Begin typing your search above and press return to search.

కార్తికేయకు మాస్ ఫాలోయింగ్ పెంచే బస్తీ బాలరాజు!

By:  Tupaki Desk   |   18 March 2021 5:30 PM GMT
కార్తికేయకు మాస్ ఫాలోయింగ్ పెంచే బస్తీ బాలరాజు!
X
కార్తికేయ పేరు చెప్పగానే ఎవరికైనా గుర్తుకు వచ్చే పేరు 'ఆర్ ఎక్స్ 100'. ఇటు మాస్ ఆడియన్స్ ను .. అటు యూత్ ఆడియన్స్ ను ఆకట్టుకునే కథాంశం కావడంతో ఆయన ఈ రెండు వర్గాల ప్రేక్షకులలో క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఆ తరువాత సినిమాల విషయంలో ఆయన యూత్ కి నచ్చే కంటెంట్ కి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ వెళ్లాడు. అయితే ఈ సారి ఆయన పూర్తిస్థాయిలో మాస్ ఆడియన్స్ కి నచ్చే కథతో 'చావు కబురు చల్లగా' చేశాడు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై రూపొందిన ఈ సినిమా, రేపు భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమాలో కార్తికేయ పాత్ర పేరే 'బస్తీ బాలరాజు' .. ఈ పేరును బట్టి, గళ్ల లుంగీ .. గళ్ల చొక్కా లుక్కును బట్టి ఆయన ఎంతటి ఊరమాస్ అనేది అర్థమవుతుంది. శవాలను శ్మశానానికి తరలించే వ్యాన్ కి డ్రైవర్ గా కనిపించే ఆయన, చావుగోలలో కూడా అందుబాటులో ఉన్నవాళ్లకు బీట్ వేసేస్తుంటాడు. భర్తపోయిన బాధలో ఉన్న భార్యకి ఓ రొమాంటిక్ లుక్ పడేస్తుంటాడంటే, ఆయన క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా ఈ తరహా పాత్రలను చేయడానికి తమిళ హీరోలు ఎక్కువ ఆసక్తిని చూపుతుంటారు. అలాంటి ఉత్సాహాన్ని కార్తికేయ కనబరచడం విశేషం.

బస్తీలో బాలరాజు చేసే హడావిడి .. ఆయన బీటు వేసే తీరు .. ఆయన పాటలు ఆల్రెడీ జనంలోకి బాగా వెళ్లాయి. ఈ పాత్రలో ఆయన యాక్టింగును కుమ్మేస్తాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొత్తరకం బాడీ లాంగ్వేజ్ తో ఈ సినిమాలో ఆయన కనిపించనున్నాడు. ఈ సినిమాతో ఆయన మాస్ ఆడియన్స్ కి మరింత చేరువవుతాడని అంటున్నారు. 'ఆర్ ఎక్స్ 100' తరువాత హీరోగా ఆయనకి ఇంతవరకూ హిట్ పడలేదు. అందువలన ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందనీ .. ముఖ్యంగా మాస్ ఫాలోయింగును పెంచుతుందని ఆయన భావిస్తున్నాడు. లావణ్య త్రిపాఠి కూడా ఈ హిట్టుకోసమే వెయిట్ చేస్తోంది.