Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : బెంగాల్ టైగర్

By:  Tupaki Desk   |   10 Dec 2015 9:38 AM GMT
మూవీ రివ్యూ : బెంగాల్ టైగర్
X
చిత్రం : బెంగాల్ టైగర్

నటీనటులు: రవితేజ- తమన్నా- రాశి ఖన్నా - బొమన్ ఇరానీ - పృథ్వీ - బ్రహ్మానందం - పోసాని కృష్ణమురళి - రావు రమేష్ - షాయాజి షిండే - నాగినీడు - ప్రభ - తనికెళ్ల భరణి తదితరులు
నేపథ్య సంగీతం: చిన్నా
సంగీతం: భీమ్స్
ఛాయాగ్రహణం: సౌందర్ రాజన్
నిర్మాత: రాధామోహన్
కథ - స్క్రీన్ ప్లే - మాటలు - దర్శకత్వం: సంపత్ నంది

‘ఏమైంది ఈవేళ లాంటి లవ్ స్టోరీతో అరంగేట్రం చేసి… రచ్చ లాంటి కమర్షియల్ హిట్టిచ్చి.. ఆపై ‘గబ్బర్ సింగ్-2’ మీద రెండేళ్లు శ్రమించి, చివరికి అనూహ్య పరిస్థితుల్లో ఆ ప్రాజెక్టు నుంచి బయటికొచ్చేసిన డైరెక్టర్ సంపత్ నంది. పవన్ తిరస్కారం తర్వాత డీలా పడిపోకుండా వెంటనే రవితేజ ఆమోదంతో తీసిన ‘బెంగాల్ టైగర్’ ఎన్నో అంచనాల మధ్య ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. గొప్ప సినిమా తీయలేదు కానీ మంచి నాన్ వెజ్ సినిమాకు రెడీగా ఉండండంటూ ముందే ప్రేక్షకుల్ని ప్రిపేర్ చేసిన సంపత్.. తాను చేసిన ప్రామిస్ ఏమేరకు నిలబెట్టుకున్నాడో చూద్దాం పదండి.

కథ:

ఆత్రేయపురం అనే గ్రామంలో అల్లరి చిల్లరిగా తిరిగేస్తున్న ఆకాష్ నారాయణ్ (రవితేజ) తాను పెళ్లి చూపులు చూసిన అమ్మాయి తనను తిరస్కరించిందన్న కోపంతో.. బాగా ఫేమస్ అయిపోదామని ఓ మీటింగ్ లో మాట్లాడుతున్న మంత్రి మీద రాయేస్తాడు. ఆ మంత్రికి ముందు ఆకాష్ మీద కోపం వచ్చినా.. తర్వాత అతడి గట్స్ చూసి తన దగ్గర పనిలో పెట్టుకుంటాడు. ఈ మంత్రి దగ్గర పని చేస్తూ హోం మంత్రిని ఇంప్రెస్ చేసి అతడి దగ్గర ఓస్డీగా అపాయింట్ అవుతాడు. హోం మంత్రి కూతురు శ్రద్ధ (రాశి ఖన్నా).. ఆకాష్ ప్రేమలో పడుతుంది. ఇద్దరికీ పెళ్లి చేద్దామని హోం మంత్రి నిర్ణయించుకుంటే.. తాను సీఎం అశోక్ గజపతి (బొమన్ ఇరానీ) కూతురైన మీరా (తమన్నా)ను ప్రేమిస్తున్నానని షాకిస్తాడు ఆకాష్. ఇంతకీ సీఎం కూతుర్ని ఇతనెందుకు ప్రేమించాడు? సీఎంకు, ఆకాష్ కు ఏదైనా వేరే వ్యవహారాలున్నాయా? ఆకాష్ గతమేంటి? అన్నది తెర మీదే చూసి తెలుసుకోవాలి.

కథనం - విశ్లేషణ:

మంత్రిగారిని మీటింగులో రాయిచ్చుకు కొట్టేస్తే సెలెబ్రెటీ అయిపోవడం.. ఆ మంత్రే అతణ్ని లక్ష రూపాయల జీతమిచ్చి పనిలో పెట్టుకోవడం.. ఆ తర్వాత హోం మంత్రి అతడికి నాలుగు లక్షలిచ్చి ఓస్డీగా నియమించుకోవడం.. కూతురు ప్రేమించిందని తెలియగానే ఇంకో మినిస్టర్ సంబంధం క్యాన్సిల్ చేసి మరీ ఇతడికిచ్చి పెళ్లి చేసేస్తాననడం.. హీరో గారేమో నేను సీఎం కూతుర్ని ప్రేమించా, ఆమెనే పెళ్లాడతాననడం.. ఆ అమ్మాయి ఒక్క మీటింగులోనే ఇతగాడికి పడిపోవడం.. హోం మంత్రి కూతురు సీఎం కూతురు ఇద్దరూ హీరో కోసం తెగ కొట్టేసుకోవడం.. అబ్బో ఇలాంటి వ్యవహారాలన్నీ మన తెలుగు సినిమాల్లో మాత్రమే చూడొచ్చేమో. ఎంత మాస్ మసాలా సినిమా అయితే మాత్రం ఇంత లిబర్టీనా?

మన దగ్గర మాస్ సినిమా అనగానే దర్శకులకు ఎక్కడ లేని స్వేచ్ఛ వచ్చేస్తుంది. లాజిక్కులతో పని లేకుండా ఏమైనా రాసేయొచ్చు. ఎన్నోసార్లు వాడేసి అరిగిపోయిన కథనే మళ్లీ తిప్పి కొట్టొచ్చు. హీరోతో ఎన్ని వీర వేషాలైనా వేయించొచ్చు. సీఎంలను పీఎంలను హీరోతో ఫుట్ బాల్ ఆడించేయొచ్చు. ఇలాంటి విషయాల్లో ఏమైనా అభ్యంతరాలుంటే ‘బెంగాల్ టైగర్’ మీ 'కప్ ఆఫ్ టీ' కాదు. కొత్తదనం కాకరకాయ.. లాజిక్కులు లిటిగేషన్లు.. అనే మాటలు వాడితే ‘బెంగాల్ టైగర్’కు చాలా కోపం వచ్చేస్తుంది. థియేటర్లోకి వెళ్లాక బుర్రను స్విచాఫ్ చేసి సీట్లో కూర్చున్నామా… ఏదో అలా కొంచెం కామెడీని.. మాస్ రాజా మార్కు అల్లరిని.. హీరోయిన్ల అందచందాల్ని.. ఆ ఫైట్లను ఎంజాయ్ చేశామా వచ్చామా అనుకుంటే ఓకే.

ప్రథమార్ధమంతా వినోదం.. ఇంటర్వెల్ దగ్గరికి వచ్చేసరికి ఓ ట్విస్ట్.. ద్వితీయార్ధంలో ఓ ఫ్లాష్ బ్యాక్. చివర్లో రివెంజ్.. తెలుగు సినిమాల్లోనే కాదు, రవితేజ సినిమాల్లోనూ అరిగిపోయిన ఫార్ములా ఇది. సంపత్ నంది మళ్లీ ఈ ఫార్మాట్లోనే వెళ్లిపోయాడు. రవితేజ సినిమా ‘డాన్ శీను’, తన సినిమా ‘రచ్చ’ కలిపి మిక్సీలో వేసి ‘బెంగాల్ టైగర్’ రసం తీశాడు. కథ పరంగా ‘బెంగాల్ టైగర్’లో ఎగ్జైట్ కావడానికేమీ లేదు. ఇంటర్వెల్ ట్విస్టు కూడా పేలిపోయేదేమీ కాదు. సినిమాలో ప్రధానంగా చెప్పుకోవాల్సిన అంశం ప్రథమార్ధంలో వచ్చే కామెడీ. ఫ్యూచర్ స్టార్ గా పృథ్వీ చెలరేగిపోతుంటే.. సెలబ్రెటీ శాస్త్రిగా పోసాని సహకార వాయిద్యం వాయిస్తుంటే.. రవితేజ వీళ్లిద్దరి సపోర్ట్ తో బాగానే వినోదం పండించాడు. లాజిక్కుల సంగతెలా ఉన్నా ప్రథమార్ధం బోర్ కొట్టకుండా వేగంగా సాగిపోతుంది.

కానీ సెకండాఫ్ లో పెద్దగా వినోదం పండలేదు. ప్రథమార్ధమంతా కథలోకి వెళ్లకుండా ఎంటర్టైన్మెంట్ తోనే బండి లాగించేసిన సంపత్.. ద్వితీయార్ధంలో కథలోకి వెళ్లాడు. ఐతే ఇదంతా రొటీన్ వ్యవహారం కావడంతో కాలక్షేపం కష్టమవుతుంది. ఫస్టాఫ్ వరకు పృథ్వీ మీద ఎక్కువ ఆధారపడిన సంపత్.. సెకండాఫ్ లో బ్రహ్మిని నమ్ముకున్నాడు. కానీ అమలా పాల్ గా బ్రహ్మి కామెడీ పెద్దగా వర్కవుట్ కాలేదు. ఐతే హీరోయిన్లిద్దరూ అందాల ప్రదర్శనలో ఒకరితో ఒకరు పోటీ పడి కొంత వరకు సినిమాను లాక్కెళ్లారు. హీరో ఫ్లాష్ బ్యాక్.. విలన్ని ఇరికించే ప్లాన్.. క్లైమాక్స్.. అన్నీ కూడా రొటీన్. వాటిలో ఏ విశేషం లేదు. సినిమా మొత్తంలో మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే మసాలాకైతే ఢోకా లేదు.

నటీనటులు:

కథాకథనాల విషయంలోనే కాదు.. రవితేజ పాత్ర, అతడి నటన విషయంలోనూ ఏం కొత్తదనం లేదు. ఇలాంటి పాత్రలు లెక్కలేనన్ని చేశాడు. అతను తనకు అలవాటైన స్టయిల్లోనే నటించాడు. తన నుంచి అభిమానులు ఎప్పుడూ కోరుకునే వినోదాన్ని అందించే ప్రయత్నం చేశాడు. లుక్ ‘కిక్-2’తో పోలిస్తే కొంచెం బెటరే కానీ.. కొన్ని చోట్ల ఇబ్బందిరకంగానే కనిపించాడు. అతడి ఎనర్జీ విషయంలో మాత్రం ఢోకా లేదు. తమన్నా - రాశి ఖన్నా ఇద్దరికీ నటన పరంగా చేయడానికేమీ లేదు. అందాల విందులో మాత్రం ఎవరికెవరూ తీసిపోలేదు. తమన్నా ‘చూపులకే దీపాల..’ పాటలో రెచ్చిపోతే.. రాశి బికినీలో కనువిందు చేసింది. బొమన్ ఇరానీ మరోసారి తెలుగులో తన ప్రత్యేకత చూపించలేకపోయాడు. ఆయన చేయాల్సిన పాత్ర కాదు ఇది. తనదైన డైలాగ్ డెలివరీ, టైమింగ్ తో సినిమా సినిమాకు ఒక్కో మెట్టు ఎక్కుతున్న పృథ్వీ ఫ్యూచర్ స్టార్ సిద్ధప్పగా చెలరేగిపోయాడు. నటుడిగా తన విశ్వరూపం చూపించే సీన్ బాగా పేలింది. అమలా పాల్ గా బ్రహ్మీ ఎంట్రీ బాగుంది కానీ.. ఆ తర్వాత తేల్చేశారు. రావు రమేష్ - షాయాజి షిండే - నాగినీడు - తనికెళ్ల భరణి వీళ్లంతా మామూలే.

సాంకేతిక వర్గం:

భీమ్స్ పాటలు పర్వాలేదు. మాస్ కు ఎక్కే బీట్ ఉన్న పాటలే ఇచ్చాడు. చూపులకే దీపాల.. ఆసియా ఖండంలో.. రెండూ రిజిస్టరవుతాయి. చిన్నా నేపథ్య సంగీతం సినిమాకు తగ్గట్లే రొటీన్ అనిపిస్తుంది. సౌందర్ రాజన్ ఛాయాగ్రహణం బాగుంది. చూపులకే దీపాల పాటలో, యాక్షన్ సన్నివేశాల్లో కెమెరా పనితనం కనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాలో ఎక్కడా క్వాలిటీకి ఢోకా లేదు. దర్శకుడు సంపత్ నంది మాస్ ను టార్గెట్ చేసుకుని… మసాలా దినుసులేసుకుని స్క్రిప్టు రాసుకున్నాడు. ఎక్కడా కొత్తదనం గురించి, లాజిక్కుల గురించి ఆలోచించలేదు. కామెడీని బేస్ చేసుకుని ప్రథమార్ధం రేసీగా ఉండేలా స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. ద్వితీయార్ధంలో మాత్రం ఆ మ్యాజిక్ పని చేయలేదు. మాస్ మసాలా సినిమాలు తీయడంలో తన ప్రతిభను మరోసారి చాటుకున్నప్పటికీ.. మరీ రొటీన్ పద్ధతిలో వెళ్లిపోవడం, అసలేమాత్రం కొత్తదనం కోసం ప్రయత్నించకపోవడమే నిరాశ కలిగించే విషయం. “నీ ఎనర్జీని డ్రింకుగా మారిస్తే రెడ్ బుల్ మూత పడిపోతుంది”.. “నువ్వు నమ్మకానికి రూపా బనియన్ లాంటివాడివి భయ్యా”.. “వీడు ఆవులిస్తే పేగులే కాదు.. పేగుల్లోని పలావును కూడా లెక్కబెట్టేస్తాడు”.. లాంటి సంపత్ పంచ్ డైలాగులు అక్కడక్కడా పేలాయి.

చివరగా: రొటీన్ మాస్ మసాలా టైగర్


రేటింగ్: 2.75/5