Begin typing your search above and press return to search.

మళ్ళీ మనసు మార్చుకున్న బండ్ల..!

By:  Tupaki Desk   |   18 Aug 2021 4:00 PM IST
మళ్ళీ మనసు మార్చుకున్న బండ్ల..!
X
బండ్ల గణేష్ గురించి టాలీవుడ్‌ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కమెడియన్‌ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బండ్ల.. భారీ బడ్జెట్ తో సినిమాలు నిర్మించే నిర్మాతగా ఎదిగారు. సినిమాలతో ఎంత గుర్తింపు తెచ్చుకున్నాడో.. తన మాటలతో చేష్టలతో అంత ఫేమస్ అయ్యాడు. రాజకీయాల్లో కూడా ఎంట్రీ ఇచ్చి, గత తెలంగాణ సార్వత్రిక ఎన్నికల సమయంలో సెన్సేషనల్ కామెంట్స్ తో బ్లేడ్ గణేష్ అనిపించుకున్నారు. ఆవేశంలో ఏదో ఒకటి మాట్లాడటం.. ఆ వెంటనే మనసు మార్చుకోవడం.. సోషల్ మీడియాలో ఏదొక పోస్ట్ పెట్టి కామెడీ పుట్టించడం బండ్ల గణేష్ కు అలవాటైన పని. ఇప్పుడు తాజాగా అలాంటి వ్యవహార శైలితోనే మరోసారి వార్తల్లో నిలిచారు.

బండ్ల గణేష్ నాలుగు రోజుల క్రితం సోషల్ మీడియాకు గుడ్ బై చెబుతున్నట్లుగా ట్విట్టర్‌ వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. 'త్వరలోనే ట్విట్టర్ కు గుడ్ బై చెప్పేస్తా. ఇకపై ఎలాంటి వివాదాలొద్దు.. నా జీవితంలో నేను వివాదాలు కోరుకోవడం లేదు' అని బండ్ల ట్వీట్ చేశారు. ఉన్నట్టుండి సడన్ గా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో అని అందరూ ఆలోచించారు. ట్వీట్ చూసి నిజంగానే వైదులుగుతారేమో అని అనుకున్నారు. అయితే ఇది జరిగి నాలుగు రోజులు తిరగకుండానే.. తూచ్ అంటూ తన మనసు మార్చుకున్నాడు.

ప్రజలకి సోషల్ మీడియా ద్వారా అందుబాటులో ఉండమని ఓ జర్నలిస్ట్ తనకు సలహా ఇచ్చారని.. ఆ సలహాను గౌరవంగా భావించి అందరి ముందుకి మళ్ళీ వస్తున్నాను అంటూ బండ్ల గణేష్ తెలిపారు. ట్విట్టర్ లో పెద్ద స్టేట్మెంట్ ఇవ్వడం.. వెంటనే వెనక్కి తీసుకొని బండ్ల మరోసారి కామెడీ చేసారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే బండ్ల గణేష్ మాత్రం ఇవేమీ పట్టించుకోలేదు. ఎప్పటిలాగే తన అభిమాన హీరో పవన్ ను స్తుతించే పనిలో పడ్డాడు. సూర్యుడు ఒక్కడే చంద్రుడు ఒక్కడే దేవర ఒక్కడే అంటూ పవన్ ను పొగుడుతూ ట్వీట్ పెట్టారు. అలానే అన్న ఒచ్చిండు అని పవన్ ఫ్యాన్స్ పెట్టే కామెంట్స్ ని రీ ట్వీట్లు కొడుతూ ఉన్నాడు.