Begin typing your search above and press return to search.

కొత్త గాయకులకు బాలు హెచ్చరిక

By:  Tupaki Desk   |   27 Aug 2018 1:30 AM GMT
కొత్త గాయకులకు బాలు హెచ్చరిక
X
ఒకప్పుడు ఒకే సింగర్ మొత్తం సినిమాలోని అన్ని పాటలూ పాడేసేవాడు. కానీ ఇప్పుడు ఒకే పాటను ఇద్దరు ముగ్గురు కలిసి పాడుతున్నారు. ఒక సంగీత దర్శకుడు ఒక సినిమాలో పాడించిన గాయకుల్ని మరో సినిమాలో కొనసాగించట్లేదు. లోకల్ సింగర్లు ఎంత మంచి పాట పాడినా నిలదొక్కుకోవడం కష్టంగానే ఉంది. టాలెంట్ చూపించేందుకు రకరకాల వేదికలు లభిస్తున్నాయి. గాయకులు రోజు రోజుకూ పెరిగిపోతున్నారు. కానీ అందరికీ అవకాశాలు మాత్రం రావట్లేదు. కెరీర్ నిలకడగా సాగట్లేదు. ఈ నేపథ్యంలో సింగింగ్ ను కెరీర్ గా ఎంచుకునే విషయంలో జాగ్రత్తగా ఉండమంటున్నారు దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం.

‘‘ఒకప్పుడు సంగీత దర్శకుడిని కలిసి పాట వినిపించాలంటే ఏళ్లు పట్టేది. ఇప్పుడు రియాలటీ షోల్లోనే ఎవరేంటనేది చూస్తున్నారు. ఒక పాట పాడినా.. ఒక్క లైన్‌ పాడినా లీడ్‌ సింగర్‌ అంటున్నారు. ఐతే సింగింగ్ ని వృత్తిగా తీసుకోవాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి. ఉన్నచోటు తక్కువ. గాయకుల సంఖ్య పెరిగింది. ప్రతి సంగీత దర్శకుడూ తమ సినిమాల్లో కొత్త కొత్త గాయకులను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. నాకు అవకాశాలు తగ్గాయని కాదు. నాకున్న అవగాహనతో చెబుతున్నా. ఆదాయం వచ్చే మరో వృత్తిలో ఉంటూ సింగింగ్‌ ని కెరీర్ గా ఎంచుకోవచ్చు. అంతే తప్ప కేవలం సినిమా పాటల్నే నమ్ముకోవద్దు’’ అని బాలు స్పష్టం చేశారు.