Begin typing your search above and press return to search.

ఈ స్టార్ డైరెక్టర్ల వెనుక కసి.. కృషి ఉన్నాయ్!

By:  Tupaki Desk   |   24 March 2022 2:30 AM GMT
ఈ స్టార్ డైరెక్టర్ల వెనుక కసి.. కృషి ఉన్నాయ్!
X
ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడమనేది అంత తేలికగా జరిగేది కాదు. డైరెక్షన్ చేయాలనుకునేవారికి నేరుగా మెగాఫోన్ పట్టుకోవడం దాదాపు అసాధ్యం. సీనియర్ దర్శకుల దగ్గర చాలా సంవత్సరాల పాటు పని చేయాలి. అక్కడ ఎంతోకొంత అనుభవం సంపాదించాలి. ఆ తరువాత అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తూనే పరిచయాలు పెంచుకోవాలి. స్టార్ హీరోల దృష్టిలో పడాలి. వాళ్లతో సాన్నిహిత్యాన్ని పెంచుకుని, వాళ్లకి ఒక కథ వినిపించే స్థాయికి చేరుకోవాలి. ఆ కథ వాళ్లకి నచ్చితే తెలిసిన నిర్మాతలతో మాట్లాడి, దర్శకుడిగా అవకాశం ఇప్పించేవారు.

అయితే అప్పట్లో సినిమాల పట్ల గల ఉత్సాహంతో చదువుపై దృష్టి పెట్టినవారు చాలా తక్కువనే చెప్పాలి. డైరెక్షన్ చేయడానికి చాలా సమయం పడుతుంది కనుక, మధ్యలోనే చదువుకు బై చెప్పేసి అసిస్టెంట్ డైరెక్టర్లుగా చేరిపోయేవారు. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది. సీనియర్ దర్శకుల దగ్గర ఏళ్లకి ఏళ్లు పనిచేస్తూ .. ఎప్పటికో వచ్చే అవకాశం కోసం ఎదురుచూస్తూ కూర్చునే పరిస్థితి లేదు. ఏ డైరెక్టర్ దగ్గర పని చేయకుండానే మెగా ఫోన్ పట్టేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీకి కథలు .. మాటలు .. పాటలు .. రాయడానికి వచ్చిన వాళ్లంతా దర్శకులైపోతున్నారు.

ఇండస్ట్రీని దగ్గరగా చూస్తూ .. టెక్నాలజీపై అవగాహన పెంపొందించుకుని దర్శకులుగా మారిపోతున్నారు. వాళ్లు చదివిన చదువు .. దాని ద్వారా సంపాదించిన జ్ఞానం వాళ్లకి ఉపయోగపడుతోంది. ఇప్పుడున్న దర్శకులలో చాలామంది కూడా ఉన్నత చదువులు పూర్తిచేసినవారే.

సినిమాలపై గల ప్యాషన్ తో పెద్ద పెద్ద ఉద్యోగాలు వదులుకుని వచ్చి పట్టుదలతో పేరు ప్రఖ్యాతులను సంపాదించుకున్నవారే. త్రివిక్రమ్ విషయానికి వస్తే, ఆయన ఎమ్మెస్సీ గోల్డ్ మెడలిస్ట్. మ్యాథ్స్ .. సైన్స్ అధ్యాపకుడిగా అనుభవం ఉంది. రైటర్ గా వచ్చిన ఆయన, స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు.

సుకుమార్ కూడా కాకినాడలోని ఓ కాలేజ్ లో మ్యాథ్స్ చెబుతూ, సినిమాల పట్ల గల ఆసక్తితో ఇటువైపు వచ్చినవాడే. ఇంజనీరింగ్ విద్యను పూర్తిచేసి అమెరికాలో పెద్ద జాబ్ చేసిన అవసరాల, దేవ కట్టా సినిమాల పట్ల గల ఫ్యాషన్ తో జాబ్ ను వదిలేసి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. విదేశాల్లో ఉన్నత విద్యను పూర్తి చేసిన శేఖర్ కమ్ములది కూడా అదే దారి. ఇక క్రిష్ .. కొరటాల .. ఇంద్రగంటి .. రవిబాబు వీరంతా కూడా ఉన్నత విద్యను పూర్తిచేసినవారే.

దర్శకుడిగా తమదైన మార్కును చూపుతూ దూసుకుపోతున్నవారే. మారుతున్న సినిమా ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికీ .. టెక్నాలజీని అందుకోవడానికి చదువు ఎంతో ఉపయోగపడుతుందనే విషయాన్ని నిరూపించిన ఈ దర్శకులు .. కొత్తగా ఇండస్ట్రీకి రావాలనుకునేవారికి ఆదర్శమేనని చెప్పాలి.