Begin typing your search above and press return to search.

బాల‌య్య సాయానికి వృద్ధుడి కంట‌త‌డి..వైర‌ల్!

By:  Tupaki Desk   |   5 Oct 2018 1:05 PM IST
బాల‌య్య సాయానికి వృద్ధుడి కంట‌త‌డి..వైర‌ల్!
X
హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే - నటుడు బాలకృష్ణ ఇటు రాజ‌కీయాల‌లో...అటు సినిమాల‌లో బిజీబిజీగా గ‌డిపేస్తుంటార‌న్న సంగ‌తి తెలిసిందే. ఇటు ఎమ్మెల్యేగా, అటు హీరోగా....రెండు పాత్ర‌ల‌కు న్యాయం చేసే క్ర‌మంలో బాల‌య్య‌కు విరామం దొరికే స‌మ‌యం చాలా త‌క్కువ‌. అయితే, త‌న‌కు దొరికిన కొద్దిపాటి విరామ స‌మ‌యాన్ని త‌న తండ్రి ఎన్టీఆర్ స్థాపించిన బ‌స‌వ‌తారకం క్యాన్స‌ర్ హాస్పిట‌ల్ బాగోగులు చూసుకునేందుకు కేటాయిస్తుంటారు. త‌మ‌కు సాయం చేయాలంటూ త‌న ద‌గ్గ‌ర‌కు వ‌చ్చే క్యాన్స‌ర్ బాధితుల‌కు బాల‌య్య బాబు...ఆప‌న్న హ‌స్తం అందిస్తుంటారు. అదే త‌ర‌హాలో తాజాగా సాయం కోరుతూ త‌న ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన ఓ వృద్ధుడికి బాల‌కృష్ణ ఆప‌న్న హ‌స్తం అందించారు. ఆ వృద్ధ క్యాన్స‌ర్ రోగికి బ‌స‌వ తార‌కం ఆసుప‌త్రిలో చికిత్స అందించేందుకు బాల‌య్య ఏర్పాట్లు చేయించారు. ప్ర‌స్తుతం ఆ ఘ‌ట‌న‌కు సంబంధించిన ఫొటోలు - వీడియోలు సోషల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి.

హంసల దీవిలో 'ఎన్టీఆర్' బయోపిక్ షూటింగ్ లో బాలయ్య బాబు బిజీగా ఉన్నారు. ఆ స‌మ‌యంలో షూటింగ్ లొకేషన్ లోకి ఓ నిరుపేద వృద్ధుడు వ‌చ్చి బాల‌య్యను క‌లిశాడు. తాను క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నానని - తనకు సాయం చేయాలని దీనంగా అర్థించాడు. ఆ వృద్ధుడి బాధ చూసి చలించిపోయిన బాలయ్య వెంట‌నే బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి ఫోన్ చేశారు. ఆ వృద్ధుడికి ఉచితంగా మెరుగైన చికిత్స అందించాలని అక్క‌డి సిబ్బందిని ఆదేశించారు. బాలయ్య సాయానికి ఆ వృద్ధుడు ఆనంద‌భాష్పాలు రాలుస్తూ బాల‌కృష్ణ కాళ్లకు మొక్కి కృతజ్ఞతలు తెలిపాడు. ఆ ఘ‌ట‌న‌కు సంబంధించిన ఫొటోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాల‌య్య‌ది చాలా గొప్ప మ‌న‌స‌ని ఆయ‌న అభిమానులు కొనియాడుతున్నారు.