Begin typing your search above and press return to search.

'సర్దార్'పై అందాల రాశి ఆశలు

By:  Tupaki Desk   |   10 May 2021 11:30 AM GMT
సర్దార్పై అందాల రాశి ఆశలు
X
అసలైన అందం అద్దంలో చూసుకుంటే కనిపించే రూపమే రాశి ఖన్నా. మల్లెపూలన్నీ ఒక చోట చేర్చినట్టు .. గులాబీ గుత్తులతో కూర్చినట్టుగా రాశి ఖన్నా కనిపిస్తుంది. అమాయకత్వంతో కూడిన ఆమె అందానికి అభిమానులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. కావలిసినంత గ్లామర్ ... కుర్రాళ్లు కలలు కనేంత గ్లామర్ .. అవసరమైనంత నటన రాశి ఖన్నాకు ఉన్నాయి. అయినా ఆమె ఎప్పుడూ కూడా దూకుడుగా అవకాశాలను అందుకోవడానికి ప్రయత్నాలు చేయలేదు. లౌక్యం తెలియని పిల్ల అనుకున్న వాళ్లే అవకాశాలు ఇచ్చారు.

తెరపై రాశి ఖన్నాను చూస్తే, అందమైన ఉద్యానవనాన్ని చూసినట్టుగా అనిపిస్తుంది. అందాల జలపాతం తెర మీదుగా జారీ పోతుందా అనిపిస్తుంది. అలా గ్లామర్ వైపు నుంచి వచ్చిన అవకాశాలను తన నటనతో నిలబెట్టుకుంటూ వస్తోంది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ వెళుతున్న రాశి ఖన్నాను అడపాదడపా విజయాలు పలకరిస్తూనే వస్తున్నాయి. కళ్లు తిరిగిపోయే గ్లామర్ పెట్టుకుని కళ్లు మూసుకుని కూర్చుంటే ఎలా? అని ఎవరు ఉపదేశం చేశారోగానీ, ఇటీవలే ఈ సుందరి స్పీడ్ పెంచింది.

ప్రస్తుతం రాశి ఖన్నా చేతిలో ఎనిమిది సినిమాల వరకూ ఉన్నాయి .. వీటిలో కొన్ని విడుదలకు ముస్తాబవుతూ ఉంటే, మిగతావి నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ సినిమాలలో ఇటీవల 'సర్దార్' కూడా చేరింది. కార్తి కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో రాశి ఖన్నా కథానాయికగా కనువిందు చేయనుంది. ప్రస్తుతం తాను చేస్తున్న సినిమాలన్నీ విభిన్నమైనవే .. వాటిలో 'సర్దార్' స్థానం ప్రత్యేకం అని చెబుతోంది. ఈ సినిమాలో తన పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందనీ, ఈ మధ్య కాలంలో తాను ఒప్పుకున్న విలక్షణమైన పాత్ర ఇదేనని అంటోంది. ఈ పాత్ర తనకి మరింత పేరు తెచ్చిపెడుతోందని చెబుతోంది. పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, ఈ ఏడాది చివరిలోగానీ .. వచ్చే ఏడాదిలోగాని ప్రేక్షకుల ముందుకు రానుంది.