Begin typing your search above and press return to search.

పంతం వీడిన బెల్లంకొండ... టైగర్ ను వదిలేశాడట!

By:  Tupaki Desk   |   31 Jan 2022 2:40 AM GMT
పంతం వీడిన బెల్లంకొండ... టైగర్ ను వదిలేశాడట!
X
రవితేజ హీరోగా వంశీ కృష్ణ దర్శకత్వంలో అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మించబోతున్న చిత్రం 'టైగర్ నాగేశ్వరరావు'. స్టూవర్ట్‌ పురం పోలీసులకు ముచ్చెమటలు పట్టించి అప్పటి ఏపీ పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరిగిన దొంగ టైగర్ నాగేశ్వరరావు బయో పిక్ గా ఈ సినిమా రూపొందబోతుంది. దర్శకుడు వంశీ కృష్ణ ఈ కథతో చాలా మంది హీరోల వద్దకు తిరిగాడు. రానా... నాగ చైతన్య మొదలుకుని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వరకు చాలా మంది ఈ కథ విన్నారంటూ వార్తలు వచ్చాయి. ఆ వార్తల్లో నిజం ఎంతో కాని చివరకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 'టైగర్‌ నాగేశ్వరరావు' సినిమాను చేసేందుకు ఓకే చెప్పడం జరిగింది. నిర్మాత అందుకోసం అడ్వాన్స్ లు కూడా ఇవ్వడం జరిగిందట. బెల్లంకొండ శ్రీనివాస్ హిందీ చత్రపతి పై ఎక్కువ ఫోకస్‌ పెట్టి టైగర్ నాగేశ్వరరావుకు డేట్లు ఇవ్వకుండా ఆలస్యం చేశాడట. దాంతో దర్శకుడు వంశీ ఇంకా ఆలస్యం చేయలేక రవితేజకు ఆ కథను వినిపించడంతో మంచి జోరు మీదున్న మాస్‌ రాజా ఆ జోష్‌ తో టైగర్‌ నాగేశ్వరరావుకు కథకు ఓకే చెప్పాడు.

రెండు నెలల్లో షూటింగ్ ప్రారంభంకు డేట్లు ఇస్తానంటూ రవితేజ చెప్పడంతో బెల్లంకొండ శ్రీనివాస్ తో ప్రాజెక్ట్ ను క్యాన్సిల్‌ చేసుకుని టైగర్‌ నాగేశ్వరరావు ను కొత్త గా ప్రకటించారు. రవితేజ హీరోగా టైగర్ నాగేశ్వరరావు ప్రకటించడంతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు కోపం వచ్చింది. తనతో చేస్తానంటూ అడ్వాన్స్ ఇచ్చి.. తనకు చెప్పకుండా రవితేజ తో ఎలా ఆ ప్రాజెక్ట్‌ ను ప్రకటిస్తారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు. టైగర్ నాగేశ్వరరావు ఫస్ట్‌ లుక్ ను రవితేజ హీరోగా విడుదల చేశారు.

ఆ సమయంలో తాను కూడా టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఒక సినిమా ను చేస్తానంటూ స్టూవర్ట్‌ పురం దొంగ అనే టైటిల్ తో ఫస్ట్‌ లుక్‌ ను విడుదల చేశాడు. ఆ సినిమాకు నిర్మాతగా తన తండ్రి బెల్లంకొండ సురేష్ ను పేర్కొన్నాడు. పంతంకు పోయి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఆ సినిమాను అనౌన్స్ చేయడం జరిగింది అనేది టాక్‌. రవితేజకు ఈ విషయాన్ని తెలియజేసే ఉద్దేశ్యంతో బెల్లంకొండ ఆ పని చేసి ఉంటాడు అనేది సమాచారం.

బెల్లంకొండ స్టూవర్ట్ పురం దొంగ సినిమాను చేసేందుకు సిద్దం అయినా కూడా రవితేజ టైగర్ నాగేశ్వరరావును చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నాడు. అదే సమయంలో నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌ సామరస్యంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో మాట్లాడి స్టూవర్ట్‌ పురం దొంగ సినిమా ను క్యాన్సిల్‌ చేసుకునేలా ఒప్పించాడు. తన అడ్వాన్స్ ను తిరిగి తీసుకున్నాడా లేదా అనే విషయమై క్లారిటీ లేదు కాని బెల్లంకొండ తో ఆ సినిమా ను వదిలేసేలా ఒప్పించాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది.

బెల్లంకొండ నుండి అధికారికంగా ఆ ప్రకటన రాలేదు.. కాని ఖచ్చితంగా టైగర్ నాగేశ్వరరావు కథతో రవితేజ హీరోగా మాత్రమే సినిమా రాబోతుంది.. మరే హీరో కూడా ఆ కథతో సినిమాను చేయడం లేదు అంటూ టాలీవుడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. బెల్లకొండ టైగర్‌ నాగేశ్వరరావు సినిమా ను చేయాలనే ఆసక్తి ఉన్నా కూడా కరోనా ఇతర కారణాల వల్ల అశ్రద్ద చేశాడు. దాంతో రవితేజకు ఆ అవకాశం దక్కింది అనేది మీడియా వర్గాల టాక్‌.