Begin typing your search above and press return to search.

'భలే భలే బంజారా'.. మెగా 'చిరు'తల చిందులాట..!

By:  Tupaki Desk   |   18 April 2022 5:16 PM IST
భలే భలే బంజారా.. మెగా చిరుతల చిందులాట..!
X
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ''ఆచార్య''. ఇందులో మెగా ప‌వర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ సిద్ధ అనే కీలక పాత్ర‌లో కనిపించనున్నారు. మెగా తండ్రీ కొడుకులు కలిసి నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

గతంలో చిరు - చరణ్ ఒకరి సినిమాల్లో మరొకరు గెస్ట్ అప్పియ‌రెన్స్‌ ఇచ్చుకున్నారు. కానీ వీరిద్దరూ కలిసి తొలిసారి పూర్తిస్థాయి పాత్ర‌ల్లో నటించిన సినిమా 'ఆచార్య'. ఇందులో మెగా తండ్రీకొడుకులు స్క్రీన్ షేర్ చేసుకోవడమే కాదు.. ఒకే సాంగ్ లో స్టెప్పులేశారు.

అందుకే 'ఆచార్య' మెగా ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వారి ఎగ్జైట్మెంట్ ను రెట్టింపు చేయడానికి తాజాగా సోమవారం సాయంత్రం చిరంజీవి - చరణ్ కలిసి చేసిన ''భ‌లే భ‌లే బంజారా'' అనే సాంగ్ లిరికల్ వీడియోని చిత్ర యూనిట్ విడుదల చేసింది.

ఈ సందర్భంగా చిరంజీవి ట్వీట్ చేస్తూ.. ''నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే పాట ఇది. 'భ‌లే భ‌లే బంజారా' కోసం నా ఎనర్జిటిక్ రామ్‌ చరణ్‌ తో కలిసి కాలు కదపడం ఎంతో సంతోషంగా ఉంది. నా గ్రేస్ తో నేను అతన్ని డామినేట్ చేశానని ఆశిస్తున్నాను'' అని పేర్కొన్నారు.

''నిస్సందేహంగా ఇది నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే పాట. మా నాన్న, నా #ఆచార్య చిరంజీవి గారితో కలిసి డ్యాన్స్ చేయడంలోని ఆనందాన్ని, గౌరవాన్ని మాటల్లో చెప్పలేను'' అని మెగా తనయుడు రామ్ చరణ్ ట్విట్టర్ వేదికగా సంతోషం వ్యక్తం చేశారు.

ఇప్పటికే రిలీజ్ చేయబడిన 'భలే భ‌లే బంజారా' పాట ప్రోమోకు మంచి స్పందన లభించింది. ఇప్పుడు'హే సింబా రింబా.. సింబా రింబా.. సిరుతా పులుల సిందాటా.. సరదా పులుల సయ్యాటా..' అంటూ వచ్చిన ఫుల్ సాంగ్ శ్రోతలను అలరిస్తోంది.

ఇందులో చిరంజీవి - రామ్ చ‌ర‌ణ్ ఒకరితో ఒకరు పోటీప‌డి మ‌రీ గ్రేస్ ఫుల్ డ్యాన్స్ తో ఆకట్టుకున్నారు. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో సెట్ చేయబడిన ఈ పాటలో వీరిద్దరూ నక్సలైట్ల గెటప్ లో ఉన్నారు. తండ్రీకొడుకులు కలిసి ఒకే సాంగ్ లో స్టెప్పులు వేయడం మెగా అభిమానులకు కనుల విందనే చెప్పాలి.

'భలే భ‌లే బంజారా' పాటకు మణిశర్మ సంగీతం సమకూర్చగా.. గేయ రచయిత రామ‌జోగ‌య్య‌శాస్త్రి సాహిత్యం అందించారు. ప్రముఖ గాయకుడు శంక‌ర్ మ‌హ‌దేవ‌న్‌.. యువ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో కలిసి ఈ గీతాన్ని ఆలపించారు. దీనికి తిరునవుక్కరసు సినిమాటోగ్రఫీ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సురేష్ సెల్వరాజన్ ప్రొడక్షన్ డిజైనింగ్ చేయగా.. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేశారు.

ఇప్పటి వరకు 'ఆచార్య' చిత్రం నుంచి వచ్చిన ప్రచార చిత్రాలు - గ్లిమ్స్ - టీజర్ - ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అలానే 'లాహే లాహే' 'నీలాంబరి' 'సానా కష్టం' పాటలు అలరించాయి. ఈ క్రమంలో ఇప్పుడు లేటెస్టుగా వచ్చిన భలే భలే పాటకు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్.. చరణ్ కు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్లుగా నటించారు. సోనూసూద్ - జిషు సేన్ గుప్తా - వెన్నెల కిశోర్ - పోసాని కృష్ణ మురళి - తనికెళ్ళ భరణి - సౌరవ్ లోకేష్ - అజయ్ ఇతర పాత్రలు పోషించారు.

కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి - అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'ఆచార్య' సినిమా సమ్మర్ కానుకగా ఏప్రిల్ 29న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఈ సినిమా ఎలాంటి సంచలన విజయాన్ని నమోదు చేస్తుందో చూడాలి.