Begin typing your search above and press return to search.

కీలక వేళలో కెలుక్కోవటం అవసరమా బండ్ల?

By:  Tupaki Desk   |   1 Sept 2021 11:00 AM IST
కీలక వేళలో కెలుక్కోవటం అవసరమా బండ్ల?
X
కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండటం.. అప్రమత్తంగా వ్యవహరించటం.. వీలైనంత దూరంగా ఉండటం చాలా అవసరం. ఏ సమయంలో ఏది చేయకూడదన్న దానికి నిలువెత్తు నిదర్శనంగా టాలీవుడ్ నటుడు కమ్ నిర్మాత బండ్ల గణేశ్ నిలుస్తారు. తరచూ వివాదాస్పద విషయాల్లో.. సంచలన అంశాల్లో ఆయన పేరు కనిపిస్తూ.. వినిపిస్తూ ఉంటుంది. తన ఎంట్రీతో లేనిపోని కొత్త యాంగిల్స్ ను చర్చకు వచ్చేలా చేయటంలో ఆయనకు సాటి వచ్చే వారే ఉండరన్నట్లుగా ఆయన తీరు ఉంటుంది.

సంచలనంగా మారిన టాలీవుడ్ డ్రగ్ కేసులో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాద్ ను ఈడీ అధికారులు విచారణకు పిలవటం తెలిసిందే. రెండు.. మూడు గంటలు.. లేదంటే నాలుగైదు గంటల వరకు విచారణ సాగుతుందంటే.. అది కాస్తా ఏకంగా పదకొండు గంటల పాటు సాగటంతో అందరిలోనూ ఉత్కంట పెరిగిపోయింది. ఇంతలా అంతగా ఏమని అడుగుతున్నారు? అసలేం జరుగుతోందన్నది ప్రశ్నగా మారింది. ఎవరికి ఎలాంటి సమాచారం అందని వేళలో.. సడన్ గా ఎంట్రీ ఇచ్చి.. ఇష్యూను మరింత పాపులర్ చేశారు నిర్మాత బండ్ల గణేశ్.

ఈడీ కార్యాలయానికి మంగళవారం రాత్రి ఏడు గంటల వేళలో వచ్చిన ఆయన వెంట మీడియా పరుగులు తీసింది. ఆయన ఫోటోల్ని తీయటానికి చూపించిన ఆసక్తి అంతా ఇంతా కాదు. ఇదిగో తోక అంటే అదిగో పులి అన్నట్లుగా ఉన్న ఈ రోజుల్లో.. గణేష్ ఎంట్రీతో.. ఈడీ అధికారులు ఆయన్ను పిలిపించినట్లుగా ప్రచారం సాగింది. అయినా.. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా.. అప్పటికప్పుడు విచారణకు రావాలని సినిమాల్లో ఉంటుందే తప్పించి.. రియల్ లైఫ్ లో ఉండదు. అలాంటిది బండ్ల గణేష్ ఎందుకు వచ్చారన్నది ప్రశ్నగా మారింది.

దీనికి సమాధానంగా.. ఆయన్ను విచారణ జరిపేందుకు పిలిపించినట్లుగా చెప్పారు. అయితే.. గణేష్ ఈ వ్యాఖ్యల్ని కొట్టిపారేశారు. తనకు వక్కపొడే తెలియదని.. ఈడీ నోటీసులు తనకు ఎందుకు ఇస్తుందని ఎదురు ప్రశ్నించారు. ఉదయం విచారణకు వచ్చిన పూరీ.. రాత్రి అయినా రాకపోవటంతో అసలేం జరుగుతుందో తెలుసుకోవటానికి తాను వచ్చినట్లు చెప్పారు. అయితే.. పూరీని కలిసేందుకు వచ్చిన బండ్ల గణేష్ ను అధికారులు కలవనీయలేదు. అయితే.. పూరీ కుమారుడు అకాశ్ ను పలుకరించి.. కాసేపు కూర్చొని వెళ్లిపోయినట్లుగా చెబుతున్నారు. ఈ మాత్రం దానికి రావటం ఎందుకు? హడావుడి చేయటం ఎందుకు? వెళ్లిపోవటం మరెదుకు? అన్నది ఆసక్తికర చర్చగా మారింది.