజాగా రిలీజ్ చేసిన టీజ‌ర్ లో ప్రియ‌మ‌ణి పీపింగ్ టామ్ యాటిట్యూడ్ ని ఆవిష్క‌రించారు. పొరుగింట్లో ఏం జ‌రుగుతుందో కిటికీలోంచి చూస్తేనే కిక్కు అనే త‌ర‌హా పాత్ర ఇది. అయితే ఈ అల‌వాటు వ‌ల్ల పొరుగు భ‌ర్త‌ల స‌న్నివేశం ఎలా ఉంటుందో ఊహించ‌వ‌చ్చు. ఏ డెలిషియ‌స్ హోమ్ మేడ్ కుక్డ్ థ్రిల్ల‌ర్ అంటూ ప్ర‌క‌టించిన‌ట్టే ఇందులో క్రైమ్ థ్రిల్స్ కి కొద‌వేమీ లేద‌ని అర్థ‌మ‌వుతోంది. అపార్ట్ మెంట్ క‌ల్చ‌ర్ విడాకుల క‌ల్చ‌ర్ భార్యాభ‌ర్త‌ల క‌ల‌త‌లు ఇవ‌న్నీ టీజ‌ర్ లో ఆవిష్క‌రించారు. ఇంత‌కీ పొరుగింట్లో షాకిచ్చే ఘ‌ట‌న ఏంటో కానీ .. నేల‌పై ర‌క్తం కారుతోంది. మ‌రి ఈ థ్రిల్ల‌ర్ లో భామ ఎంత డేంజ‌ర‌సో చూడాలి.

1000 వంటకాలతో విజయవంతమైన యూట్యూబర్ కం భామ‌గా ప్రియమణి క‌నిపించ‌నుంది. అపార్ట్ మెంట్ లో ఆంటీకి లైనేసే కుర్రాళ్ల‌ను కూడా చూపించారు. థ్రిల్లర్ క‌థాంశంతో తెర‌కెక్కిన భామాకలాపం కి భరత్ కమ్మ సార‌థ్యంలో అభిమన్యు తడిమేటి దర్శకత్వంలో రూపొందింది. రాధే శ్యామ్- డియర్ కామ్రేడ్ వంటి చిత్రాలకు స్వరకర్త జస్టిన్ ప్రభాకరన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. సుధీర్ ఈదర - బోగవల్లి బాపినీడు ఈ ప్రాజెక్ట్‌ని SVCC డిజిటల్ లో నిర్మిస్తున్నారు. దీపక్ కుమార్ కెమెరాను అందించారు.