Begin typing your search above and press return to search.

బెంగళూరు డేస్.. సర్దుకోక తప్పదా?

By:  Tupaki Desk   |   24 July 2015 11:05 PM GMT
బెంగళూరు డేస్.. సర్దుకోక తప్పదా?
X
బెంగళూరు డేస్.. దాదాపు ఏడాదిగా టాలీవుడ్ లో ఈ పేరు వినిపిస్తూనే ఉంది. మలయాళంలో అద్భుత విజయం సాధించిన ఈ సినిమాను తెలుగులో, తమిళంలో రీమేక్ చేయాలని దిల్ రాజు, పొట్లూరి వరప్రసాద్ సంయుక్తంగా రీమేక్ రైట్స్ తీసుకున్నారు. ఏడాది నుంచి కాస్టింగ్ విషయంలో తర్జన భర్జన నడుస్తోంది. ముందు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఒకే కాస్టింగ్ తో తీయాలని.. అనుకున్నారు. కానీ తర్వాత రెండు భాషలకూ వేర్వేరు నటులు, వేర్వేరు దర్శకులని అన్నారు. తమిళ వెర్షన్ ఆర్య, రానా దగ్గుబాటి, బాబీ సింహా, శ్రీదివ్య ముఖ్య పాత్రల్లో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మొదలైపోయింది కూడా.

తెలుగు వెర్షన్ కు ‘ఓ మై ఫ్రెండ్’ ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తాడని చెప్పారు. నటీనటులుగా చాలామంది పేర్లు వినిపించాయి. చివరికి వరుణ్ తేజ్, శర్వానంద్, అవసరాల శ్రీనివాస్, శ్రీ దివ్య ఖాయమన్నారు. కానీ తమిళ వెర్షన్ ఆరు నెలల కిందటే మొదలై షూటింగ్ పూర్తయ్యే దశలో ఉంది. కానీ ఇప్పటికీ తెలుగు వెర్షన్ సంగతేంటో తెలియట్లేదు. ‘బెంగళూరు డేస్’ ఎమోషన్స్, ఫీల్ తో కూడిన సినిమా. మలయాళం వచ్చిన ఫీల్ ను వేరే భాషల్లో తీసుకురావడం అంత సులభమేమీ కాదు. అసలు రీమేక్ చేయడమే సాహసమంటే.. మళ్లీ తెలుగు, తమిళ భాషలకు వేర్వేరుగా తీయడమంటే కొంచెం కష్టమైన వ్యవహారమే. ఈ నేపథ్యంలోనే తమిళ వెర్షన్ నే తెలుగులో కూడా విడుదల చేద్దామన్న అభిప్రాయానికి వచ్చారని.. ఎలాగూ అందులో నటించే నటీనటులు తెలుగు వాళ్లకూ పరిచయమే కాబట్టి ఇబ్బందేమీ ఉండదని భావిస్తున్నారని.. కాబట్టి బెంగళూరు డేస్ తెలుగు వెర్షన్ ఉండకపోవచ్చని అంటున్నారు. ఇందులో వాస్తవమెంతో ఇంకొన్ని రోజుల్లో తేలిపోతుంది.