Begin typing your search above and press return to search.

గల్ఫ్ దేశాల్లో మోహన్‌లాల్ సినిమాపై నిషేధం?

By:  Tupaki Desk   |   19 Oct 2022 5:17 AM GMT
గల్ఫ్ దేశాల్లో మోహన్‌లాల్ సినిమాపై నిషేధం?
X
గల్ఫ్ దేశాలు.. ఈ పేరు చెబితేనే కఠిన చట్టాలకు పేరు. ఇక్కడ అనైతికంగా ఏం చేసినా కఠిన జైలు శిక్షలు ఉంటాయి. ఇటీవల వాట్సాప్ లో ఏదో చాట్ చేసిన భారతీయులకు కఠిన జైలు శిక్షలు విధించింది ఇక్కడి ప్రభుత్వం. నిబంధనలు తెలుసుకోకుండా అక్కడ ఏది పడితే అది చేస్తాం అంటే కుదరదు. తాజాగా గల్ఫ్ దేశాల్లో ఓ మలయాళీ సినిమాపై నిషేధం విధించడం హాట్ టాపిక్ గా మారింది.

2016లో వచ్చిన 'పులిమురుగన్' సినిమాతో మలయాళంలో ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు సీనియర్ హీరో మోహన్ లాల్ మరియు దర్శకుడు వైశాఖ్. ఆరేళ్ల విరామం తర్వాత మళ్లీ వీరిద్దరూ కలిసి తీసిన కొత్త చిత్రం 'మాన్‌స్టర్‌' ఈ శుక్రవారం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో మంచు లక్ష్మి కూడా కీలక పాత్రలో కనిపించనుంది.

విడుదలకు కొద్ది రోజుల ముందు, మాన్ స్టర్ సినిమా సమస్యల్లో పడింది. తాజా వివాదం ఏంటంటే.. ఈ చిత్రం గల్ఫ్ దేశాలైన యూఏఈ, బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఒమన్, ఖతార్ మరియు కువైట్‌లలో విడుదల కాకపోవచ్చు. అక్కడ నిషేధం విధించేందుకు రంగం సిద్ధం చేసినట్టు సమాచారం. ఈ దేశాల్లో మలయాళీలు అధికంగా ఉంటారు. వారు ఇక్కడ మలయాళ సినిమాలు ఎక్కువగా చూస్తారు. గల్ఫ్ దేశాల్లో మలయాళ చిత్ర పరిశ్రమకు పెద్ద మార్కెట్‌ ఉంది.

గల్ఫ్ దేశాలు ఈ చిత్రాన్ని నిషేధించడానికి ప్రధాన కారణం ఇందులో లెస్బియన్, గే, బై సెక్సువల్స్, ట్రాన్స్ జెండర్ కంటెంట్‌ని కలిగి ఉండడమే. ఇవన్నీ గల్ఫ్ దేశాల్లో నిషేధం. ఇలాంటివాటిపై ఉక్కుపాదం మోపుతారు. ఈ మాన్ స్టర్ చిత్రంలో కొన్ని దృశ్యాల కారణంగా గల్ఫ్ దేశాలలో ఈ చిత్రం నిషేధించబడింది. ఇది టీమ్‌తో పాటు మోహన్‌లాల్ అభిమానులకు షాక్ ఇచ్చింది.

గల్ఫ్ దేశాల్లో రీ సెన్సార్ కోసం టీమ్ దరఖాస్తు చేసుకున్నట్లు వినికిడి. దీనికి ఆమోదం లభించినా, ఈ వారం ఖచ్చితంగా విడుదల కాకపోవచ్చు అని సన్నిహితులు తెలిపారు.

ముందస్తు బుకింగ్‌లు కూడా రద్దు చేయబడ్డాయి. జిసిసి దేశాల్లో విడుదలకు సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.