Begin typing your search above and press return to search.

టీజర్ టాక్: మాస్ చొక్కాతో నారా రోహిత్

By:  Tupaki Desk   |   30 Sept 2017 2:09 PM IST
టీజర్ టాక్: మాస్ చొక్కాతో నారా రోహిత్
X
‘జ్యో అచ్యుతానంద’.. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ లాంటి మంచి విజయాలతో గత ఏడాదిని ముగించిన నారా రోహిత్.. ఈ ఏడాది ‘శమంతకమణి’.. ‘కథలో రాజకుమారి’ సినిమాలతో ఎదురు దెబ్బలు తిన్నాడు. ఇప్పుడతడి ఆశలన్నీ ‘బాలకృష్ణుడు’ మీదే ఉన్నాయి. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ తోనే జనాల్ని ఆకర్షించింది. ఈ మధ్యే నారా రోహిత్ స్టైలిష్ లుక్ తో వచ్చిన పోస్టరూ ఆకట్టుకుంది. ఇప్పుడు ‘బాలకృష్ణుడు’ టీజర్ దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ టీజర్ చూస్తే.. నారా రోహిత్ గత కొన్నేళ్లుగా చేస్తున్న సినిమాలకు భిన్నంగా కనిపిస్తోంది. ఎప్పుడూ సింపుల్ క్యారెక్టర్లు.. వైవిధ్యమైన కథల్ని ఎంచుకునే రోహిత్.. తొలిసారి కమర్షియల్ టచ్ ఉన్న సినిమా చేసినట్లుగా కనిపిస్తోంది ‘బాలకృష్ణుడు’ చూస్తే.

తన తెలివితేటలతో జనాల్ని ఆటాడుకుంటూ పనులు కానిచ్చేసే ‘మాస్’ హీరో పాత్ర చేస్తున్నట్లున్నాడు రోహిత్ ఇందులో. ‘ఢీ’.. ‘రెడీ’ తరహా శ్రీను వైట్ల ఫార్ములాలో తెరకెక్కిన సినిమాల ఛాయలు కనిపిస్తున్నాయిందులో. బ్రహ్మానందం చాలాసార్లు చేసిన బకరా పాత్రలో పృథ్వీ కనిపించాడు. రొటీనే అయినా.. కామెడీ బాగానే వర్కవుటయ్యేట్లుంది. ‘జ్యో అచ్యుతానంద’.. ‘శంకర’ తర్వాత రోహిత్ తో రెజీనా మరోసారి జత కట్టింది. సన్నబడ్డ రోహిత్ కొంచెం కొత్తగా కనిపిస్తున్నాడు టీజర్లో. ఐతే అతడి సిక్స్ ప్యాక్ లుక్ ఏమీ ఇందులో చూపించలేదు. కొత్త దర్శకుడు పవన్ మల్లెల రూపొందించిన ఈ చిత్రం నవంబర్లో ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశాలున్నాయి.