Begin typing your search above and press return to search.

మాది జన్మజన్మల కలయిక.. ఆ దేవుడే మమ్మల్ని కలిపాడు

By:  Tupaki Desk   |   21 Jan 2022 7:10 AM GMT
మాది జన్మజన్మల కలయిక.. ఆ దేవుడే మమ్మల్ని కలిపాడు
X
'సింహా' 'లెజెండ్' తర్వాత నటసింహం నందమూరి బాలకృష్ణ - దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన హ్యాట్రిక్ మూవీ ''అఖండ''. డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకోవడంతో అభిమానుల కేరింతలు, ఆనందోత్సావాల మధ్య `అఖండ` చిత్రం అర్థ శతదినోత్సవ వేడుక జరిగింది. గురువారం నాడు సాయంత్రం హైదరాబాద్ లోని ఆర్.టి.సి. క్రాస్ రోడ్ లో గల సుదర్శన్ 35.ఎం.ఎం. థియేటర్ ఇందుకు వేదికైంది. ప్రేక్షకులతో కలిసి బాలయ్య - బోయపాటి శ్రీను - నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి 'అఖండ' చిత్రాన్ని చూశారు.

ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. ''ఆర్.టి.సి. క్రాస్ రోడ్ కు వస్తుంటే మా రామకృష్ణ స్టూడియో జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయన్నారు. స్టూడియోలో నాన్నగారి కోసం టిఫిన్ తీసుకు వచ్చేవాడినంటూ అప్పటి రోజులను ప్రేక్షకులకు తెలియజేశారు. మరోవైపు 'సమరసింహారెడ్డి' శతదినోత్స వేడుకకు వచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. 'అఖండ' చిత్ర విజయాన్ని గురించి ప్రస్తావిస్తూ.. ఇది ప్రేక్షకులు ఇచ్చిన విజయం. మా టీమ్ సమిష్టి కృషి అని అన్నారు.

''శివుడు భక్తుడిగా నేను చేసిన అఖండలోని పాత్ర నాన్నగారు చేసిన పాత్రలు గుర్తు చేసుంటూ వాటిని పోషించాను. మొన్ననే సంక్రాంతి పండుగ జరుపుకున్నాం. ఇప్పుడు అఖండ పండుగ ఇది. కోవిడ్ సమయంలో థియేటర్లకు ప్రేక్షకులు వస్తారోరారో అనుకున్న సమయంలో తీర్థయాత్రలకు వచ్చినట్లు థియేటర్లకు జనాలు వచ్చారు. ఇది ఆంధ్ర, తెలంగాణే కాదు, కర్నాటక, మహారాష్ట్ర, ఒరిస్సా.. అలాగే యావత్ ప్రపంచ పండుగ అఖండ అర్థ శతదినోత్సవం. ఈ వేడుకను పలుచోట్ల అభిమానులు జరుపుకుంటున్నారు. అందుకు గర్వంగా వుంది''

''ఈ సినిమా విజయాన్ని చేసేలా సహకరించిన ఆది దంపతులకు కృతజ్ఞతలు. ఇక బోయపాటి శ్రీను, నా కాంబినేషన్ హాట్రిక్. మా కలయిక జన్మజన్మలది. అందుకే ఆ దేవుడే మమ్మల్ని కలిపాడు. మానవ పుట్టుకలో ఒకరో ఇద్దిరినో స్నేహితులుగా ఇస్తారు. కానీ మాకు కోట్లాది మంది అభిమానులను సంపాదించేలా భగవంతుడు చేశాడు. నేను ఏది చేసినా అభిమానులు ప్రోత్సహిస్తూనే వున్నారు. నాకు నాన్నగారు ఆదర్శం. ఈ అఖండ విజయం తెలుగు చలన చిత్ర పరిశ్రమ విజయం''

''ఈ సినిమాలో తీసుకున్న అంశం హిందూ సమాజం, ధర్మం, పద్ధతులు. వాటిజోలికి ఎవరైనా వస్తే దేవుడు అఖండలా వచ్చి వారికి బుద్ధి చెబుతాడు. కలుషితమైపోయిన సమాజానికి ప్రక్షాణనగా ఈ సినిమా వుంది. ఇంత అద్భుతమైన విజయానికి కారకులు అభిమానులు, ప్రేక్షకులే. ఇది పాన్ ఇండియా సినిమా కాదు. పాన్ వరల్డ్ సినిమా. ఇక తమన్ సంగీతం ఈ చిత్రానికి అదరగొట్టేలా చేసింది. రిలీజ్ కాకముందు ఈ సినిమా గురించి గొప్పగా చెప్పుకున్నారు. రిలీజ్ అయ్యాక థమన్ సంగీతంలా అదిరింది అన్నారు''

''తెలుగు పరిశ్రమ ఇలాగే మూడు పువ్వులు ఆరుకాయలుగా వుండాలి. అఖండ సినిమాను థియేటర్లలో చూసి ఎంతో పెద్ద ఘనవిజయాన్ని సాధించారు. అదే విధంగా రేపు సాయంత్రం 6గంటల నుంచి డిస్నీ ప్లస్ హార్ట్ స్టార్ లో కూడా చూసి ఎంజాయ్ చేయండి'' అని బాలయ్య తెలిపారు. అనంతరం 'అఖండ' 50 రోజుల జ్ఞాపికలను ఎగ్జిబిటర్లకు పంపిణీదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో నైజాం పంపిణీదారుడు శిరీష్ రెడ్డి - సుదర్శన్ థియేటర్ అధినేత బాల గోవిందరాజు - మేనేజర్ బాలు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. ''ఆ పరమేశ్వరుని ఆశీస్సులతో అలాగే అభిమానుల అండతో తెలుగు ప్రేక్షకుల అండదండలతో బాలయ్య బాబు నా మీద పెట్టుకున్న నమ్మకంతో ఈ సినిమాకు సహకరించిన నిర్మాతలకూ అఖండ విజయం సాధించి పెట్టింది. దాదాపు వందకుపైగా థియేటర్లలో ఆడుతోంది. మంచి సినిమా తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని నిరూపించారు. ఈ విజయం నందమూరి అభిమానులది. తెలుగు ప్రేక్షకులది. తెలుగు పరిశ్రమది. ఈ విజయాన్ని ఎన్.టి.ఆర్.గారికి అంకితమిస్తూ, మా కాంబినేషన్ ఎప్పడు తీసినా మీ ఆదరాభిమానాలు వుండాలని కోరుకుంటున్నాను'' అని అన్నారు.

నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. ''నందమూరి కుటుంబానికి, ప్రేక్షకులకు నమస్కారాలు. మీ అభిమానాన్ని యాభైరోజులు ఏకధాటిగా చూపించారు. అందుకే కృతజ్ఞతలు తెలిపేందుకు మీ ముందుకు వచ్చాం. మనం ఏదైనా కల కంటే అది నిజమైతే ఆనందంగా వుంటుంది. నిజాయితీగా చెబుతున్నా.. ఇలా అఖండ సినిమా విడుదల అవుతుందనీ.. యాభై రోజులు ఆడుతుందనీ.., ఇంకా థియేటర్లలో కొనసాగుతుందని కానీ నేను కానీ, ఎవరూ కానీ కల కనలేదు. ఆ కలను నిజంచేసిన ప్రతి ఒక్కరినీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ముందుముందు ఇలాగే మీ అభిమానం ఉండాలి. జై బాలయ్య'' అని ముగించారు.