Begin typing your search above and press return to search.

స్పాట్‌ లైట్‌ః భలే భలే బాక్సాఫీస్‌ కథ

By:  Tupaki Desk   |   14 Sep 2015 4:19 AM GMT
స్పాట్‌ లైట్‌ః భలే భలే బాక్సాఫీస్‌ కథ
X
అమెరికాలో నాని పంట పండింది. రికార్డులే రికార్డులు. భ‌లే భ‌లే మ‌గాడివోయ్ క‌లెక్ష‌న్ లు ఓ పెద్ద హీరో సినిమాకి ఏమాత్రం త‌గ్గ‌కుండా వ‌స్తున్నాయి. ఈ సినిమా ఫుల్ ర‌న్‌ లో దాదాపు 1.5 మిలియన్‌ డాల‌ర్ల పైనే ఆర్జిస్తుంద‌ని అంచ‌నాలున్నాయి. ఓవర్‌ సీస్‌ లో కేవ‌లం తొలి వీకెండ్ షేర్‌ 4.5 కోట్ల రూపాయ‌లు ఆర్జించింది. అంటే ఒక్క అమెరికా వ‌సూళ్లు నైజాంని మించి ఉన్నాయి. బిబిఎం నైజాం షేర్ 3.7 కోట్లు మాత్ర‌మే. ఇప్పుడు ఇదే చర్చనీయాంశమైంది.

అస‌లు ఏ ట్యాగ్ లేకుండానే మారుతి అనే ఓ మామూలు ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించిన ఓ సినిమా ఇలాంటి రికార్డులు సృష్టించ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌కొచ్చింది. నాని సూప‌ర్‌ స్టార్ కానేకాదు. అయినా ఈ రికార్డులు ఎలా సాధ్య‌మ‌య్యాయి? అని క్రిటిక్స్ బుర్ర‌లు బ‌ద్ధ‌లు కొట్టుకుంటున్నారు. అయితే ఈ స‌క్సెస్ వెనుక చాలా హార్డ్ వ‌ర్క్ దాగి ఉంది. ప్లానింగ్ దాగి ఉంది. ఈ సినిమా నిర్మాత‌లు చేసిన ప్ర‌చారం పెద్ద ప్ల‌స్‌. పైగా రివ్యూలు పెద్ద గా స‌హ‌క‌రించాయి. ఇలాంటి సినిమాల‌కు అమెరికాలో రివ్యూలు చ‌దివే థియేట‌ర్ల‌కు వెళ‌తారు. అందుకే పాజిటివ్ రివ్యూలు క‌లిసొచ్చాయి. అలాగే టీజ‌ర్ ల నుంచి నిర్మాత‌లు అమెరికాలో చేసిన ప్ర‌చారం క‌లిసొచ్చింది. పైగా 50-60 స్ర్కీన్ ల‌లో రిలీజ్ చేయాల్సిన సినిమాని దాదాపు 110 థియేట‌ర్ ల‌లో రిలీజ్ చేసి నిర్మాత‌లు పెద్ద‌ సాహ‌స‌మే చేశారు.

టిక్కెట్టు రేటు త‌గ్గింపు పెద్ద అస్సెట్ అయ్యింద‌ని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. పెద్ద హీరోల సినిమాల‌కు 16 డాల‌ర్ల నుంచి 20 డాల‌ర్లు టిక్కెట్ రేటు. కానీ బిబిఎం కి 12 డాల‌ర్ల నుంచి 14 డాల‌ర్ల‌కు త‌గ్గించి టిక్కెట్లు అమ్మారు. అది రిపీటెడ్ ఆడియెన్ రావ‌డానికి కార‌ణ‌మైంది. సాయంత్రం 6 త‌ర్వాత షోల‌కు మాత్ర‌మే 14 డాల‌ర్లు. మిగ‌తా షోల‌కు 12 డాల‌ర్లు మాత్ర‌మే. 3 టిక్కెట్లు కొనుక్కుంటే 10 డాల‌ర్లు త‌గ్గింపు అంటూ ఆఫ‌ర్ పెట్ట‌డం క‌లిసొచ్చింది... ఇంత క‌థ ఉంద‌న్న‌మాట‌. అందుకే అతి సునాయశంగా 1 మిలియన్‌ క్లబ్‌ లోకి ఎంటరయ్యాడు భలే భలే మగాడు. ఇప్పటికే ఈగ - టెంపర్‌ ఫుల్‌ రన్‌ వసూళ్ళను (ఓవర్‌ సీస్‌ లో) దాటేశాడు మరి.