Begin typing your search above and press return to search.

ఇంతకీ బండ్ల ట్వీట్ల వెనుక ఆంతర్యమేంటి..?

By:  Tupaki Desk   |   21 Feb 2022 8:00 PM IST
ఇంతకీ బండ్ల ట్వీట్ల వెనుక ఆంతర్యమేంటి..?
X
పవన్ కల్యాణ్ సినిమా వేదికల్లో ఆయన పరమ భక్తుడు బండ్ల గణేశ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటారనే సంగతి తెలిసిందే. మై నేమ్ ఈజ్ బండ్ల గణేష్.. మై గాడ్ ఈజ్ పవన్ కళ్యాణ్ అంటూ బండ్ల ఇచ్చే స్పీచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.

స్టేజ్ మీద దేవరా అంటూ పూనకం వచ్చినట్టు పవన్ ను పొగుడుతుంటే ఓవైపు ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తుంటే.. మరోవైపు యాంటీ ఫ్యాన్స్ మీమ్స్ స్టఫ్ దొరికిందని సంబరపడి పోతుంటారు.

ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ హీరోగా నటించిన 'భీమ్లా నాయక్' సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో బండ్ల గణేష్ ఏం మాట్లాడతారో.. ఎలా మాట్లాడతారో అని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అభిమానులతో సహా తేజ సజ్జా లాంటి హీరోలు సైతం బండ్ల స్పీచ్ కోసం వేచి చూస్తున్నట్లు ట్వీట్లు పెట్టారు. అయితే ఈ ఈవెంట్ కు బండ్లకు ఆహ్వానం అందలేదంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

అలానే ఓ అభిమానితో బండ్ల గణేష్ మాట్లాడినట్లు ఓ ఆడియో కాల్ లీక్ అవ్వడం.. అందులో త్రివిక్రమ్ శ్రీనివాస్ కు సంబంధించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడంతో వైరల్ గా మారింది.

ఈ నేపథ్యంలో బండ్ల గణేష్ చేస్తున్న ట్వీట్లు నెట్టింట చర్చనీయాంశం అయింది. ''ఎక్కువగా నమ్మడం.. ఎక్కువగా ప్రేమించడం.. ఎక్కువగా ఆశించడం.. ఎక్కువగా చనువు ఇవ్వడం.. ఫలితంగా వచ్చే బాధ కూడా ఎక్కువగానే ఉంటుంది'' అని ఆదివారం బండ్ల ట్వీట్ చేసారు.

'ఎవరైనా మిమ్మల్ని తిరస్కరించినా బాధ పడకండి.. అలాంటి వారు ఖరీదైన వాటిని తిరస్కరించి చవకైన వాటిని ఎంచుకుంటారు.. వారికి మీ విలువ తెలియదు' అని మరో ట్వీట్ లో పేర్కొన్నారు. సోమవారం ఉదయం ''సూర్యుడి తేఙస్సుకు... చంద్రుడి చల్లదనానికి... పవన్ పై అభిమానానికి ఎక్సపయిరీ డేట్ లేదు.. జై పవన్ కళ్యాణ్ దేవరా" అని వరుస ట్వీట్ల ప్రవాహం ప్రారంభించారు.

"పవన్...అంటే వాయువు. అది లేని చోటు భూమిపై లేదు. పవన్ పై అభిమానం కూడా వాయువులా అనంతం" "ఈశ్వరా..పవనేశ్వరా..పవరేశ్వరా.. పవన్ దేవరా" ''అంజనీ పుత్ర 'పవన ' సుత నామ.... ఊరకే ఎవరికీ రాదు.... అందరు పుడుతుంటారు చచ్చిపోతుంటారు కానీ కుండరా మాత్రమే చెరిత్రలాల్లో నిల్చిపోతారు మా దేవర పవన్ కళ్యాణ్'' అంటూ బండ్ల గణేష్ వరుస ట్వీట్స్ చేసారు. ప్రతీ ట్వీట్ లో పవన్నామస్మరణ చేయడమే కాదు.. గతంలో పవన్ ఫంక్షన్స్ లో అతని స్పీచ్ లను ఫ్యాన్స్ షేర్ చేయగా వాటిని రీట్వీట్ చేస్తూ వచ్చారు.

ఈ క్రమంలో 'భీమ్లా నాయక్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా పడింది. ఆ ప్రకటన వచ్చిన తర్వాత బండ్ల గణేష్ కూడా ట్వీట్ల ప్రవాహానికి బ్రేక్ ఇచ్చారు.

ఈవెంట్ కు తనను కూడా పిలవాలనే ఉద్దేశంతో బండ్ల గణేశ్ ఇలా ట్వీట్లు పెట్టారని.. అందుకే ఈవెంట్ క్యాన్సిల్ అవ్వగానే ఆపేశారని కామెంట్స్ వచ్చాయి. అయితే బండ్ల అన్ని ట్వీట్లు చేసినా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియోపై మాత్రం స్పందించలేదు. దీంతో నిజంగానే అది బండ్ల మాట్లాడిందే అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

త్రివిక్రమ్ తో బండ్లకు మధ్య మనస్పర్థలు వచ్చాయని.. అందుకే 'భీమ్లా నాయక్' ఫంక్షన్ కు ఆహ్వానం లేదనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే సోమవారం ఈవెంట్ ఎలాగూ లేదు కాబట్టి.. త్వరలోనే జరగబోయే ప్రీ రిలీజ్ వేడుకకు బండ్ల గణేష్ ను ఇన్వైట్ చేస్తారేమో చూడాలి. ఏదేమైనా పవన్ కళ్యాణ్ సినిమా విడుదల నేపథ్యంలో ఆయన వీరాభిమానిగా పిలవబడే బండ్ల నెట్టింట హాట్ టాపిక్ అయ్యారని చెప్పవచ్చు.