Begin typing your search above and press return to search.

'విజిల్ మహాలక్ష్మి'గా బ్యూటీ బేబమ్మా!

By:  Tupaki Desk   |   14 Feb 2022 7:23 AM GMT
విజిల్ మహాలక్ష్మిగా బ్యూటీ బేబమ్మా!
X
అందానికి అదృష్టం తోడైతే ఎలా ఉంటుందనేది చెప్పడానికి పెద్దగా ప్రయాస పడనక్కర లేదు. కృతి శెట్టి మాదిరిగా ఉంటుందని ఒక్క ముక్కలో చెప్పేయవచ్చు. ఏ ముహూర్తంలో ఈ బ్యూటీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిందో గానీ, అప్పటి నుంచి అవకాశాలు .. ఆ వెనుకనే విజయాలు పరిగెత్తుకు వస్తున్నాయి.

ఇంతవరకూ వరుసగా మూడు భారీ విజయాలను నమోదు చేసిన ఈ సుందరి, మరో మూడు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావడానికి రెడీ అవుతోంది. ముందుగా 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమాతో ఆమె పలకరించనుంది.

ఇక ఆ తరువాత సినిమాను ఆమె రామ్ జోడీగా చేస్తోంది. 'ది వారియర్' టైటిల్ తో ఈ యాక్షన్ ఎంటర్టైనర్ నిర్మితమవుతోంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాకి లింగుసామి దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగుతో పాటు తమిళంలోను ఈ సినిమా విడుదల కానుంది. కోలీవుడ్ మాస్ డైరెక్టర్ గా లింగసామికి మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఆయన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెబుతున్నారు.

ఈ సినిమాలో రామ్ తన కెరియర్లో మొదటిసారి పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఈ పాత్రను డిజైన్ చేసిన తీరు చాలా డిఫరెంట్ గా ఉంటుందని అంటున్నారు. ఆయన సరసన నాయికగా కృతి శెట్టి కనిపించనుంది. ఈ రోజున 'వాలెంటైన్స్ డే' సందర్భాన్ని పురస్కరించుకుని కొంతసేపటి క్రితం ఆమె ఫస్టు లుక్ ను రిలీజ్ చేశారు. జుట్టు విరబోసుకుని .. చెక్స్ షర్టు .. జీన్స్ ప్యాంట్ ధరించి స్కూటర్ పై వెళుతూ, కాస్త వెనక్కి తిరిగి లైట్ గా ఆమె ఒక స్మైల్ పారేసింది. ఇలా ఆమెను చూస్తుంటే మేఘాలపై తేలుతున్న చందమామను చూస్తున్నట్టుగా కుర్రకారుకి అనిపించడం ఖాయం.

ఈ సినిమాలో కృతి శెట్టి 'విజిల్ మహాలక్ష్మి' పాత్రలో కనిపించనుందనే విషయాన్ని ఈ పోస్టర్ ద్వారా చెప్పేశారు. 'మహాలక్ష్మి' పేరుకు ముందు విజిల్ అనేది ఎందుకు చేరి ఉంటుందనే విషయంలో ఏదో ఇంట్రెస్టింగ్ విషయమే ఉండి ఉంటుంది. కృతిని ఇలా చూసిన కుర్రాళ్లు మాత్రం విజిల్ కొట్టకుండా ఉండలేరు. 'బంగార్రాజు' సినిమాలో పల్లెటూరి బుల్లెమ్మలా 'నాగలక్ష్మి' పాత్రలో అల్లరి చేసిన కృతి, ఈ సినిమాలో పట్నం మహాలక్ష్మి పాత్రలో ఎలా మెప్పిస్తుందనేది చూడాలి.

ఇక ఈ సినిమాలో విలన్ పాత్రను ఆది పినిశెట్టి పోషించగా, మరో ముఖ్యమైన పాత్రలో అక్షర గౌడ కనిపించనుంది.