Begin typing your search above and press return to search.

బిగ్ న్యూస్ : మెగా బ్యానర్‌.. క్రిష్‌ డైరెక్టర్‌.. బాలయ్య109

By:  Tupaki Desk   |   5 Nov 2021 3:30 AM GMT
బిగ్ న్యూస్ : మెగా బ్యానర్‌.. క్రిష్‌ డైరెక్టర్‌.. బాలయ్య109
X
అల్లు వారి బ్యానర్ గీతా ఆర్ట్స్ అనగారే అంతా కూడా మెగా ఫ్యామిలీ హోం బ్యానర్‌ అన్నట్లుగా మాట్లాడుకుంటూ ఉంటారు. గీతా ఆర్ట్స్ లో దాదాపు అందరు మెగా హీరోలు నటించారు. ముందు ముందు రాబోతున్న మెగా ఫ్యామిలీ హీరోలు కూడా ఖచ్చితంగా గీతా ఆర్ట్స్ లో కాని గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో అయినా నటించాల్సిందే. మెగా ఫ్యామిలీకి అంతటి హోం బ్యానర్ అయిన గీతా ఆర్ట్స్ బ్యానర్‌ లో నందమూరి హీరో సినిమా అంటే ఖచ్చితంగా అది పెద్ద వార్తే. అది కూడా నందమూరి బాలకృష్ణ సినిమా అంటే ఖచ్చితంగా అది టాలీవుడ్‌ లోనే ప్రత్యేకమైన సినిమాగా నిలుస్తుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయనతో గీతా ఆర్ట్స్ లో ఒక సినిమాను నిర్మించాలని ఆశ పడుతున్న అల్లు అరవింద్‌ కు ఆ అవకాశంను రామ్‌ చరణ్ ఇవ్వడం లేదు. వరుసగా చరణ్‌ బ్యానర్‌ లోనే చిరంజీవి నటించాడు. ఇప్పుడు వేరే బ్యానర్ లో నటిస్తున్నా గీతా ఆర్ట్స్ కు మాత్రం చిరంజీవి డేట్లు ఇవ్వలేదు. ఈ సమయంలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌ లో బాలకృష్ణ హీరోగా అల్లు అరవింద్ సినిమాను నిర్మించేందుకు సిద్దం అయ్యాడు.

ఇటీవల అల్లు అరవింద్ మరియు బాలకృష్ణ లు ఆహా కోసం ఒక టాక్ షో విషయమై మాట్లాడుకున్నారు. అల్లు అరవింద్‌ అడిగిన వెంటనే మరో ఆలోచన లేకుండా ఆహా కోసం అన్‌ స్టాపబుల్‌ టాక్ షో ను చేసేందుకు బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చాడు. ఆహా అన్ స్టాపబుల్‌ షో ప్రమోషన్‌ మరియు షూట్‌ సమయంలోనే ఇద్దరి కాంబోలో సినిమా గురించిన చర్చ జరిగినట్లుగా సమాచారం అందుతోంది. అన్ స్టాపబుల్‌ షో కు బ్యాక్‌ ఎండ్ లో క్రిష్ ఉన్నాడని సమాచారం. ఇప్పుడు అల్లు అరవింద్‌ నిర్మించబోతున్న బాలకృష్ణ సినిమాకు కూడా క్రిష్ దర్శకత్వం వహించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇప్పటికే క్రిష్‌ దర్శకత్వంలో బాలకృష్ణ గౌతమి పుత్ర శాతకర్ణి మరియు ఎన్టీఆర్‌ బయోపిక్ రెండు పార్ట్‌ లను చేసిన విషయం తెల్సిందే. బాలయ్య 109వ సినిమాగా క్రిష్ దర్శకత్వంలో బాలయ్య సినిమా ఉంటుందని అంటున్నారు.

ఇప్పుడు వీరి కాంబోలో మరో సినిమా పట్టాలెక్కబోతున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉండటం కామన్‌. అది కాకుండా గీతా ఆర్ట్స్ లో ఈ సినిమా రావడం కూడా ఖచ్చితంగా ప్రత్యేకమైన విషయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు మీడియా సర్కిల్స్ లో కూడా చర్చ జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించిన కథ విషయంలో ఇంకా చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే ఒక కొలిక్కి వస్తుందని.. త్వరలోనే అధికారికంగా ఈ సినిమాను ప్రకటిస్తారని కూడా తెలుస్తోంది. వచ్చే ఏడాదిలో ఈ సినిమాను పట్టాలెక్కించే అవకాశాలు కూడా ఉన్నాయి. బాలకృష్ణ అఖండ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. అఖండ సినిమా తర్వాత గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో సినిమాను చేసేందుకు బాలయ్య ఓకే చెప్పాడు. ఆ తర్వాత అనీల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా స్పీడ్ గా పూర్తి చేయబోతున్నాడు బాలయ్య. ఆ సినిమాల తర్వాత క్రిష్ దర్శకత్వంలో బాలయ్య సినిమా ఉంటుందట. మరో వైపు క్రిష్ ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్ తో హరి హర వీరమల్లు సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా వచ్చే సమ్మర్ వరకు పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. ఆ వెంటనే అంటే వచ్చే సమ్మర్ లోనే బాలయ్య మూవీని గీతా ఆర్ట్స్ లో మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఈ అన్ని విషయాలపై గీతా ఆర్ట్స్ నుండి ఒకటి రెండు వారాల్లో లేదా అంతకు ముందుగానే ఒక అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.