Begin typing your search above and press return to search.

షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లిన అక్షయ్ కుమార్ 'బెల్ బాటమ్' టీమ్...!

By:  Tupaki Desk   |   6 Aug 2020 11:10 AM GMT
షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లిన అక్షయ్ కుమార్ బెల్ బాటమ్ టీమ్...!
X
బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్‌ జెట్ స్పీడ్ తో సినిమాలు చేస్తుంటాడు. మిగతా హీరోలు అందరూ ఏడాదికి ఒక‌టో రెండో సినిమాలు చేయడమే కష్టం అనుకుంటున్న ఈ రోజుల్లో అక్ష‌య్ మాత్రం తన దైన స్పీడుతో దూసుకెళ్తున్నాడు. గతేడాది 'కేసరి' 'మిషన్ మంగళ్' 'హౌస్‌ ఫుల్ 4' 'గుడ్‌న్యూస్' సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన అక్షయ్.. 'సూర్యవంశీ' 'లక్ష్మీబాంబ్' 'పృథ్వీరాజ్' 'బచ్చన్ పాండే' 'అత్రాంగి రే' 'రక్షాబంధన్' సినిమాలు లైన్లో పెట్టాడు. ఇక 'లక్ష్మీబాంబ్' సినిమా త్వరలోనే ఓటీటీలో రిలీజ్ కానుంది. వీటితో పాటు ''బెల్ బాట‌మ్‌'' అనే సినిమా అనౌన్స్ చేసాడు అక్షయ్ కుమార్. రంజిత్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వాణీ కపూర్ - లారా దత్తా - హ్యూమా ఖురేషి ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 1980లో జరిగిన వాస్తవ సంఘటలన ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ విశేషంగా ఆకట్టుకుంది. స్కాట్లాండ్ లో 'బెల్ బాట‌మ్‌' షెడ్యూల్ ప్లాన్ చేయగా కరోనా కారణంగా ఆగిపోయింది.

కాగా కరోనా మహమ్మారి కారణంగా నాలుగు నెలలుగా నిలిచిపోయిన సినిమా షూటింగ్స్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. అయితే అవుట్ డోర్ షూట్స్ కి ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలం ఇండోర్ షూటింగ్స్ కే పరిమితం అవుతున్నారు. ఈ నేపథ్యంలో అక్షయ్ కుమార్ 'బెల్ బాటమ్' షూటింగ్ కోసం స్కాట్లాండ్ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించిన అనుమతులు తీసుకున్న 'బెల్ బాటమ్' చిత్ర యూనిట్ ప్రైవేట్ జెట్ లో స్కాట్లాండ్ వెళ్లారు. విదేశీ ప్రయాణానికి బయలుదేరిన అక్షయ్ కుమార్ - లారా దత్తా - హ్యూమా ఖురేషి - జాకీ భగ్నానీలు ముంబై ఎయిర్ పోర్ట్ లో దర్శనమిచ్చిన ఫోటోలు బయటకి వచ్చాయి. కరోనా పరీక్షలు చేయించుకునే వారు బయలుదేరారని సమాచారం. స్కాట్లాండ్ జరగనున్న భారీ షెడ్యూల్ లో వాణీ కపూర్ మరికొన్ని రోజుల్లో జాయిన్ అవుతారని తెలుస్తోంది. కరోనా మహమ్మారి సృష్టించిన అలజడి తరువాత విదేశాలలో చిత్రీకరణ ప్రారంభించనున్న ఫస్ట్ ఇండియన్ మూవీ ''బెల్ బాటమ్'' అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రాన్ని వషూ భగ్నానీ, జాకీ భగ్నానీ, దీప్షికా దేశ్‌ముఖ్, మోనీషా అద్వానీ, మధు భోజ్వానీ, నిఖిల్ అద్వానీ కలిసి నిర్మిస్తున్నారు.