Begin typing your search above and press return to search.

బెల్లంకొండ హీరో బాలీవుడ్ డెబ్యూకి హీరోయిన్ దొరకలేదా..??

By:  Tupaki Desk   |   6 Feb 2021 11:00 PM IST
బెల్లంకొండ హీరో బాలీవుడ్ డెబ్యూకి హీరోయిన్ దొరకలేదా..??
X
టాలీవుడ్ ఇండస్ట్రీలో అల్లుడుశీను లాంటి హిట్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు బెల్లంకొండ శ్రీనివాస్. మొదట్లో నటనపరంగా విమర్శలు ఎదుర్కొన్న హీరో ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్నాడు. కానీ చేస్తున్న ప్రతి సినిమాకి యాక్టింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటూ గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. 2019లో రాక్షసుడు సూపర్ హిట్ తర్వాత ఇటీవల అల్లుడు అదుర్స్ మూవీతో మోస్తారు హిట్ అనిపించుకున్నాడు. శీనుకు తెలుగుతో పాటు బాలీవుడ్ ప్రేక్షకులలో కూడా మంచి పేరుంది. ఎలాగంటే శీను నటించిన సినిమాలు హిందీలో డబ్బింగ్ అవుతూ.. టీవీ ఛానల్స్ లో ప్రసారం అవుతుంటాయి. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని శీను త్వరలో బాలీవుడ్ హీరోగా డెబ్యూ అయ్యేందుకు రెడీ అవుతున్నాడు. అల్లుడుశీనుతో మంచి టాలీవుడ్ డెబ్యూ అందించిన వివి వినాయక్ మళ్లీ బాలీవుడ్ డెబ్యూ అందించనున్నాడు.

స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన సూపర్ హిట్ ఛత్రపతి హిందీ రీమేక్ తో బెల్లంకొండ శ్రీనివాస్ డెబ్యూ కాబోతున్నాడు. అయితే తెలుగులో ఫస్ట్ సినిమాకే శీనుకు స్టార్ హీరోయిన్ సమంత జోడి కట్టింది. కానీ ఇప్పుడు హిందీలో శీను పక్కన నటించేందుకు ఆసక్తి చూపడం లేదని సినీవర్గాలు చెబుతున్నాయి. అయితే కొందరు ఓకే చెప్తున్నప్పటికి పారితోషికం మాత్రం అధికంగా డిమాండ్ చేస్తున్నారట. అసలు బాలీవుడ్ లో శీను డెబ్యూకు రెస్పాన్స్ ఎలా ఉంటుందో ఎవరికీ స్పష్టత లేదు. అలాగే డైరెక్టర్ వినాయక్ కూడా ఉత్తరాది ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు. అలాగే ఆయన ఇంతవరకు బాలీవుడ్ సినిమాలు చేయలేదు. ఇద్దరూ కూడా సౌత్ ఇండస్ట్రీకి చెందినవారే. కేవలం తన హిందీ డబ్బింగ్ సినిమాలకు రెస్పాన్స్ బాగుందనే ఒక్క విషయంతో ముందుకు వెళ్తే మాత్రం పప్పులో కాలేసినట్లు అయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ టాక్. చూడాలి మరి అల్లుడుశీను పక్కన ఏ హీరోయిన్ ఓకే అంటుందో!