Begin typing your search above and press return to search.

భీమ్లాని బీట్ చేసిన బంగార్రాజు

By:  Tupaki Desk   |   20 May 2022 9:30 AM GMT
భీమ్లాని బీట్ చేసిన బంగార్రాజు
X
బాక్సాఫీస్ క‌లెక్ష‌న్ లే కాదు ఇప్ప‌డు టీజ‌ర్, ట్రైల‌ర్, సాంగ్స్ యూట్యూబ్ లో సాధించే వ్యూస్ ని కూడా రికార్డులు లెక్క‌లు వేస్తూ ఫ్యాన్స్‌, ప్రొడ్యూస‌ర్స్ , డైరెక్ట‌ర్స్ హ‌డావిడి చేస్తున్నారు. ఈ మ‌ధ్య ఇది ట్రెండ్ గా కూడా మారింది. వ‌సూళ్లే కాకుండా ఇలా వ్యూస్ ని కూడా లెక్కేస్తూ అదే రికార్డుగా చెబుతూ ప్ర‌త్యేకంగా పోస్ట‌ర్ల‌ని కూడా రిలీజ్ చేస్తున్నారు. దీనికి భారీగానే ఖ‌ర్చు చేస్తున్నారు కూడా. ఇదే త‌ర‌హాలో ఇప్పుడు సినిమా థియేట్రిక‌ల్ ర‌న్ పూర్త‌యి టెలివిజ‌న్ లో స్ట్రీమింగ్ అయినా దాని లెక్క‌లు కూడా ప్ర‌త్యేకంగా చూస్తున్నారు.

ప్ర‌చారం చేస్తున్నారు. టీఆర్పీ రేటింగ్ కూడా ఇప్పుడు స్టార్స్ సినిమాల‌కు కీల‌కంగా మారుతోంది. దీన్ని కూడా లెక్క‌ల్లోకి తీసుకుంటుండ‌టంతో ఫ్యాన్స్, ప్రొడ్యూస‌ర్స్ , డైరెక్ట‌ర్స్ టీఆర్పీ రేటింగ్ విష‌యంలోనూ ప్ర‌త్యేక శ్ర‌ద్ధ చూపిస్తున్నారు. బుల్లితెర స్ట్రీమింగ్ విష‌యంలో ఒక్కో సినిమా సాధించే టీఆర్పీ రేటింగ్స్ ని కూడా గ‌త కొంత కాలంగా రికార్డులుగా లెక్క‌లు క‌డుతున్నారు. ఇక రీసెంట్ గా థియేట‌ర్ల‌లో విడుద‌లై భారీ విజ‌యాల్ని సొంతం చేసుకున్న సినిమాల టీఆర్పీ రేటింగ్ లెక్క‌ల‌పై ప్ర‌స్తుతం చ‌ర్చ న‌డుస్తోంది.

ఈ రేసులో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన 'భీమ్లానాయ‌క్‌'ని బీట్ చేసి ముందు వ‌రుస‌లో నిలిచింది అక్కినేని వారి 'బంగార్రాజు'. సంక్రాంతి బ‌రిలో కింగ్ నాగార్జున‌, అక్కినేని నాగ‌చైత‌న్య క‌లిసి న‌టించిన చిత్రం 'బంగార్రాజు'. భారీ చిత్రాలేవీ పోటీలో లేక‌పోయినా ఈ మూవీ భారీ స్థాయిలో మాత్రం ప్ర‌భావాన్ని చూపించ‌లేక‌పోయింది. కానీ టీఆర్పీ రేటింగ్ విష‌యంలో మాత్రం స‌త్తాని చాటింది. ఇటీవ‌ల జీ తెలుగులో ప్రీమియ‌ర్ అయిన ఈ మూవీ 14రేటింగ్ ని సొంతం చేసుకుని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

ఇక భారీ అంచ‌నాల మ‌ధ్య ఫిబ్ర‌వ‌రి 25న విడుద‌లై మంచి విజ‌యాన్ని సొంతం చేసుకున్న 'భీమ్లానాయ‌క్‌' తీవ్రంగా నిరాశ ప‌రిచింది. వెండితెర‌పై హ‌ల్ చ‌ల్ చేసిన ఈ సినిమా బుల్లితెర‌పై రికార్డు స్థాయి రేటింగ్ తో ట్రెండ్ సెట్ చేస్తుంద‌ని ఫ్యాన్స్ చాలా ఆస‌క్తిగా ఎదురుచూశారు. అయితే వారి అంచ‌నాల‌ని త‌ల‌కిందులు చేస్తూ 'భీమ్లానాయ‌క్‌' కేవ‌లం 9.06 రేటింగ్ తో స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింది. అయితే ఈ స్థాయిలో 'భీమ్లానాయ‌క్' వెనుక‌బ‌డిపోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం అప్ప‌టికే ఓటీటీలో రావ‌డంతో ఈ సినిమాపై చాలా మంది టీవీ ప్రేక్ష‌కులు ఆస‌క్తిని చూపించ‌లేక‌పోయారు. దీంతో 9.06 రేటింగ్ తో 'భీమ్లానాయ‌క్‌' స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింది.

ఇక ఇటీవ‌ల ప్రీమియ‌ర్ అయిన నంద‌మూరి బాల‌కృష్ణ 'అఖండ‌' టీఆర్పీ రేటింగ్ లోనూ అదే దూకుడుని చూపించింది. 13.31 రేటింగ్ తో 'బంగార్రాజు' త‌రువాత నిల‌చింది. బోయ‌పాటి శ్రీ‌ను డైరెక్ట్ చేసిన ఈ మూవీ గ‌త ఏడాది డిసెంబ‌ర్ లో విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించిన విష‌యం తెలిసిందే.

ఇక సిద్ధూ జొన్న‌ల‌గ‌డ్డ న‌టించిన 'డీజే టిల్లు' థియేట‌ర్ల‌లో హ‌వాని చూపించింది. బుల్లితెర టీఆర్పీ రేటింగ్ విష‌యంలోనూ అదే పంథాని అనుస‌రించి 10.83 రేటింగ్ ని సొంతం చేసుకుని ప‌వ‌న్ ఫ్యాన్స్ కి షాకిచ్చింది. అఖిల్ న‌టించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌' మూవీ కూడా 'భీమ్లానాయ‌క్‌' ని మించి 9.30 రేటింగ్ ని రాబ‌ట్ట‌డం విశేషం.