Begin typing your search above and press return to search.

'మన పాకిస్థాన్' ఏంటి బాలయ్యా..?

By:  Tupaki Desk   |   13 Jan 2022 6:32 AM GMT
మన పాకిస్థాన్ ఏంటి బాలయ్యా..?
X
నందమూరి బాలకృష్ణ - దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన ''అఖండ'' సినిమా బాక్సాఫీస్ వద్ద అఖండమైన విజయాన్ని సాధించింది. కరోనా సెకండ్ వేవ్ పాండమిక్ తర్వాత థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం హైదరాబాద్ లో విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా అఖండ ను 'పాస్ వరల్డ్' చిత్రంగా అభివర్ణించిన బాలయ్య.. 'మన పాకిస్థాన్' అని సంభోదించడం హాట్ టాపిక్ గా మారింది.

బాలకృష్ణ మాట్లాడుతూ.. ''డిసెంబరు 2న సినిమాను విడుదల చేశాం. అసలు సీజనే కాదు. పైగా కరోనా పూర్తిగా తొలగిపోలేదు. ప్రేక్షకులు థియేటర్‌ కు వచ్చి సినిమా చూస్తారా? అన్న భయాలు ఉన్నాయి. అది ఉండటం సహజం. నిర్మాత ధైర్యంగా సినిమాను విడుదల చేశారు. ప్రేక్షక దేవుళ్లు అభిమానించి ఆదరించారు. కరోనా పాండమిక్ తర్వాత ఇది తొలి అంకురం.. తొలి ఘట్టం.. 'అఖండ' విడుదలతోనే సంక్రాంతి పండుగ మొదలైంది. ప్రజలు తిరునాళ్లకు వెళ్లినట్టు బండ్లు కట్టుకొని సినిమాకు వెళ్లారు'' అని అన్నారు.

''మన రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ.. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. ఒకరకంగా ఇది పాన్ ఇండియా.. పాన్ వరల్డ్ సినిమా అయింది. ఇవాళ పొద్దున్నే చూసాను. పాకిస్తాన్ లో కూడా అక్కడ వాళ్లు.. అదెవరో నాకు వాట్సాప్ చేసారు.. అక్కడ వాళ్లు మాట్లాడుకోవడం మన సినిమా గురించి.. మన పాకిస్థాన్ లో.. మన అఖండ సినిమా గురించి" అని బాలయ్య చెప్పుకొచ్చారు.

అయితే 'అఖండ' సినిమా దేశ విదేశాల్లో అద్భుతమైన విజయం సాధించిందని చెప్పాలనే ఉద్దేశ్యంతో పాకిస్థాన్ లోనూ ఈ మూవీ గురించి మాట్లాడుకుంటున్నారని చెప్పడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ జరుగుతున్నాయి. ఖండఖండాలలో అఖండమైన సక్సెస్ అయింది సరే.. పాక్ లో కూడా ఈ సినిమా గురించి చర్చ జరగడం అనేదే మరీ విడ్డూరంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ఎవరో నెటిజన్ కావాలనే ట్రోల్ చేయడానికి ఇలాంటి వాట్సాప్ మెసేజ్ ను నటసింహానికి ఫార్వార్డ్ చేసి ఉంటారని వ్యాఖ్యానిస్తున్నారు.

అలానే ఇండియాకి శత్రు దేశమైన పాకిస్థాన్ ను 'మన పాకిస్థాన్' అని బాలకృష్ణ సంభోదించడం పై నెటిజన్స్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. భారతీయులపై ఎప్పుడూ అక్కసు వెళ్లగక్కే పొరుగుదేశాన్ని 'మన' అని ఓన్ చేసుకొని మాట్లాడటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. నందమూరి అభిమానుల మాత్రం బాలయ్య కావాలని అలా వ్యాఖ్యనించి ఉండరని.. అఖండ సినిమా ఇతర దేశాల్లోనూ అద్భుతమైన విజయం సాధించిందనే ఉద్దేశ్యంతో మాట తడబడి ఉంటుందని అంటున్నారు. ఏదేమైమా సక్సెస్ మీట్ లో బాలకృష్ణ స్పీచ్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.