Begin typing your search above and press return to search.

హ్యాపీ బి-డే: 60 సినిమాల త్రిష‌

By:  Tupaki Desk   |   4 May 2019 4:53 AM GMT
హ్యాపీ బి-డే: 60 సినిమాల త్రిష‌
X
సౌత్ ఇండ‌స్ట్రీ బెస్ట్ హీరోయిన్స్ జాబితా తిర‌గేస్తే అందులో టాప్ 20లో త్రిష పేరు ఉండాల్సిందే. ఒక జ‌న‌రేష‌న్ ముందు అగ్ర క‌థానాయిక‌గా ఏలిన మేటి ట్యాలెంట్ త్రిష‌. ముఖ్యంగా తెలుగు- త‌మిళ ప‌రిశ్ర‌మ‌ల్లో అంద‌రు అగ్ర క‌థానాయ‌కుల స‌ర‌స‌న ఈ అమ్మ‌డు అవ‌కాశాలు అందుకుంది. చిరంజీవి- బాల‌కృష్ణ‌- వెంక‌టేష్- నాగార్జున- ర‌జ‌నీకాంత్- క‌మ‌ల్ హాసన్ లాంటి దిగ్గ‌జాల స‌ర‌స‌న నాయిక‌గా న‌టించింది. ఓవైపు అగ్ర హీరోలు... మ‌రోవైపు న‌వ‌త‌రం హీరోలు ఏరి కోరి త్రిషనే కావాల‌నుకునేవారంటే త‌న స్థాయి ఎలాంటిదో అర్థం చేసుకోవ‌చ్చు. ప్ర‌తిభ ఒక కోణం అనుకుంటే అల్ల‌రి చిల్ల‌రి వేషాల‌తో వివాదాల్లోనూ త్రిష స్పీడ్ గురించి యువ‌త‌రం నిరంత‌రం చ‌ర్చించుకుంటుంది. పెటా స‌భ్యురాలిగా మూగ ప్రాణుల‌కు త్రిష సేవ‌ల గురించి తెలిసిందే.

న‌వ‌త‌రం నాయిక‌ల వెల్లువ‌లో సీనియ‌ర్ నాయిక‌ల మ‌నుగ‌డ క‌ష్టమవుతోంది అనుకుంటున్న టైమ్ లో 96 లాంటి సంచ‌ల‌న విజ‌యంతో తిరిగి కంబ్యాక్ అయ్యింది. సంక్రాంతి బ‌రిలో ర‌జ‌నీ పేట్ట‌(పేట‌)తోనూ మ‌రో హిట్ కొట్టింది. ప్ర‌స్తుతం త‌మిళ ప‌రిశ్ర‌మ‌లో ఫుల్ స్వింగులో ఉంది ఈ సీనియ‌ర్ బ్యూటీ. వ‌రుస‌గా నాలుగు సినిమాల్లో న‌టిస్తూ బిజీగా ఉంది. గ‌ర్జ‌నై.. శ‌తురంగ వేట్టై- 2.. 1818.. ప‌ర‌మ‌పదం విల‌యాట్టు అనే చిత్రాల్లో న‌టిస్తోంది. చూస్తుండ‌గానే కెరీర్ 60వ సినిమా `ప‌ర‌మ‌పదం విల‌యాట్టు`లో న‌టించేస్తోంది. కొత్త జ‌న‌రేష‌న్ డామినేష‌న్ స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నా త‌న ఉనికిని చాటుకుంటూ ద‌శాబ్ధం పైగానే త్రిష కెరీర్ జ‌ర్నీ సాగించింది.

నేటి త‌రం నాయిక‌ల‌కు ఎక్స్ ప్రెష‌న్స్.. న‌ట‌న‌ ప‌రంగా.. కెరీర్ డిపెండెన్సీ ప‌రంగా త్రిష ఒక డిక్ష‌న‌రీ అనే చెప్పాలి. కొంత కాలంగా త్రిష టాలీవుడ్ కి దూరంగానే ఉంటోంది. తిరిగి కంబ్యాక్ ఎప్పుడు? అన్న‌ది వేచి చూడాల్సిందే. నేడు త్రిష పుట్టిన‌రోజు సంద‌ర్భంగా అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లో అభిమానుల నుంచి సామాజిక మాధ్య‌మాల వేదిక‌గా శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి. టాలీవుడ్ ప్ర‌ముఖుల నుంచి బ‌ర్త్ డే శుభాకాంక్ష‌లు వెల్లువెత్తాయి. నేడు త‌న కెరీర్ 60వ సినిమా `ప‌ర‌మ‌పదం విల‌యాట్టు` ట్రైల‌ర్ ని 96 కోస్టార్ విజ‌య్ సేతుప‌తి రిలీజ్ చేస్తున్నారు. త్రిష 60 పెద్ద విజ‌యం సాధించాల‌ని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.