Begin typing your search above and press return to search.

కామెంట్‌: ఆయన ఒక్కడే..

By:  Tupaki Desk   |   28 May 2018 1:31 PM IST
కామెంట్‌: ఆయన ఒక్కడే..
X
తెలుగు జాతి తలుచుకునే తారక మంత్రం..

ఎదురులేని రాజసాన్ని వెండితెరపై ఆవిష్కరించిన తెలుగు వైభవం..

కోట్లాది మంది గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన అభిమానం..

ఏ పాత్రకైనా జీవం పోయగల నటనా వైదుష్యం...

పోరాటం.. ధిక్కారం కలగలసిన ఓ అపూర్వ వ్యక్తిత్వం..

తెలుగు నేల ఖ్యాతిని దేశపు నలుచెరగులా విస్తరించిన విశేష నాయకత్వం

అన్నీ కలగలసి - కలబోసిన మహామనిషి.. తెలుగు ప్రేక్షకుడు సదా గుర్తుంచుకునే నామం నందమూరి తారక రామారావు

అమాయకమైన బడి పంతులైనా.. శత్రువులపై నిప్పులు కురిపించే బొబ్బిలి పులి అయినా.. రాముడైనా..రావణుడైనా.. పాత్ర ఏదయినా దానికి ప్రాణప్రతిష్ఠ చేయగల సత్తా తారకరాముడికే సొంతం. అందుకే తెలుగు నేలలో ఆయన పేరు తెలియని వాడుండడు. ఆయన తలపురాని రోజంటూ ఉండదు. అందుకే ఆయన యుగపురుషుడు. ఆయన మేరునగ ధీరుడు.

మరణం లేని జనం ఆయనది.. అలుపెరగని గమనం ఆయనది.. అంతేలేని పయనం ఆయనది. ప్రతి తెలుగు పలుకునా వినిపించే గర్వం ఆయనది. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా ప్రఖ్యాతిగాంచిన నందమూరి తారక రామారావు జీవిత గాథ తెరకెక్కించేందుకు ఆయన తనయుడు - హీరో బాలకృష్ణ సిద్ధమయ్యారు. ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా ఈ బాధ్యతను దర్శకుడు క్రిష్ చేతుల్లో పెడుతున్నామంటూ అక్షర రూపంలో ప్రకటించారు.

జనని భారతి మెచ్చ జగతి హారతులెత్త జనశ్రేణి ఘనముగా దీవించి నడుపగా.. రణభేరి మ్రోగించె తెలుగోడు జయగీతి నినదించె మొనగాడు.. ‘‘యన్. టి. ఆర్’’ చరితార్థుడు జన్మించిన రోజు.. తెలుగుతేజం గర్వపడే రోజు... అంటూ బాలకృష్ణ తన తండ్రిపట్ల అభిమానాన్ని చాటుకున్నారు. నాటి రామకథను ఆ రాముడి బిడ్డలైన లవకుశులు చెప్పారు. నేటి రామకథను ఈ రాముడి బిడ్డలమైన మేము చెప్తున్నాము అంటూ బయోపిక్ గురించి తన భావాలను వెల్లడించారు.