Begin typing your search above and press return to search.

'మోహన్ బాబు నన్ను బూతులు తిట్టారు.. కొట్టడానికి వచ్చారు'

By:  Tupaki Desk   |   12 Oct 2021 1:30 PM GMT
మోహన్ బాబు నన్ను బూతులు తిట్టారు.. కొట్టడానికి వచ్చారు
X
'మా' (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికలలో ప్రకాశ్ రాజ్ ప్యానల్ తరపున పోటీ చేసి గెలిచిన వారంతా రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సభ్యలందరూ చర్చించి మూకుమ్మడి రాజీనామా నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి గెలిచిన సీనియర్‌ నటుడు బెనర్జీ మాట్లాడుతూ తీవ్ర బావోద్వేగానికి గుర్యారు. 'మా' ఎన్నికల నాడు జరిగిన పరిణామాలను వివరిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

నరేష్ తనను ముఠా నాయకుడు అన్నా కూడా ఇన్నాళ్లూ మౌనంగానే ఉన్నానని బెనర్జీ అన్నారు. ఎన్నికల రోజు మోహన్ బాబు తనను బూతులు తిట్టారని.. కొట్టడానికి వచ్చారని ఆరోపించారు. ఆ సమయంలో విష్ణు గొడవ వద్దు అన్నారని.. అయినా సరే మోహన్‌ బాబు తనను అర గంట సేపు అమ్మనా బూతులు తిట్టారని చెబుతూ బెనర్జీ కన్నీరుమున్నీరయ్యారు.

''నాకు మూడు రోజులుగా నిద్రలేదు. ఎలక్షన్స్‌ లో గెలిచానని అందరూ కంగ్రాట్స్‌ చెప్పినా అది నేను తీసుకోలేకపోయాను. ఎందుకంటే ఆరోజు నన్ను మోహన్ బాబు గారు అర గంట సేపు పచ్చి బూతులు తిడుతూనే ఉన్నారు. ఎందుకు అలా చేశారో అర్ధం కాలేదు. దారుణంగా మాట్లాడారు. నేను ఎప్పుడూ ఇటువంటి మాటలు పడలేదు. నేను షాక్ లో ఉండిపోయాను. మంచు విష్ణు - మనోజ్ వచ్చి నన్ను ఓదార్చే ప్రయత్నం చేశారు'' అని బెనర్జీ చెప్పుకొచ్చారు.

''డీఆర్సీ పెద్దమనిషి గొడవ జరిగితే ఆపాలి.. కానీ, ఎవరు అలాంటి ప్రయత్నం చేయలేదు. మోహన్ బాబు గారికి పెళ్లి కాకముందే నేను ఆయన ఇంట్లో సభ్యుడిగా ఉండేవాడిని. మంచు లక్ష్మిని ఎత్తుకుని తిరిగాను. కానీ, మోహన్ బాబు వందల మందిలో అమ్మానా బూతులు తిట్టారు. కొట్టడానికి వచ్చారు. చాలా బాధ కలిగింది. మా ఫ్యామిలీ కూడా బాధ పడింది. ఇలాంటి అసోసియేషన్‌ లో ఎందుకు ఉండాలి? ఇంత అవమానంతో ఎందుకు బతకాలి అనుకున్నాను. ఇప్పుడు రాజీనామా చేసిన తర్వాత భారం తగ్గింది'' అని బెనర్జీ ఎమోషనల్ అయ్యారు.

ఈ సందర్భంగా తనీష్ మాట్లాడుతూ.. ఎన్నికల కౌంటింగ్ రోజున మోహన్ బాబు బూతులు తనను తిట్టి కొట్టడానికి వచ్చారని ఆరోపించారు. తనను సేవ్ చేయడానికి వచ్చిన బెనర్జీని దారుణంగా తిట్టారని.. తనకు బాదేసి ఏడ్చానని.. తర్వాత మంచు విష్ణు - మనోజ్ వచ్చి సముదాయించారని తనీష్ వెల్లడించారు. తనకు అమ్మే సర్వస్వమని.. మోహన్ బాబు మాటలు మర్చిపోలేకపోతున్నానని.. అమ్మని అంటే మర్చిపోలేం కదా అని అన్నారు. దెబ్బ మానిపోయినా ఆ గాయం గుర్తు అలాగే ఉంటుందని.. ఈసీ మెంబర్‌ గా భయపడి కంటిన్యూ అవ్వడం కంటే రిజైన్ చేయడమే కరెక్ట్ అనిపించింది తనీష్ చెప్పుకొచ్చారు.