Begin typing your search above and press return to search.

ఇద్దరిలో ఓవర్సీస్ లో సత్తా చాటేదెవరు..?

By:  Tupaki Desk   |   25 Nov 2022 11:30 PM GMT
ఇద్దరిలో ఓవర్సీస్ లో సత్తా చాటేదెవరు..?
X
పాండమిక్ తర్వాత తెలుగు సినిమాల ఓవర్ సీస్ మార్కెట్ మళ్ళీ పుంజుకుంటోంది. ఒకప్పటి రేంజ్ లో అన్నీ మిలియన్ల డాలర్లు వసూలు చేయకపోయినా.. ఒకాడికి మంచి నంబర్స్ నే నమోదు చేస్తున్నాయి. ఈ ఏడాదిలో చాలా సినిమాలు యూఎస్ఏ బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపించగలిగాయి. దీంతో ఇప్పుడు 2023 సంక్రాతి చిత్రాల మీద అందరి దృష్టి పడింది.

వచ్చే ఏడాది సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నటించిన 'వాల్తేరు వీరయ్య' మరియు నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 'వీరసింహా రెడ్డి' సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఇద్దరు సీనియర్ హీరోలు కొన్నేళ్ల తర్వాత ఒకే సీజన్ లో బరిలోకి దిగుతుండటంతో ఈసారి బాక్సాఫీస్ వార్ గురించి.. ట్రేడ్ లెక్కల అంచనాల గురించి ఇప్పటి నుంచే చర్చలు మొదలయ్యాయి.

చిరంజీవి - బాలయ్యల సినిమాల విడుదల తేదీలను ఇంకా ప్రకటించనప్పటికీ.. ఒకటీ లేదా రెండు రోజుల గ్యాప్ తో థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ చిత్రాలకు యూఎస్ఏలో లాంగ్ వీకెండ్ ప్రయోజనం చేకూరనుంది.

అమెరికాలో జనవరి 16 సోమవారం మార్టిన్ లూథర్ కింగ్ డే కారణంగా పబ్లిక్ హాలిడే ఉంటుంది. కాబట్టి 'వాల్తేరు వీరయ్య' మరియు 'వీర సింహా రెడ్డి' సినిమాలు సుదీర్ఘ వారాంతాన్ని కలిగి ఉంటాయి. ఒకేవేళ రెండు సినిమాలకు మౌత్ టాక్ పాజిటివ్ గా ఉంటే.. కలెక్షన్ల పరంగా భారీ అడ్వాంటేజ్ అవుతుందని చెప్పాలి.

చిరు ఈ ఏడాది 'ఆచార్య' సినిమాతో యూఎస్ లో $1 మిలియన్ మార్కును టచ్ చేయడంలో విఫలమైనప్పటికీ.. 'గాడ్‌ ఫాదర్‌' చిత్రంతో మిలియన్ డాలర్ల మార్కును క్రాస్ చేసారు. మరోవైపు బాలయ్య గత చిత్రం 'అఖండ' ఒక మిలియన్ కు పైగా వసూల్ చేసింది.

ఈ నేపథ్యంలో ఫెస్టివల్ సీజన్ లో రిలీజ్ కాబోతున్న మెగాస్టార్ - నటసింహాల మాస్ యాక్షన్ ఎంటర్టైనర్స్ ఓవర్ సీస్ లో ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. కాకపోతే ఈ రెండు సినిమాలకు 'వారసుడు' మరియు 'తునివు' వంటి డబ్బింగ్ చిత్రాలతో పోటీ ఎదురు కాబోతోంది.

అలానే 2022 డిసెంబర్ 16న 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' చిత్రం విడుదలవుతోంది. ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తే మాత్రం అది మార్టిన్ లూథర్ కింగ్ డే వరకూ కొనసాగే అవకాశం ఉందని.. అదే జరిగితే 'వాల్తేర్ వీరయ్య' & 'వీరసింహారెడ్డి' కలెక్షన్స్ దెబ్బతినడం ఖాయమని ట్రేడ్ నిపుణులు భావిస్తున్నారు.

కాకపోతే చిరు - బాలయ్యల సినిమాలు విడుదలయ్యే సమయానికి 'అవతార్ 2' నాలుగో వారంలో ఉంటుంది కాబట్టి.. ఇబ్బందేమీ ఉండకపోవచ్చనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఏదేమైనా ఈసారి ఇద్దరు సీనియర్స్ లో ఓవర్సీస్‌ లో ఎవరు సత్తా చాటుతారనేది ఆసక్తికరంగా మారింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.