Begin typing your search above and press return to search.

సైరాకు బ‌తుక‌మ్మ దెబ్బ‌

By:  Tupaki Desk   |   6 Oct 2019 5:46 AM GMT
సైరాకు బ‌తుక‌మ్మ దెబ్బ‌
X
సైరా న‌ర‌సింహారెడ్డి సినిమాకు బ‌తుక‌మ్మ దెబ్బ కొట్ట‌డం ఏంటి అంటారా? మామూలుగా అయితే పండుగ సీజ‌న్ అంటే సినిమాల‌కు క‌లిసొచ్చే విష‌య‌మే. అప్పుడు జ‌నాలు సినిమాల‌కు వెళ్లే మూడ్‌లోనే ఉంటారు. సెల‌వులుంటాయి కాబ‌ట్టి వీలు చూసుకుని కుటుంబాల‌తో థియేట‌ర్లకు వెళ్తారు. తెలుగు రాష్ట్రాల్లో ద‌స‌రా సీజ‌న్లో బాగానే టికెట్లు తెగుతున్నాయి. కానీ అమెరికాలో మాత్రం ప‌రిస్థితి భిన్నంగా ఉంది. అక్క‌డి తెలుగు జ‌నాలు పండుగ‌లు ప‌బ్బాలు వ‌చ్చాయంటే చాలా ప్ర‌త్యేకంగా భావిస్తారు. ముఖ్యంగా ద‌స‌రా సీజ‌న్లో బ‌తుక‌మ్మ పండుగ చేయ‌డాన్ని అంద‌రు తెలుగువాళ్లూ ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్నారు. మ‌హిళ‌లు అందంగా సింగారించుకుని బ‌తుక‌మ్మ వేడుక‌ల్లో పాల్గొన‌డాన్ని బాగా ఆస్వాదిస్తున్నారు.

ఈ వీకెండ్లో అమెరికాలో చాలా చోట్ల బ‌తుక‌మ్మ వేడుక‌లు పెద్ద ఎత్తున జ‌రుగుతున్నాయి. దీంతో కుటుంబాలు సినిమా థియేట‌ర్ల‌కు వెళ్లే అవ‌కాశాలు బాగా త‌గ్గిపోయాయి. మంచి టాక్, రివ్యూలు ఉన్న సైరాకు వీకెండ్లో వ‌సూళ్ల మోత మోగుతుంద‌ని భావించారు. కానీ ఫ్యామిలీస్ అనుకున్న స్థాయిలో థియేట‌ర్ల‌కు రాక‌పోవ‌డం వ‌సూళ్ల‌పై బాగా ప్ర‌భావం చూపుతోంది. ఆల్రెడీ అమేజాన్ ప్రైమ్ ప్ర‌భావం గ‌ట్టిగా ఉండ‌గా.. ఇంత‌కుముందులా టికెట్ల రేట్లు ఎంత పెట్టినా ముందు వెనుక చూడ‌కుండా థియేట‌ర్ల‌కు వెళ్లిపోయే అల‌వాటును కూడా యుఎస్ జ‌నాలు విడిచిపెడుతున్నారు. ఈ కార‌ణాల వ‌ల్ల సైరాకు వీకెండ్లో కూడా ఆశించిన స్థాయిలో క‌లెక్ష‌న్లు రాని ప‌రిస్థితి త‌లెత్తింద‌ని ట్రేండ్ పండిట్లు అంటున్నారు.