Begin typing your search above and press return to search.

జ‌న‌తా గ్యారేజ్ లో జై బాల‌య్య‌!

By:  Tupaki Desk   |   1 Sep 2016 8:52 AM GMT
జ‌న‌తా గ్యారేజ్ లో జై బాల‌య్య‌!
X
తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ అభిమానులంద‌రూ జ‌న‌తా గ్యారేజ్ ఫీవ‌ర్ తో ఉన్నారు! థియేట‌ర్ల‌లో కేరింత‌లు కొడుతున్నారు. ఎన్టీఆర్‌.. ఎన్టీఆర్‌... అంటూ నినాదాలు చేస్తున్నారు. థియేట‌ర్ల ముందు పండుగ వాతావ‌ర‌ణం నెల‌కొంది. థియేట‌ర్ల‌లో తార‌క్ ఫ్యాన్స్ తోపాటు - బాల‌య్య అభిమానులు కూడా కాస్త హ‌డావుడి చేయ‌డం విశేషంగా చెప్పుకుంటున్నారు. సంఖ్యాప‌రంగా ఫ్యాన్స్ విష‌యంలో ఎన్టీఆర్ కు ఏ రేంజిలో అభిమానులు ఉన్నారో... అంత‌కుమించి బాల‌య్య కూడా అభిమానులు ఉన్నారు. నిజానికి ఇద్ద‌రూ మ‌హాన‌టుడు నంద‌మూరి తార‌క రామారావు న‌టవార‌సులే అయినా ఈ ఇద్ద‌రి ఫ్యాన్స్ మ‌ధ్యా ఒక‌ర‌కమైన వాతావ‌ర‌ణం బ‌య‌ట ఉంటుంద‌ని చెప్పుకుంటారు! ఎందుకంటే, రాజ‌కీయంగా తెలుగుదేశం పార్టీలో తార‌క్ కు ద‌క్కుతున్న ప్రాధాన్య‌తా స్థాయిని బ‌ట్టీ ఫ్యాన్స్ కూడా స్పందిస్తుంటారు క‌దా. జూనియ‌ర్ ను తొక్కేయాల‌న్న ధోర‌ణి తెలుగుదేశంలో ఎక్కువైంద‌నే విమర్శ‌లు బ‌య‌ట చాలా ఉన్నాయి. అందుకే, తార‌క్ ను తెలుగుదేశం పార్టీకి దూరంగా పెడుతున్నారంటారు!

గ‌తంలో తార‌క్ సినిమాలు విడుద‌ల అయితే బాల‌య్య ఫ్యాన్స్ వేరే ర‌కంగా ప్ర‌చారం చేసేవారనీ చెబుతారు. తాజాగా జ‌న‌తా గ్యారేజ్ విష‌యంలో కూడా కొన్ని చోట్ల బాల‌య్య ఫ్యాన్స్ హ‌ల్ చ‌ల్ చేశారు. ఈ చిత్రం బెనిఫిట్ షోలు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తునే వేశారు. సాధార‌ణంగా ఈ షోల‌కు తార‌క్ వీరాభిమానులు వ‌స్తారు. కానీ, ఈసారి వారితోపాటు బాల‌య్య అభిమానులు కూడా పెద్ద సంఖ్య‌లో వ‌చ్చారు. రొటీన్ గానే సినిమా ప్రారంభం అయిన ద‌గ్గ‌ర నుంచి జై బాల‌య్యా... జై జై బాల‌య్యా అంటూ నినాదాలు చేశారు. దీంతో తార‌క్ ఫ్యాన్స్ కి ఎలా రియాక్ట్ కావాలో కాసేపు అర్థం కాలేదు. చాలా థియేట‌ర్ల‌లో ఇదే ప‌రిస్థితి నెల‌కొంద‌ని అభిమానులు చెబుతున్నారు.

సినిమా ప్రారంభంలో కొంత‌సేపు బాల‌య్య నినాదాలు చేసిన‌వారు, త‌రువాత కాసేప‌టికి శాంతించారని చెబుతున్నారు. ఆ త‌రువాత‌ - తార‌క్ ఫ్యాన్స్‌ - బాల‌య్య ఫ్యాన్స్ క‌లిసి సినిమా ఎంజాయ్ చేశార‌ని అంటున్నారు. మొత్తానికి బాల‌య్య‌ - తార‌క్ ఫ్యాన్స్ క‌లిసి తార‌క్ సినిమా చూశారంటే చెప్పుకోవాల్సిన విష‌య‌మే క‌దా!