Begin typing your search above and press return to search.

MAA సొంత భ‌వంతిపై బండ విసిరిన బండ్ల‌

By:  Tupaki Desk   |   19 Aug 2021 9:00 PM IST
MAA సొంత భ‌వంతిపై బండ విసిరిన బండ్ల‌
X
మూవీ ఆర్టిస్టుల సంఘం(మా) ఎన్నిక‌ల్లో సొంత భ‌వంతి నిర్మాణ‌మే ప్ర‌ధాన ఎజెండాగా ప‌లువురు స‌భ్యులు పోటీబ‌రిలో దిగుతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌కాష్ రాజ్- మంచు విష్ణు ఇద్ద‌రూ ఇప్ప‌టికే మా సొంత భ‌వంతి నిర్మాణం కోసం తాము అంకిత‌మ‌వుతామ‌ని ప్ర‌క‌టించారు. జీవిత రాజ‌శేఖర్- హేమ‌- సీవీఎల్ వంటి వారు ఈ పోటీలో ఉన్నారు. ప్ర‌కాష్ రాజ్ తెలంగాణ ప్ర‌భుత్వాన్ని ఎక‌రం భూమి ఇవ్వాల్సిందిగా కోర‌తాన‌ని అన్నారు. అలాగే మంచు విష్ణు మా భ‌వంతి నిర్మాణానికి అవ‌స‌ర‌మ‌య్యే మొత్తం డ‌బ్బు తానే స‌మ‌కూరుస్తాన‌ని ఎవ‌రూ ఇవ్వాల్సిన ప‌నే లేదని శ‌ప‌థం చేశారు.

ఎన్నిక‌ల్లో భాగంగా ప్ర‌కాష్ రాజ్ అంద‌రి కంటే ముందే ప్యానెల్ ప్ర‌క‌టించి దూకుడు చూపారు. అనంత‌రం జైలు కెళ్లాల్సిన వాళ్ల‌ను బ‌య‌ట‌కు విడిపించి తెచ్చాం అంటూ మంచు విష్ణు ప్ర‌త్య‌ర్థుల‌పై సెటైర్లు వేశారు. ఇక న‌రేష్ ప్రెస్ మీట్ల‌తో హీటెక్కించారు. ఎవ‌రికి వారు మా సొంత బిల్డింగ్ నిర్మించ‌లేక‌పోయార‌న్న నైరాశ్యం ప్ర‌ద‌ర్శించారు. ఇక నాగ‌బాబు వ‌ర్గం ప్ర‌కాష్ రాజ్ కి అండ‌గా నిలుస్తోంది. విష్ణు ఎలా భ‌వంతి నిర్మించ‌గ‌ల‌రో స్థ‌ల సేక‌ర‌ణ ఎలా చేస్తారో చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

అయితే ఎవ‌రి వెర్ష‌న్లు వారికి ఉన్నాయి. అలాగే బండ్ల గ‌ణేష్ వెర్ష‌న్ కూడా వింటే షాక్ తినాల్సిందే. ఇప్ప‌టికే అత‌డు ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్ లో ఉన్నారు. తాజాగా ఆయన ఓ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మూవీ ఆర్టిస్టుల సంఘానికి సొంత భ‌వంతి అవ‌స‌రం లేద‌ని ప్ర‌తి ఒక్క‌రూ ఇదే ఎజెండాగా ముందుకొస్తున్నార‌ని అన్నారు. ఇప్పుడున్న స‌న్నివేశంలో మా అసోసియేష‌న్ కి సొంత భ‌వంతి అవ‌స‌రం లేద‌ని వ్యాఖ్యానించారు.

నేను మా భ‌వంతికి వ్య‌తిరేకిని. దానికంటే ముందు చేయాల్సిన పనులో ఎన్నో ఉన్నాయి. ఎం.ఏ.ఏలో ఉన్న 900 మందిలో చాలా వరకు దారిద్య్ర‌ రేఖకు దిగువన ఉన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ప‌డుతున్నారు. వారికి సొంత ఇండ్ల‌ను నిర్మించి ఇవ్వాలి. దానికోసం 20కోట్లు ఖ‌ర్చు చేయాలి. అందుకు హీరోలు కూడా ముందుకొస్తారు.. అని బండ్ల అన్నారు.

భ‌వంతి లేకపోతే ఇండస్ట్రీ ఆగిపోదు. షూటింగ్స్‌ నిలిచిపోవు. సినిమాలు చూసే వాళ్లు తగ్గిపోరు! అంటూ త‌న‌దైన శైలిలో బండ్ల పంచ్ లు విసిరారు. బండ్ల అన్న‌ది కూడా నిజ‌మే. కానీ 90ఏళ్ల సుదీర్ఘ చ‌రిత్ర క‌లిగిన టాలీవుడ్ కి కీల‌క‌మైన అసోసియేష‌న్ ఇది. ఇత‌ర అన్ని శాఖ‌ల వాళ్లు ఎవ‌రికి వారు సొంత భ‌వంతులు ఆఫీసులు అంటూ దూసుకుపోతుంటే ఖ‌రీదైన ఆర్టిస్టులున్న MAA ఇంకా ప్ర‌యివేటు భ‌వంతిలో ఎక్క‌డ వేసిన గొంగ‌ళి అక్క‌డే అన్న‌ట్టుగా ఉంద‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. ముర‌ళీ మోహ‌న్ వంటి వారు అధ్య‌క్షులుగా ఉన్న‌ప్పుడు భ‌వంతి నిర్మాణానికి అవ‌కాశం ఉన్నా ఇత‌రులెవ‌రూ ప్ర‌య‌త్నించ‌క స‌రైన కృషి చేయ‌క‌నే విఫ‌ల‌మ‌య్యామ‌ని నాగ‌బాబు ఇంత‌కుముందు ఎద్దేవా చేసిన సంగ‌తి తెలిసిన‌దే.