Begin typing your search above and press return to search.

పవన్ కళ్యాణ్ తో సినిమా చేయను: బండ్ల గణేష్

By:  Tupaki Desk   |   2 May 2022 10:20 PM IST
పవన్ కళ్యాణ్ తో సినిమా చేయను: బండ్ల గణేష్
X
టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన పవన్ కళ్యాణ్ కు ఉన్న వీరాభిమానుల్లో నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఒకరనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పవన్ కు తనకు తాను భక్తుడిగా ప్రకటించుకున్న బండ్ల.. తన ఫేవరేట్ హీరోతో 'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ సినిమాని నిర్మించారు. ఈ క్రమంలో పవన్ తో మరో మూవీ చేయాలని ఆశపడ్డారు.

'టెంపర్' తర్వాత మరో సినిమా నిర్మించని బండ్ల గణేష్.. పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లో నటిస్తున్న నేపథ్యంలో కొత్త మూవీని అనౌన్స్ చేశారు. నా బాస్ ఓకే అన్నారు.. మరోసారి నా కలలు నిజమయ్యాయంటూ.. పవన్ తో దిగిన ఓ ఫొటోని ట్విట్టర్ లో షేర్ చేసి మరీ ఘనంగా సినిమాను ప్రకటించారు.

పవన్ కళ్యాణ్ తో ఫ్యాన్స్ ఏడాది పాటు పండగ చేసుకునే సినిమా తీస్తానని బండ్ల గణేష్‌ ఎప్పటి నుంచో చెబుతూ వస్తున్నారు. దీంతో ఈ మూవీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే పవన్ తో సినిమాపై బండ్ల మరోలా స్పందించారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన బండ్ల గణేష్.. ఇప్పుడు పవన్ తో చేయాలని లేదని ప్రకటించారు. పవన్ వీలైనంత త్వరగా ముఖ్య‌మంత్రి అయిపోవాల‌ని కోరుకుంటున్నానని.. అందుకే ఈ విధంగా ఆలోచిస్తున్నట్లు పేర్కొన్నారు.

''ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ గారితో సినిమా చేయ‌కూడ‌ద‌ని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయ‌న త్వ‌ర‌గా ముఖ్య‌మంత్రి అయిపోవాల‌ని కోరుకుంటున్నాను. కాబట్టి ఆయన సినిమాలు తీయకుండా తొందరగా రాజకీయాల వైపు వెళ్లి, సీఎం అవ్వాలి'' అని బండ్ల గణేష్ అన్నారు.

ఈ ప్రకటన చేసిన కొంత సేపటికే పవన్ సినిమాల లైనప్ గురించి మాట్లాడుతూ.. ఆయన అవకాశం ఇస్తే తప్పకుండా సినిమా చేస్తానని అన్నారు గణేష్. ''పవన్ కళ్యాణ్‌ గారు ఓ వైపు రాజ‌కీయాల్లో బిజీగా ఉన్నారు. మ‌రో వైపు నాలుగైదు సినిమాలు క‌మిట్ అయ్యారు. వాటిని పూర్తి చేసే ప‌నిలో ఉన్నారు. వాటిని పూర్తి చేసుకుని నాకు అవ‌కాశం ఇస్తే త‌ప్ప‌కుండా చేస్తాను'' అని చెప్పారు.

ద‌ర్శ‌కుడితో గొడ‌వ‌లు జరిగి సినిమా ఆగిపోయింద‌నే వార్త‌ల్లో నిజం లేదని బండ్ల గణేష్ స్పష్టం చేశారు. ''నేను నాగార్జున సాగ‌ర్‌ లాంటోడిని. నీళ్లు వ‌స్తుంటాయి.. పోతుంటాయి. అన్ని నీళ్లు నావే అని అనుకోకూడ‌దు. వాళ్లంద‌రూ ఆ టైపే. కానీ నేను అక్కడే ఉంటాను. వాళ్లతో నాకు పోలికేంటి'' అని అన్నారు.

''భ‌విష్య‌త్తులో హండ్రెడ్ ప‌ర్సెంట్ సినిమాలు తీస్తాను. సినిమానే నాకిష్టం. సినిమానే నా ప్రాణం. సినిమాలే నా మోష‌న్ కాబ‌ట్టి సినిమాలు తీస్తా.. తీస్తా'' అని బండ్ల పేర్కొన్నారు. కృతజ్ఞత లేని వ్యక్తుల్ని తను మనుషులుగా కూడా చూడనని.. అన్నం పెట్టిన నిర్మాతనే అవమానించేలా మాట్లాడితే, కన్న తల్లికి ద్రోహం చేసినట్టు అవుతుందని పరోక్షంగా ఎవరినో ఉద్దేశించి కామెంట్స్ చేశారు.

పవన్ కళ్యాణ్ ఎమ్మెల్సీ ఇస్తే తీసుకుంటారా? ఆయ‌న అలా ఇస్తే మినిష్ట‌ర్ కూడా అవుతారు క‌దా?' అని అడిగిన ప్ర‌శ్న‌కు బండ్ల గణేష్ స్పందిస్తూ.. ''నాకు ఎమ్మెల్సీలు, రాజ్య‌స‌భ‌లు, ఎంపీలు వ‌ద్దు సార్.. వార్డు మెంబ‌ర్‌ గా జ‌నం ద‌య‌తో గెలిస్తే ఆ కిక్కే వేరు'' అని అన్నారు.

''ప్ర‌స్తుతం నేను రాజ‌కీయం అనే ప‌డ‌వ‌లో నేను. భ‌విష్య‌త్తులో రాజ‌కీయాల్లోకి వ‌స్తే అప్ప‌టి ప‌రిస్థితుల‌ను బ‌ట్టి నిర్ణ‌యం తీసుకుంటాను. అలాగే బొత్స స‌త్య‌నారాయ‌ణ‌గారి గురించి.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ గారి గురించి నన్ను అడ‌గ‌కండి. ఎందుకంటే వారంటే నాకు ప్రేమ‌. నా ఫ్యామిలీని ప్రేమించిన‌ట్లే వారిని ప్రేమిస్తాను'' అని బండ్ల గ‌ణేష్ చెప్పుకొచ్చారు.