Begin typing your search above and press return to search.

అవును.. ఎన్టీఆర్ మీద అలిగా..

By:  Tupaki Desk   |   1 March 2017 11:07 AM IST
అవును.. ఎన్టీఆర్ మీద అలిగా..
X
మాట్లాడటం మొదలు పెడితే చాలు.. ఓ ఫ్లోలో చెప్పేసుకుంటూ వెళ్లటం నటుడు కమ్ నిర్మాత బండ్ల గణేష్ కు అలవాటు. మనసులో ఏదీ దాచుకోకుండా చెప్పేసే అతగాడు.. అగ్రహీరోలతో తనకు జరిగిన గొడవ (అదేనండి.. మనస్పర్ధ) గురించి కూడా మాట్లాడేస్తారు. హీరోల్ని అమ్మానాన్నలతో పోల్చేస్తూనే.. వాళ్ల మీద అలగటం తన జన్మహక్కు అంటూ తనదైన శైలిలో చెప్పుకునే వైనం చూసినప్పుడు.. బండ్ల గణేషా.. మజాకానా అనిపించటమే కాదు.. ఎంతటోడినైనా తన మాటల మాయాజాలంతో బుట్టలో వేసుకునే తీరు చూసినప్పుడు అప్రయత్నంగా ముఖం మీద నవ్వు రావటం ఖాయం. తాజాగా అతనిచ్చిన ఇంటర్వ్యూలో అతడి మాటల్ని యథాతధంగా వింటే విషయం అర్థం కావటమే కాదు.. అతడి బతకనేర్చినతనం చూసి.. నవ్వుకోవటం ఖాయం.

పూరీ ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు ఆయన కాస్త చిత్రంగా ఆలోచిస్తుంటారని.. ఆయన టైటిల్స్ భిన్నంగా ఉంటాయని చెప్పుకొచ్చారు. ‘‘ఇప్పుడేదో ఆయన సినిమాలు బాగా ఆడటం లేదు కానీ.. గతంలో ఆయన సినిమాలు చాలా బాగా ఆడాయి. మేం చేసిన ‘‘టెంపర్’’ సూపర్ హిట్’’

మీ లాస్ట్ సినిమా ఏది.. ‘టెంపర్’. జూనియర్ ఎన్టీఆర్ తో మీకేదో గొడవ వచ్చేసిందని చెప్పేశారని ఇంటర్వ్యూ చూసే ఆయన అంటుంటే.. ‘లేదు లేదు.. తగాదా లేదు. ఎక్కడొచ్చింది. ఊరికే. తర్వాత అన్నీ అయిపోయినిగా’’

ముందు అయితే వచ్చింది కదా అని ఇంటర్వ్యూ చేసే ఆయన తిరిగి ప్రశ్నించినప్పుడు బండ్ల గణేశ్ స్పందిస్తూ.. ‘ఎందుకు రాదు సార్. తగదాకి మనస్పర్ధకి తేడా లేదా?’’

గొడవ కాదు మనస్పర్ధ ఎక్కడ వచ్చింది? అని ఇంటర్వ్యూ చేసిన ఆయన ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘ఎవరో ఏదో చెప్పిన చెప్పుడు మాటలు విని.. మనం అలిగాం. తర్వాత ఆయనే (ఎన్టీఆర్) కరెక్ట్ అని చెప్పాం. హీరోగారూ మీరే కరెక్ట్ అని చెప్పాం. ఆయనకీ.. ఆయన ఫ్యాన్స్ కి సారీ చెప్పాం. ఎన్టీఆర్ హార్డ్ వర్కర్ సార్. డౌటే లేదు. మనస్పర్దలు రావు సార్’’

హీరోల్ని ప్లీజ్ చేయటం అదో టెక్నిక్.. దాన్ని నేను చేసుకుంటా అని ఓపక్క అంటావ్.. మరోపక్క అదే హీరోల మీద అలుగుతావ్ అంటూ ఇంటర్వ్యూయర్ ప్రశ్నించగా.. ‘‘అలగటం అన్నది జన్మహక్కు సార్. మడిషన్నోడు అలగకుంటే వాడు మనిషి ఎలా అవుతాడు సార్. వాడు జంతువు అవుతాడు సార్. మనిషి అన్నోడు అలగడా? సార్ ఎవరిమీదైనా..’’

‘‘అలగటం వేరయ్యా.. నువ్వు వాళ్ల మీద ఆధారపడి సినిమాలు తీసుకునేటోడివి’’ అంటుంటే.. ‘‘అమ్మానాన్న మీద ఆధారపడటం ఉంటుందా సార్.. వాళ్లు మనకు జన్మనిచ్చి..’’ అంటూ చెప్పుకుపోతున్న బండ్ల గణేశ్ మాటల ప్రవాహానికి బ్రేకులు వేస్తూ.. అది వేరు.. రక్తసంబంధం అంటూ ఇంటర్వ్యూ చేసే ఆయన చెబుతుంటే.. కలగజేసుకున్న బండ్ల.. ‘‘మీరు నన్ను మాట్లాడనివ్వరు (ముద్దుగా కాస్త టోన్ పెంచి).. ఇది రక్త సంబంధం లాంటిదే. సినిమాతీసినంత కాలం రక్త సంబంధమే’’

‘ఇంతకీ.. ఎన్టీఆర్ మీద ఎందుకు అలిగా’ అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘వాళ్లు.. వీళ్లు ఏదో అన్నారని ఊరికే కాస్త అలిగాను.. తర్వాత నాదే సారీ.. క్షమించమని అడిగా.. ఎన్టీఆర్ గొప్ప హీరో కదా సార్. హార్డ్ వర్కర్.. మాంచి స్టామినా ఉన్న హీరో కదా సార్. సినిమా తీయటానికి అల్రెడీ వెళ్లా. మళ్లీ సినిమా చేయబోతున్నా’’ అని చెప్పుకొచ్చారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/