Begin typing your search above and press return to search.

సిద్ధార్థ్ డైరెక్ట‌ర్‌ క‌ష్టాలకు తెర‌ప‌డింది..!

By:  Tupaki Desk   |   5 Jan 2016 7:19 AM GMT
సిద్ధార్థ్ డైరెక్ట‌ర్‌ క‌ష్టాలకు తెర‌ప‌డింది..!
X
భాస్క‌ర్ గుర్తున్నాడా? ఏంటి ఏ భాస్క‌ర్ అని అడుగుతున్నారా? అదేనండీ `బొమ్మ‌రిల్లు` భాస్క‌ర్‌.. గుర్తొచ్చాడా! చాలా రోజులైంది ఈ పేరు టాలీవుడ్‌ లో విని. బొమ్మ‌రిల్లు సినిమాతో మంచి డైరెక్టర్‌ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. త‌రువాత ఆరెంజ్‌ - ఒంగోలు గిత్త సినిమాలు నిరాశ‌ప‌రిచాయి. దీంతో కొన్ని రోజులుగా సైలెంట్ అయిపోయాడు. ఇప్పుడు త‌మిళంలో త‌న ప్ర‌తిభ ప‌రీక్షించ‌బోతున్నాడు. అయితే అత‌డి సినిమా విడుద‌ల‌వ‌క‌ముందే అక్క‌డ రాజ‌కీయంగా దుమార‌మే సృష్టించాడు.

మూడేళ్ల కిందట తమిళంలో విశాల్‌ హీరోగా తెరకెక్కిన ఓ సినిమాకు `మదగజ రాజా` అనే పేరు పెట్టుకున్నారు. దాన్ని షార్ట్‌ కట్లో 'ఎంజీఆర్‌' అని పిలుచుకున్నారు. అంతే ఇంకేముంది.. ఎంజీఆర్ అభిమానులు, ఏడీఎంకే పార్టీ నేతలు - కార్యకర్తలు గొడవలు - ఆందోళ‌న‌లు చేశారు.. విశేష‌మేంటంటే.. ఆ సినిమా ఇప్పటికీ విడుద‌ల‌వ‌లేదు. అలాంటిది ఏకంగా 'ఏడీఎంకే' పార్టీ పేరునే వాడేస్తామంటే ఊరుకుంటారా చెప్పండి? కానీ అలాంటి సాహ‌స‌మే చేస్తున్నాడు మ‌న భాస్క‌ర్‌.

మలయాళంలో సూపర్‌ హిట్టయిన 'బెంగళూరు డేస్‌' మూవీని బొమ్మరిల్లు భాస్కర్ తమిళంలో తెర‌కెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో ఆర్య - శ్రీదివ్య - బాబీ సింహా - రానా దగ్గుబాటి - సమంత - పార్వతి మీనన్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దీనిని పీవీపీ సంస్థ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు మొదట 'అర్జున్‌ దివ్య మీనాక్షి కార్తీక్‌' అనే వర్కింగ్‌ టైటిల్‌ పెట్టారు. ఇవి సినిమాలోని ప్ర‌ధాన పాత్ర‌ల పేర్ల‌ట‌. అందుకే వారి పేర్లనే షార్ట్‌ చేసి 'ఏడీఎంకే' అనే టైటిల్‌ ప్రచారంలోకి తెచ్చారు. దీని మీద పెద్ద రాద్దాంత‌మే జ‌రుగుతోంది. ఏడీఎంకే కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. దీంతో సైలెంటుగా టైటిల్‌ మార్చేసి.. కొత్తగా బెంగళూరు నాట్గల్‌ (బెంగళూరు రోజులు) అనే పేరు పెట్టాడు భాస్కర్‌. దీంతో వివాదం సద్దుమణిగింది. నిజానికి ఈ సినిమా తెలుగులోనూ వేరుగా తెరకెక్కాల్సి ఉంది. కానీ అది పక్కకు వెళ్లిపోయింది. ఇప్పుడు త‌మిళ సినిమానే ఇక్క‌డ కూడా డ‌బ్ చేస్తార‌ని తెలుస్తోంది. ఈ సినిమాతో అయినా హిట్ కొట్టి ట్రాక్‌ లోకి రావాల‌నుకుంటున్న భాస్క‌ర్ చాక‌చ‌క్యంగా ఈ వివాదాన్ని ప‌రిష్క‌రించుకున్నాడు.