Begin typing your search above and press return to search.

ఇన్నేళ్లకు తొలి హిట్ కొట్టాడా?

By:  Tupaki Desk   |   3 Aug 2019 3:00 PM GMT
ఇన్నేళ్లకు తొలి హిట్ కొట్టాడా?
X
బెల్లంకొండ శ్రీనివాస్ నిఖార్సయిన హిట్టుకోసం ఐదేళ్లుగా ఎదురు చూస్తున్నాడు. 2014లో ఇదే సమయంలో విడుదలైన ‘అల్లుడు శీను’తో అతను హీరోగా పరిచయం అయ్యాడు. ఆ చిత్రం ఉన్నంతలో బాగానే ఆడింది. కానీ అయిన కాడికి బడ్జెట్ పెట్టేయడం వల్ల బాక్సాఫీస్ లెక్కల ప్రకారమైతే అది డిజాస్టరే. ఆ తర్వాత ‘స్పీడున్నోడు’ నిఖార్సయిన డిజాస్టర్‌గా నిలిచింది. ‘జయ జానకి నాయకా’ బాగానే ఆడినా అది కూడా ‘అల్లుడు శీను’ కోవలోనే ఫ్లాప్‌గా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన ‘సాక్ష్యం’, ‘కవచం’, ‘సీత’ సినిమాల సంగతి చెప్పాల్సిన పని లేదు. ఐతే ఇన్నాళ్లూ చేసిన సినిమాలకు భిన్నంగా ఈసారి శ్రీనివాస్ తమిళ రీమేక్‌ను నమ్ముకున్నాడు. అది కూడా హీరోయిజం, బిల్డప్పులు లేకుండా కథ ప్రధానంగా సాగిపోయే చిత్రం. అదే.. రాక్షసుడు.

ఈ చిత్రం శుక్రవారం రిలీజై మంచి స్పందన రాబట్టుకుంది. చూసిన వాళ్లందరూ సినిమా బాగుందంటున్నారు. మాతృకతో పోలిస్తే ఆ స్థాయిలో లేదు కానీ.. ఓపెన్ మైండ్‌తో చూస్తే మాత్రం సినిమా మెప్పించేలా ఉంది. థ్రిల్లర్ జానర్ ప్రియులు కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోవచ్చు. ఆద్యంతం ఉత్కంఠభరిత మలుపులతో సినిమా థ్రిల్లర్ ప్రియులకు చక్కటి వినోదం పంచేలా ఉంది. సినిమాకు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. మౌత్ టాక్ కూడా బాగుంది. ముందు నుంచి పబ్లిసిటీ బాగుండగా.. పాజిటివ్ టాక్ వచ్చేసరికి దాన్ని మరింత పెంచారు. దీంతో తొలి రోజు ఉదయం కంటే సాయంత్రానికి వసూళ్లు పెరిగాయి. శని, ఆదివారాల్లో సినిమా హౌస్ ఫుల్స్‌తో రన్ అయ్యేలా ఉంది. తక్కువ బడ్జెట్లో తెరకెక్కడం, బయ్యర్లకు కూడా రీజనబుల్ రేట్లకు అమ్మడం ఈ సినిమాకు ప్లస్. కాబట్టి అందరూ లాభాలు అందుకునేలాగే ఉన్నారు. మొత్తానికి శ్రీనివాస్ కెరీర్లో తొలి హిట్ జమ కాబోతున్నట్లే కనిపిస్తోంది.