Begin typing your search above and press return to search.

సర్కార్ స్టోరీ గొడవలో ట్విస్ట్

By:  Tupaki Desk   |   3 Nov 2018 7:04 AM GMT
సర్కార్ స్టోరీ గొడవలో ట్విస్ట్
X
ఈ మధ్య తమిళ సినిమా‘సర్కార్’ కథ కాపీ అంటూ చెలరేగిన వివాదం ఎంత పెద్ద రచ్చకు దారి తీసిందో తెలిసిందే. తాను రాసిన ‘సెంగల్’ అనే కథను కాపీ కొట్టి దర్శకుడు మురుగదాస్ ‘సర్కార్’ సినిమా తీశాడంటూ వరుణ్ రవీంద్రన్ అనే రచయిత ఆరోపించడం.. అతడికి దక్షిణ భారత సినీ రచయితల సంఘం అధ్యక్షుడు భాగ్యరాజ్ మద్దతుగా నిలవడం.. ముందు ఈ ఆరోపణల్ని ఖండించిన మురుగదాస్ తర్వాత రాజీకి రావడం.. సినిమా టైటిల్స్ లో వరుణ్ కు క్రెడిట్ ఇవ్వడానికి అంగీకరించడం తెలిసిందే. అంతటితో ఈ వివాదం సద్దుమణిగిందనే అంతా అనుకున్నారు. కానీ ఈ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఈ గొడవ సందర్భంగా వరుణ్ కు మద్దతిచ్చే క్రమంలో ‘సర్కార్’ కథను బహిరంగ పరిచినందుకు నైతిక బాధ్యత వహిస్తూ భాగ్యరాజ్ తన పదవికి రాజీనామా చేశాడు.

తప్పనిసరి పరిస్థితుల్లోనే తాను ‘సర్కార్’ కథను బయట పెట్టాల్సి వచ్చిందని.. కానీ ఏ పరిస్థితుల్లో చేసినప్పటికీ అది తప్పే అని.. అందుకే రాజీనామా అని భాగ్యరాజ్ తెలిపాడు. ‘‘వరుణ్ తన కథను కాపీ కొట్టి మురుగదాస్ ‘సర్కార్’ తీస్తున్నట్లు చెప్పాడు. రెండు కథల్ని పరిశీలిస్తే సారూప్యత కనిపించింది. దీంతో వరుణ్ కోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. కోర్టుకు వెళ్లకుండా సమస్యను పరిష్కరించుకోమని మురుగదాస్‌ ను కోరాను. కానీ ఆయన ఒప్పుకోలేదు. మరో దారి లేక ‘సర్కార్‌’ కథను బయటపెట్టాల్సి వచ్చింది. ఆ విషయంలో నేను తప్పు చేశా.. చిత్ర నిర్మాణ సంస్థ సన్‌ పిక్చర్స్‌ కు ఇప్పటికే క్షమాపణలు చెప్పాను. ఇప్పుడు దక్షిణ చిత్ర పరిశ్రమ రచయితల సంఘం అధ్యక్షుడి పదవికి రాజీనామా చేస్తున్నా’ అని భాగ్యరాజ్ తెలిపాడు. ఐతే భాగ్యరాజ్ రాజీనామాను తాము సమ్మతించమని సంఘం జనరల్‌ సెక్రటరీ మనోజ్‌ కుమార్‌ మీడియాతో తెలిపాడు.