Begin typing your search above and press return to search.

చిరు క‌ళ్ల‌పై బాపు కామెంట్ అంత ప‌ని చేసిందా?

By:  Tupaki Desk   |   22 Aug 2021 1:30 AM GMT
చిరు క‌ళ్ల‌పై బాపు కామెంట్ అంత ప‌ని చేసిందా?
X
ఒక మంచి మాట‌.. ఒక మంచి పొగ‌డ్త .. ఒక‌రిని ఎంత‌గా ప్రేరేపిస్తుందో చెప్పేందుకే ఈ ఎగ్జాంపుల్. 150 సినిమాల రారాజుగా ప‌రిశ్ర‌మ‌ను శాసించిన మెగాస్టార్ చిరంజీవి ఇంత సుదీర్ఘ కెరీర్ ని సాగించారంటే దానికి ఆయన ఆరంభ రోజుల్లో ప‌డిన శ్ర‌మ ప్ర‌ణాళిక‌ ఒకెత్తు అనుకుంటే.. ఆయ‌న‌ను తొలి నాళ్ల‌లో ఎంక‌రేజ్ చేసిన గురువుల ప్రోత్సాహం అంతే గొప్ప‌ది అన‌డంలో సందేహ‌మేం లేదు. అలా చిరులోని డైన‌మిజాన్ని తొలి రోజుల్లోనే గుర్తించి ఒక చ‌క్క‌ని పొగ‌డ్త‌తో వెయ్యి వోల్టుల ఎన‌ర్జీని ఇచ్చింది ది గ్రేట్ ద‌ర్శ‌కుడు బాపు.

అడ‌యార్ యూనివ‌ర్శిటీలో న‌ట శిక్ష‌ణ పొందే స‌మ‌యంలోనే చిరంజీవికి ఊహించ‌ని విధంగానే సినిమాల్లో అవ‌కాశం వ‌చ్చింది. రాజ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో షేక్ అబ్ధుల్ ఖాద‌ర్ నిర్మించిన `పునాది రాళ్లు` లో తొలి అవ‌కాశం వ‌చ్చింది. షూటింగ్ స‌మ‌యంలో ఆయ‌న‌ న‌ట‌న‌ను క్షుణ్ణంగా గ‌మనించిన ద‌ర్శ‌క‌నిర్మాత క్రాంతి కుమార్ తాను నిర్మించ‌బోయే త‌దుప‌రి చిత్రంలో హీరోపాత్ర‌కు ఎంపిక చేశారు. ఆ చిత్రం ప్రాణం ఖ‌రీదు. ఆ చిత్రంతో కొణిదెల శివ‌శంక‌ర ప్ర‌సాద్ చిరంజీవిగా తెలుగు ప్రేక్ష‌కులోకానికి ప‌రిచ‌యం అయ్యారు. ముందుగా అంగీక‌రించింది `పునాది రాళ్లు` అయినా రిలీజైన‌ది మాత్రం ప్రాణం ఖ‌రీదు. తొలి చిత్రంతోనే న‌టుడిగా గుర్తించి అవ‌కాశాలు ఇచ్చేంత‌గా గుర్తింపు తెచ్చుకుని ఎద‌గ‌డానికి అవ‌స‌ర‌మైన‌ అవ‌కాశాలు అందుకున్నారు చిరంజీవి. ఎవ‌రి అండా దండా లేక‌పోయినా అవ‌కాశాలు వాటంత‌ట అవే వచ్చాయి.

ప్రాణం ఖ‌రీదు సినిమా అనంత‌రం ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు బాపు తాను తీయ‌బోయే మ‌న ఊరి పాండ‌వులు చిత్రంలో ఒక ముఖ్య‌మైన పాత్ర‌కు చిరంజీవిని ఎంపిక చేసారు. ఆ స‌మ‌యంలో చిరంజీవి క‌ళ్ల గురించి బాపు ఇచ్చిన కితాబు చిరంజీవి న‌ట‌జీవితంలో మ‌తాబుల్ని వెలిగించింది. ఈ అబ్బాయి క‌ళ్లు బావుంటాయి. ``ఒక ర‌కంగా చూస్తే లేడి క‌ళ్ల‌ల్లో గ్రేసు.. మ‌రో ర‌కంగా చూస్తే పులి క‌ళ్ల‌లోని రౌద్రం క‌నిపిస్తున్నాయి`` అని బాపు ఇచ్చిన కితాబును ప్ర‌శంస‌లా కాకుండా విశ్లేష‌ణాత్మ‌కంగా స్వీక‌రించి చిరంజీవి క‌ళ్ల‌తో కోటి భావాల‌ను ప్ర‌క‌టించ‌వ‌చ్చ‌ని గ్ర‌హించారు. మ‌న‌సులోంచి ఒక మంచి పొగ‌డ్త యువ‌త‌రం కెరీర్ ని మ‌తాబులా వెలిగిస్తుంద‌నేందుకు ఈ ఎగ్జాంపుల్ స్ఫూర్తిదాయ‌కం.