Begin typing your search above and press return to search.

మోక్ష‌జ్ఞ మూవీ పూరీ.. ఇడ్లీ.. ఉప్మా.. డైరెక్షన్ లో కాదా? : బాలయ్య

By:  Tupaki Desk   |   9 Jun 2020 5:00 PM GMT
మోక్ష‌జ్ఞ మూవీ పూరీ.. ఇడ్లీ.. ఉప్మా.. డైరెక్షన్ లో కాదా? : బాలయ్య
X
తెలుగు చిత్ర పరిశ్రమలో నట వారసుల గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మిగతా ఇండస్ట్రీల సంగతి పక్కన పెడితే మన టాలీవుడ్ లో మాత్రం ఒకరు హీరోగా నిలదొక్కుకుంటే వారి బాటలో ఆ ఫామిలీ నుండి నటీనటులు ఇండస్ట్రీలో అడుగుపెడుతూనే ఉంటారు. నిజానికి బ్యాగ్రౌండ్ అనేది ఫస్ట్ సినిమాకి మాత్రమే ఉపయోగపడుతుంది. ఆ తర్వాత వారి టాలెంట్ మీదనే అతని ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది. ఈ నేపథ్యంలో మెగా ఫ్యామిలీ - అక్కినేని ఫ్యామిలీ - ఘట్టమనేని ఫ్యామిలీ - నందమూరి ఫ్యామిలీ - దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి ఎప్పటికప్పుడు కొత్త జెనరేషన్ హీరోలు సినీ ఎంట్రీ ఇస్తూ అభిమానులను ఉత్సహపరుస్తున్నారు. ఈ క్రమంలోనే నందమూరి వారసుడు - బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై అందరి దృష్టి పడింది. నందమూరి తారక రామారావు నట వారసుడిగా 14 ఏళ్ళ వయసులో ఇండస్ట్రీకి వచ్చిన బాలకృష్ణ తండ్రి పేరు నిలబెడుతూ స్టార్ హీరోగా యువ హీరోలతో దూసుకుపోతున్నాడు. ఆ తర్వాత జెనరేషన్ లో తారకరత్న కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ లు టాలీవుడ్ కి పరిచమయ్యారు. వీరు కూడా తమదైన శైలిలో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ముఖ్యంగా తాత పోలికలు పుణికి పుచ్చుకుని.. 16 ఏళ్ళ వయసులో ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన తారక్ ప్రస్తుతం టాప్ హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు అదే కోవలో 22 ఏట అడుగుపెట్టిన నందమూరి మోక్షజ్ఞ తెరంగేట్రం ఎప్పుడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మోక్షజ్ఞని హీరోగా పరిచయం చేస్తానని బాలయ్య ఎప్పుడో ప్రకటించినా ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. దాంతో ఇప్పుడు మోక్ష‌జ్ఞ ఎంట్రీ గురించి నంద‌మూరి అభిమానులు బాల‌య్య‌ను ప్ర‌శ్నిస్తున్నారు. దీనికి సమాధానంగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో త్వరలోనే వస్తాడని చెప్పాడు బాలయ్య. అయితే గత కొన్ని రోజులుగా డాషింగ్ డైరెక్టర్ పూరీ జ‌గ‌న్నాథ్ డైరెక్షన్ లో మోక్ష‌జ్ఞని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఒక ఇంటర్వ్యూలో సదరు యాంకర్ 'మోక్ష‌జ్ఞని వచ్చే ఏడాది పూరీ డైరెక్షన్ లో లేదా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఇంట్రడ్యూస్ చేయబోతున్నారట కదా' అని అడుగగా.. దీనిపై స్పందించిన బాలయ్య ''ఇడ్లీ ఉప్మా సాంబార్ డైరెక్షన్ లో కాదా..?'' అంటూ తనదైన శైలిలో ఫన్నీగా సమాధానం చెప్పారు. అంతేకాకుండా ఆ వార్తలు నిజం కాదన్నట్లు తల ఊపుతూ మోక్ష‌జ్ఞ ఎంట్రీకి భారీగా ప్లాన్స్ వేసుంచానని.. అద్భుతమైన స్క్రిప్ట్స్ కూడా తీసి పెట్టానని.. అన్ని కుదిరినప్పుడు లాంచ్ ఉంటుందని చెప్పుకొచ్చారు.