Begin typing your search above and press return to search.

మనం ఇంతలా యాచించాలా? అడుక్కోవాలా?: తమ్మారెడ్డి

By:  Tupaki Desk   |   12 Feb 2022 8:30 AM GMT
మనం ఇంతలా యాచించాలా? అడుక్కోవాలా?: తమ్మారెడ్డి
X
ఆంధ్రప్రదేశ్‌ లో సినిమా టికెట్ల వివాదానికి ఎట్టకేలకు పరిష్కారం దొరకబోతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇటీవల చిరంజీవి నేతృత్వంలో పలువురు సినీ ప్రముఖులు సీఎం జగన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. అన్ని విషయాలపై సానుకూల స్పందన వచ్చిందని.. ఈ నెలాఖరులోపు అందరికి ఆమోదయోగ్యమైన జీవో వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసారు. అయితే ఈ వ్యవహారంలో టాలీవుడ్ పెద్దలు తమ స్థాయి కంటే చాలా కిందికి దిగి ఏపీ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసారని.. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి చేతులు జోడించి అభ్యర్థించాల్సిన అవసరం లేదనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ దీనిపై యూట్యూబ్ లో ఓ వీడియో పోస్ట్ చేసారు.

తమ్మారెడ్డి మాట్లాడుతూ.. ''సినీ ప్రముఖులు సీఎం జగన్ ని కలిసొచ్చిన తర్వాత బయటకొచ్చి అన్నీ బాగా జరిగాయని చెప్పారు. ఏపీ ప్రభుత్వానికి ఇండస్ట్రీకి మధ్య గొడవ ఉన్నదనే దాన్ని బ్రేక్ చేసినందుకు చిరంజీవి గారికి థాంక్స్. ఇన్సియేటివ్ తీసుకొని వెళ్లి మాట్లాడినందుకు చాలా సంతోషంగా ఉంది. అయితే చిరంజీవి ఒక మెగాస్టార్. మేము పెద్ద అంటాం.. ఆయన ఇండస్ట్రీకి బిడ్డ అంటారు.

పెద్ద అయినా బిడ్డ అయినా ఆత్మ గౌరవం ఒకటి ఉంటుంది. చిరంజీవి గారు ఇండస్ట్రీకి ప్రతినిధిగా వెళ్ళినప్పుడు స్వతహాగా ఆయనే పెద్ద మనిషి. కానీ ఇటీవల లీకైన వీడియో చూస్తే ఆయన యాచించినట్లు ఉంది. అది చూసి మనం ఇలాంటి స్టేజీలో ఉన్నామా అని కొంచెం బాధేసింది'' అన్నారు.

''ఇంత ఏడిస్తే అక్కడికి వెళ్తే జరిగింది సినిమా టికెట్ రేట్లు పెరగాలి అని. ఇదొక్కటే సమస్య కాదు.. ఇండస్త్ర్రీలో చాలా సమస్యలు ఉన్నాయి. ఐదో షో అన్నారు. సీఎం గారు వైజాగ్ లో స్థలాలు ఇస్తామన్నారు. అది ఓకే. కానీ ఇండస్ట్రీలోని సమస్యలన్నింటి గురించి చర్చించి ఉంటే.. మనం అడిగిన వాటన్నిటిని ఆయన ఓకే చేసినా సంతోషించే వాళ్ళం.

ఒకవేళ ఇప్పుడు రేట్లు పెరిగినా కేవలం 15-20 శాతం మాత్రమే పెంచుతారు. వాటి వల్ల వచ్చే తేడా స్వల్పమే. నాకు తెలిసి రేపు పెరగబోయే ధరల వల్ల ఒక్కో సినిమాకు 10 కోట్ల తేడా కూడా ఉండదు. దీని కోసం వీళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయాం.. సినిమా రిలీజ్ చేయలేకపోయాం అన్నారు''

''ఆరు నెలల నుంచి కానీ ఏడాది నుంచీ కానీ మనం సినిమాలు రిలీజ్ చేయలేకపోయింది కరోనా వల్ల.. సినిమా టికెట్ రేట్ల కారణంగా కాదు. టికెట్ రేట్ల వల్ల ఇప్పుడు రిలీఫ్ వచ్చేసింది.. సినిమాలు రిలీజ్ చేసుకునే అవకాశం ఇచ్చారు అనడం.. ఇలాంటివి వినడానికి చాలా బాధగా ఉన్నాయి. 'పుష్ప' 'అఖండ' సినిమాలు విపరీతంగా వసూలు చేసాయి. అంతేకంటే మనకు ఎక్కువ కావాలా? RRR వంటి పాన్ ఇండియా సినిమాకు ప్రాబ్లమ్ ఏంటి? ఏపీలో టికెట్ రేట్ల వల్ల ఎంత తేడా వస్తుంది? 20-25 కోట్ల కోసం వీళ్ళందరూ వెళ్లి యాచించాలా? అడుక్కోవాలా? దీంతో ఏమన్నా ఉందా అనేది ఆలోచించకుండా ఇండస్ట్రీకి తలమానికమైన చిరంజీవి - మహేష్ - ప్రభాస్ - రాజమౌళి వంటి వారు వెళ్లి ఇలా అడుక్కోవడం బాధగా ఉంది?''

''చిరంజీవి అంతటి ఆయన ఇలా అడగడం.. మరీ అంత రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మనమేమీ శాసించే వాళ్ళం కాదు.. కానీ మనం కూడా టాక్స్ కట్టే పౌరులమే.. మనకీ హక్కులు ఉంటాయి. మనం ఓటేసిన వాళ్ళమే. అడిగే పద్దతి మన గౌరవాన్ని కాపాడుకుంటూ.. ఎదుటివారిని కూడా గౌరవిస్తూ మాట్లాడే విధంగా ఉండాలి. ఎదిగిన కొద్దీ ఒదగమని పాట రాశారని.. మనం మరీ ఒదిగిపోయి.. అణిగిపోయి అణగారిన వర్గంలా ఉండాల్సిన అవసరం లేదు. నా బాధ అది.. నాకు అనిపించింది ఇది'' అని తమ్మారెడ్డి భరద్వాజ చెప్పుకొచ్చారు.