Begin typing your search above and press return to search.

RRR తో 'బాహుబలి'ని బీట్ చేయడం అంత ఈజీ కాదు బాసూ..!

By:  Tupaki Desk   |   23 March 2022 9:33 AM GMT
RRR తో బాహుబలిని బీట్ చేయడం అంత ఈజీ కాదు బాసూ..!
X
'బాహుబలి' సినిమాతో దర్శకధీరుడు రాజమౌళి సెన్సేషన్ క్రియేట్ చేశారు. 'ది బిగినింగ్' 'ది కన్క్లూజన్' అంటూ రెండు భాగాలుగా వచ్చిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. అందుకే ఇప్పుడు జక్కన్న నుంచి వస్తున్న ''ఆర్.ఆర్.ఆర్'' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తగ్గట్టుగానే బయ్యర్లు భారీ ధరకు ఈ చిత్రాన్ని కొనుగోలు చేశారు.

అయితే సినిమాపై బజ్ ఓ రేంజ్ లో ఉన్నా.. టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఉన్నా.. అడ్వాన్స్ బుకింగ్స్ ఆశాజనకంగా ఉన్నప్పటికీ బయ్యర్లు భయపడుతున్నారని టాక్ వినిపిస్తోంది. దీనికి కారణం 'బాహుబలి' కి 'ఆర్.ఆర్.ఆర్' కు తేడా ఉండటం.. పరిస్థితులు అప్పటికి ఇప్పటికి వేర్వేరుగా ఉండటమే అని తెలుస్తోంది.

'బాహుబలి' అనేది అన్ని అంశాలు కలబోసిన ఎపిక్ ఫిక్షనల్ యాక్షన్ డ్రామా. ఫైట్స్ - ఎమోషన్స్ తో పాటుగా డ్యూయెట్ సాంగ్స్ - గ్లామర్ కూడా జత చేర్చి పక్కా కమర్షియల్ సినిమాగా రెడీ చేశారు రాజమౌళి. 'ఆర్.ఆర్.ఆర్' విషయానికొస్తే.. ఇది ఇద్దరు విప్లవ వీరుల పాత్రల స్పూర్తితో కల్పిత కథతో తెరకెక్కించిన ఫిక్షనల్ పీరియాడికల్ యాక్షన్ డ్రామా.

ఇందులో ఎమోషనల్ సాంగ్స్ తప్ప.. డ్యూయెట్స్ కు ఆస్కారం లేదు. ఎంత కల్పిత కథ అయినప్పటికీ పరిధి దాటి ఏమి చేయడానికి లేదు. ఇప్పటి వరకు వచ్చిన పాటల్లో 'నాటు నాటు' ఒక్కటే అంతో ఇంతో మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకునే సాంగ్.

'బాహుబలి' లో ప్రభాస్ - రానా లతో పాటుగా అనుష్క - తమన్నా గ్లామర్.. స్పెషల్ సాంగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక్కడ 'ఆర్.ఆర్.ఆర్' కు రామ్ చరణ్ - ఎన్టీఆర్ మాత్రమే జనాలను థియేటర్లకు రప్పించాలి. బాలీవుడ్ వారిని అట్రాక్ట్ చేయడానికి అలియా భట్ ని పెట్టారు కానీ.. సీత పాత్ర ఎలా ఉంటుందో అందరికీ ఓ అవగాహన వచ్చేసింది. అజయ్ దేవగన్ ఉన్నా ఆయన పాత్ర కొద్దిసేపే ఉంటుంది.

అయితే భారీ యాక్షన్ సీన్స్ - బలమైన భావోద్వేగాలు - కళ్ళు చెదిరే విజువల్స్ ఈ రెండు సినిమాల్లో కామన్ గా కనిపించే అంశాలు. 'బాహుబలి' సినిమా వీటిని చూపించే భారీ కలెక్షన్స్ అందుకుంది. కానీ ఇప్పుడు ఓటీటీలు రాజ్యమేలుతున్న రోజుల్లో అన్ని వర్గాల ప్రేక్షకులను RRR థియేటర్లకు రప్పించగలదా అనే సందేహాలు అందరిలో ఉన్నాయి.

ఇటీవల కాలంలో మూడు నాలుగు వారాల్లోనే పెద్ద సినిమాలు సైతం ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి కాబట్టి.. ఇంత ఖర్చు పెట్టి సినిమా చూడటం ఎందుకు.. నెలాగితే RRR డిజిటల్ వేదికల్లో చూసేయొచ్చని ఆలోచించే జనాలు కూడా ఉండే అవకాశం ఉంది.

ఇక 'బాహుబలి' సినిమా రిలీజ్ టైంలో ఎలాంటి పరీక్షలు లేకపోవడంతో విద్యార్థులు థియేటర్ల వైపు పరుగులు తీశారు. కానీ ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ విడుదల సమయానికి స్టూడెంట్స్ కు పరీక్షలు ఉన్నాయి. మరికొన్ని ఎగ్జామ్స్ కు ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో సినిమా హాళ్లకు వచ్చేవాళ్ళు తగ్గే అవకాశం లేకపోలేదు.

ఇలాంటి అంశాల్నీ దృష్టిలో పెట్టుకొని RRR బయ్యర్లు కలవరపడుతున్నారని టాక్ వినిపిస్తోంది. ఆంధ్ర మరియు సీడెడ్ ఏరియాల థియేట్రికల్ బిజినెస్ గతంలో ఎన్నడూ లేనంతగా 146 కోట్ల మార్కును తాకిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇప్పుడు కొత్త టికెట్ రేట్లు వచ్చినప్పటికీ బ్రేక్ ఈవెన్ మార్క్ టచ్ అవుతుందా లేదా అని కొనుగోలుదారులు టెన్షన్లో ఉన్నారట.

ఇదంతా ఇప్పుడు 'RRR' సినిమా కంటెంట్, టాక్ ఆధారంగానే ఉంటుంది. 'బాహుబలి' కి మించి అద్భుతమైన టాక్ వస్తే అపూర్వమైన విజయం దక్కుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి పది రోజులు రేట్లు పెంచుకోడానికి అవకాశం ఉంది కాబట్టి.. మంచి టాక్ వస్తే వసూళ్లకు ఇబ్బంది లేకపోవచ్చు. మరి బాక్సాఫీస్ వద్ద ఏం జరుగుతుందో చూడాలి.