Begin typing your search above and press return to search.

అవునా.. ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ డైరెక్టర్ ఆయనా?

By:  Tupaki Desk   |   9 Oct 2017 5:20 PM GMT
అవునా.. ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ డైరెక్టర్ ఆయనా?
X
‘అర్జున్ రెడ్డి’ తమిళ రీమేక్ లో తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధ్రువ్ కథానాయకుడిగా నటించనున్నట్లు కొన్ని రోజుల కిందటే వెల్లడైన సంగతి తెలిసిందే. ధ్రువ్ కు ఇదే తొలి సినిమా. ఐతే ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారనే విషయంలో కొంత సస్పెన్స్ నడించింది. ఇంతకుముందు ‘నానుమ్ రౌడీదా’ అనే సినిమా తీసి.. ఇప్పుడు సూర్యతో ‘తానా సేంద్ర కూట్టమ్’ అనే సినిమా చేస్తున్న విఘ్నేష్ శివన్ పేరు వినిపించింది. ఐతే తాజా సమాచారం ప్రకారం ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ కు దర్శకుడు విఘ్నేష్ కాదట. ‘సేతు’ ‘పితామగన్’ లాంటి గొప్ప గొప్ప సినిమాలు తీసిన బాల ‘అర్జున్ రెడ్డి’ని రీమేక్ చేయబోతున్నట్లుగా తమిళ మీడియా వర్గాలు చెబుతున్నాయి. ఈ వార్త వాస్తవమే అయితే షాకవ్వాల్సిందే.

ఎందుకంటే బాల ఇప్పటిదాకా ఎన్నడూ రీమేక్ చేయలేదు. అతడి సినిమాలు ఒరిజినల్ గా ఉంటాయి. చాలా ప్రత్యేకంగా ఉంటాయి. తమిళంలో తన సినిమాలతో గొప్ప పేరు సంపాదించాడు బాల. దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలి ఏర్పరుచుకున్న బాల.. తెలుగులో ఒక కొత్త దర్శకుడు తీసిన సినిమాను రీమేక్ చేస్తాడంటే ఆశ్చర్యంగానే ఉంది. పైగా ‘అర్జున్ రెడ్డి’ లాంటి సినిమాను రీమేక్ చేయడం కూడా భిన్నమైన సవాలే. మరి విక్రమ్ ఆలోచన ఎలా ఉందో మరి. విక్రమ్ ను హీరోగా నిలబెట్టింది బాలానే. అతను తీసిన ‘సేతు’ సినిమాతోనే విక్రమ్ దశ తిరిగింది. ఆ తర్వాత వాళ్లిద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన ‘పితామగన్’ కూడా సెన్సేషనల్ హిట్టయింది. మరి ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ కు నిజంగానే బాల దర్శకత్వం వహిస్తాడేమో చూద్దాం.