Begin typing your search above and press return to search.

బాలయ్య కారులో ఎవరున్నారబ్బా?

By:  Tupaki Desk   |   2 Sep 2016 5:49 AM GMT
బాలయ్య కారులో ఎవరున్నారబ్బా?
X
మొన్నన ప్రముఖ సినీనటుడు.. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అర్థరాత్రి దాటిన తర్వాత వాయు వేగంతో కారును నడిపిన ఘటనలో అదుపు తప్పి.. డివైడర్ మీదకు ఎక్కేసి వైనం తెలిసిందే. ఈ ఘటనలో కారు ముందు భాగమంతా పచ్చడి పచ్చడి అయ్యింది. అయితే.. కారులో బెలూన్లు విచ్చుకోవటంతో కారు లోపల ఉన్న వారికి ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. ఈ ఘటన సంచలనం సృష్టించింది. అయితే.. బాలకృష్ణ కారులో ప్రయాణించింది ఎవరు? ప్రమాదం జరిగినప్పుడు కారును డ్రైవ్ చేసింది ఎవరు? ఘటన జరిగిన సమయంలో కారులో ఎంతమంది ఉన్నారు? లాంటి ప్రశ్నలకు సమాధానం లభించటం లేదు.

హైదరాబాద్ లోని ముఖ్యమైన అన్ని చోట్ల సీసీ కెమేరాలు పెట్టినప్పటికీ.. బాలకృష్ణ కారు ప్రమాదం చోటు చేసుకున్న ప్రదేశంలో సీసీ కెమేరా లేకపోవటంతో.. ప్రత్యక్ష సాక్ష్యుల కథనం మీదనే పోలీసులు విచారణ చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. ప్రమాదం జరిగిన రోజున.. అక్కడి ప్రత్యక్షసాక్ష్యుల కథనం ప్రకారం.. కారు మితిమీరిన వేగంతో వెళ్లిందని.. మూలమలుపు దగ్గర అదుపు తప్పి డివైడర్ పైకి ఎక్కేసి.. విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టిందని చెబుతున్నారు.

కారు యాక్సిడెంట్ జరిగిన తర్వాత కారులోపల నుంచి ఒక్క వ్యక్తే బయటకు వచ్చినట్లుగా తాము చూశామంటున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. మరో కీలకమైన అంశం ఏమిటంటే.. కారు లోపల నుంచి బయటకు వచ్చిన వ్యక్తి.. అటుగా వెళుతున్న ఆటో ఆపి.. అందులో వెళ్లినట్లుగా చెబుతున్నారు. సీసీ కెమేరాలు లేకపోవటంతో.. ఈ ఘటనపై విచారణకు ప్రత్యక్ష సాక్ష్యుల నుంచి మరింత సమాచారం సేకరించాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసు విచారణలో భాగంగా బాలకృష్ణ మేనేజర్ ను పోలీస్ స్టేషన్ కు పిలిపించి.. వివరాలు సేకరించనున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. బాలకృష్ణ కారు ఎపిసోడ్ లో రెండు విషయాలపై స్పష్టత వచ్చినట్లేనని చెప్పాలి. అందులో ఒకటి.. ప్రమాదం జరిగినప్పుడు కారులో ఉన్నది ఒక్కరే అన్నది ఒకటైతే.. కారు ప్రమాదం తర్వాత బయటకు వచ్చిన వ్యక్తి ఆటోలో వెళ్లిపోయారని. ఇక.. తేలాల్సిందే ఒక్కటే.. కారు నడిపిన ఆ వ్యక్తి ఎవరన్నది మాత్రమే. మరా విషయాన్ని పోలీసులు ఎప్పటికి బయటకు లాగుతారో..?