Begin typing your search above and press return to search.

ఇళయరాజాతో కోర్టులోనే తేల్చుకుంటా : బాలు

By:  Tupaki Desk   |   26 Aug 2018 9:58 AM GMT
ఇళయరాజాతో కోర్టులోనే తేల్చుకుంటా : బాలు
X
మ్యూజిక్‌ మ్యాస్ట్రో ఇళయరాజా పాటలు అంటే ఇష్టం ఉండని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో. ఎన్నో అద్బుతమైన క్లాసిక్‌ ట్యూన్స్‌ ను ఇచ్చి - దిగ్గజ సంగీత దర్శకుడిగా నిలిచిన ఇళయరాజా సంగీత ప్రయాణంలో బాలసుబ్రమణ్యం పాత్ర కూడా చాలానే ఉంది. మంచి ట్యూన్‌కు మంచి గాత్రం తోడు అయితేనే ఆ పాట శ్రోతలను అలరిస్తుంది. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన పాటలు మరో వంద సంవత్సరాల వరకు కూడా వినిపిస్తూనే ఉంటాయి. వీరి కాంబినేషన్‌ ఎంతగా అయితే హిట్‌ అయ్యిందో - అలాగే వీరిద్దరి మద్య బంధం కూడా ఉంటుంది. ఇళయరాజాను ఎప్పుడు కూడా సోదరుడిగా భావిస్తాను అంటూ బాలసుబ్రమణ్యం చెబుతూ ఉంటాడు. ఇళయరాజాకు కూడా బాు అంటే ఎంతో అభిమానం. ఇంతటి అనుబంధం ఉన్న వీరిద్దరి మద్య రాయల్టీ విషయమై వివాదం రాజుకుంది.

తాను కంపోజ్‌ చేసిన పాటను తన అనుమతి లేకుండా - రాయల్టీ చెల్లించకుండా రేడియోల్లో వేయడం కాని, ఏదైనా కార్యక్రమాల్లో పాడటం కాని చట్ట రీత్య నేరం అంటూ పలు సంస్థలకు - పలువురు సింగర్స్‌ కు ఇళయరాజా నోటీసులు పంపించడం జరిగింది. ఆ నోటీసు ఎస్పీ బాలసుబ్రమణ్యంకు కూడా అందడం అప్పట్లో సంచలనంగా మారింది. ఇళయరాజా నోటీసుతో కొన్నాళ్ల పాటు ఆయన పాటలు పాడకుండా జాగ్రత్త పడ్డ బాలు మళ్లీ ఆయన పాటలను పాడుతూనే ఉన్నాడు. మళ్లీ ఇళయరాజా పాటలను బాలు పాడుతున్న కారణంగా ఇద్దరి మద్య విభేదాలు తొలగి పోయాయి అని అంతా అనుకున్నారు. కాని ఇంకా వివాదం అలాగే ఉంది అంటూ తాజాగా బాలసుబ్రమణ్యం పేర్కొన్నారు.

ఇళయరాజా పాటలను పాడకుండా ఉండేందుకు ప్రయత్నించాను, కాని అది నా వల్ల కావడం లేదు. అందుకే మళ్లీ ఆయన ట్యూన్స్‌ను పాడుతున్నాను. ఒకవేళ ఆయన మళ్లీ నోటీసులు ఇస్తే అప్పుడు కోర్టులో తేల్చుకునేందుకు సిద్దంగా ఉన్నాను అంటూ ఎస్పీబీ చెప్పుకొచ్చారు. ఇళయరాజా స్వరపర్చిన ఎన్నో పాటలను నేను పాడాను, ఆ పాటలపై నాకు కూడా రాయల్టీ ఉంటుంది. నేను పాడిన పాటలను నేను పాడుకోవడంలో తప్పులేదు అంటూ కోర్టులో నేను నా వాదన వినిపించాలని నిర్ణయించుకున్నాను అంటూ బాలు చెప్పుకొచ్చారు. మొత్తానికి ఇళయరాజా, బాలసుబ్రమణ్యంల మద్య కోల్డ్‌ వార్‌ రన్‌ అవుతూనే ఉంది. ఈ కోల్డ్‌ వార్‌ ఎప్పుడు బరస్ట్‌ అవుతుందో అని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇళయరాజా తీరుపై ఎంతో మంది విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. తన ప్రతి పాటపై రాయల్టీ కోరుకుంటున్న ఆయన ఇతరుల ముందు చిన్నవాడిగా మిగిలి పోతున్నారు.