Begin typing your search above and press return to search.

జనసేన పార్టీపై బండ్ల గణేష్ వ్యాఖ్యలు: టీవీ డిబేట్ లో అలా.. ట్విట్టర్ లో ఇలా..!

By:  Tupaki Desk   |   8 Sep 2021 11:54 AM GMT
జనసేన పార్టీపై బండ్ల గణేష్ వ్యాఖ్యలు: టీవీ డిబేట్ లో అలా.. ట్విట్టర్ లో ఇలా..!
X
నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాన్‌ కు పరమ భక్తుడుగా డై హార్డ్ ఫ్యాన్ గా చెప్పుకుంటూ ఉంటారు. స్టేజ్ ఎక్కితే చాలు పవన్‌ ను దేవర అంటూ ఆకాశానికి ఎత్తేయడం అనేక సందర్భాల్లో చూశాం. అయితే ఇప్పుడు తన ఆరాధ్యదైవం పవన్ స్థాపించిన జనసేన పార్టీ పై తన అభిప్రాయం వ్యక్తం చేసి బండ్ల గణేష్ పార్టీ కార్యకర్తలు, అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు.

వివరాల్లోకి వెళ్తే.. బండ్ల గణేష్ తాజాగా ఓ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రెండు తెలుగు రాష్ట్రాల్లో జనసేన పార్టీ యొక్క బలాబలాలను ప్రస్తావించారు. ''నేను మొదట నుంచి కాంగ్రెస్ వాదిని. నా కంటే గొప్ప అభిమానులు, నాయ‌కులు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ గారి వెంట ఉన్నారు. ఏపీలో జనసేన స్ట్రాంగ్‌ గా ఉంది. కానీ తెలంగాణ విషయానికి వస్తే.. ఇక్కడ బెంజి కార్లు, ఆడీ కార్లు ఉన్నప్పుడు మారుతి 800 నడపమంటే ఎలా నడుపుతాం?'' అని బండ్ల గణేష్ అన్నారు.

''వాస్తవాలు మాట్లాడుకుంటే తెలంగాణలో ఇతర పార్టీల కంటే జనసేన ప్రభావం చాలా తక్కువగా ఉంది. అలాంటి పార్టీని భుజాన వేసుకుని మోయగలిగే శక్తి, సామర్థ్యం నాకు లేదు. అయితే పవన్ కళ్యాణ్‌ ను ముఖ్యమంత్రి కావాలను కోరుకునే వాళ్లలో నేనూ ఒకడిని'' అని బండ్ల చెప్పుకొచ్చారు. అయితే బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలపై జనసైనికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అభిమాని అయ్యుండి.. ఆయన పార్టీని ఇలా పబ్లిక్ గా ఎండగట్టడం సరికాదని విమర్శలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో బండ్ల గణేష్ తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ భవితవ్యం గురించి ఓ ట్వీట్ చేశారు. ''తెలంగాణ రాష్ట్రంలో కూడా జనసేన ఓ మహాశక్తిగా అవతరించబోతుంది'' అని పేర్కొంటూ పవన్ అభిమానులను పార్టీ కార్యకర్తలను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. అంతకుముందు 'జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక గొప్ప శక్తిగా అవతరించిన పోతుంది' అని ట్వీట్ చేసి.. మిస్టేక్స్ ఉండటంతో బండ్ల దాన్ని తొలగించారు.

ఏదేమైనా తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ పరిస్థితి గురించి నిర్మొహమాటంగా మాట్లాడి బండ్ల‌ గణేష్ కాస్త ఇబ్బంది కొనితెచ్చుకున్నారని చెప్పవచ్చు. ఈ క్రమంలో తాజాగా బండ్ల మరో ట్వీట్ చేస్తూ.. ''నాకు మెత్తగా మాట్లాడి ఐస్ చేయడం రాదు.. నా మనసుకి అనిపించింది సూటిగా మాట్లాడతాను.. అందుకే నేను ఎవరికీ నచ్చను.. ఏమి చేయను. ఇది నా నైజం'' అని పేర్కొన్నారు.