Begin typing your search above and press return to search.

మ్యూజికల్ పోస్టర్: జాతిరత్నాలు బ్యూటీతో బంగార్రాజుల ఆటాపాట..!

By:  Tupaki Desk   |   14 Dec 2021 6:36 AM GMT
మ్యూజికల్ పోస్టర్: జాతిరత్నాలు బ్యూటీతో బంగార్రాజుల ఆటాపాట..!
X
కింగ్ అక్కినేని నాగార్జున - యువ సామ్రాట్ నాగ చైతన్య కలిసి నటిస్తున్న తాజా చిత్రం ''బంగార్రాజు''. 'సోగ్గాడు మళ్ళీ వచ్చాడు' అనేది దీనికి ట్యాగ్ లైన్. కల్యాణ్‌ కృష్ణ కురసాల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో నాగ్ కు జంటగా రమ్యకృష్ణ.. చైతన్యకు జోడీగా కృతి శెట్టి నటిస్తున్నారు.

2022లో రాబోయే మోస్ట్ అవైటెడ్ చిత్రాలలో ఒకటైన ''బంగార్రాజు''.. ప్రచార కంటెంట్ తోనే అంచనాలను పెంచుతోంది. ఇప్పటికే విడుదలైన స్పెషల్ పోస్టర్స్ - చైతూ ఫస్ట్ లుక్ మరియు టీజర్ విశేష స్పందన తెచ్చుకున్నాయి. అలానే అనూప్ రూబెన్స్ సంగీత సారథ్యంలో వచ్చిన ఫస్ట్ సింగిల్ 'లడ్డుండా' మరియు రెండవ పాట 'నా కోసం' చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి.

ఇప్పుడు 'బంగార్రాజు' చిత్రం నుంచి 'పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్‌' అనే మూడో పాటని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సాంగ్ టీజర్ ని డిసెంబర్ 17న సాయంత్రం 5.12 నిమిషాలకు రిలీజ్ కానుంది. ఈ పాటలో తండ్రీకొడుకులు నాగార్జున మరియు నాగ చైతన్యతో కలసి 'జాతి రత్నాలు' ఫేమ్ ఫరియా అబ్దుల్లా స్టెప్పులు వేయనుంది.

'బంగార్రాజు' థర్డ్ సింగిల్ అనౌన్స్ మెంట్ సందర్భంగా మేకర్స్ ఇన్నోవేషన్‌ గా మ్యూజికల్ పోస్టర్ అనే కొత్త కాన్సెప్ట్‌ ను ప్రవేశపెట్టారు. 'ఓయ్ బంగార్రాజు.. నువ్ పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే బంగార్రాజూ.. మాకు ఇంకెవ్వడు కొనిపెడతాడు కోకా బ్లౌజూ..' అంటూ వచ్చిన ఈ మ్యూజికల్ డిజిటల్ పోస్టర్ ఆకట్టుకుంటోంది.

అనూప్ రూబెన్స్ ఈసారి ఓ స్పెషల్ డ్యాన్స్ నంబర్ తో రాబోతున్నట్లు ఈ మ్యూజికల్ పోస్టర్ తెలియజేస్తోంది. ఇందులో ఫరియా అబ్దుల్లాతో కలిసి అక్కినేని తండ్రీకొడుకులు డ్యాన్స్ చేస్తున్నారు. నాగ్ పంచె కట్టులో కనిపిస్తుండగా.. చై రంగురంగుల దుస్తుల్లో దసరా బుల్లోడి లుక్ లో ఉన్నారు. ఫారియా మెరిసే వేషధారణలో అటామ్ బాంబ్ లాగా ఉంది.

అక్కినేని కుటుంబానికి మరపురాని చిత్రం 'మనం' తర్వాత ''బంగార్రాజు'' చిత్రంలో నాగార్జున - నాగ చైతన్య కలిసి రెండవసారి స్క్రీన్ స్పేస్‌ ను పంచుకుంటున్నారు. నాగార్జున నటించిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ 'సోగ్గాడే చిన్ని నాయనా' చిత్రానికి ఇది సీక్వెల్. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి బరిలో నిలిపో అవకాశాలు కనిపిస్తున్నాయి.

కాగా, 'బంగార్రాజు' చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్‌ తో కలిసి జీ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తోంది. అక్కినేని నాగార్జున నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సత్యానంద్ ఈ సినిమాకి స్క్రీన్ ప్లే సమకూర్చగా.. యువరాజ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్ గా.. విజయ్ వర్ధన్ ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు.