Begin typing your search above and press return to search.

సినిమా నిడివి రెండు గంటలైతేనే మేలు బాలయ్య వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   16 Nov 2020 12:15 PM IST
సినిమా నిడివి రెండు గంటలైతేనే మేలు బాలయ్య వ్యాఖ్యలు
X
సినిమా నిడివి అనేది 2 గంటలకు మించి ఉండకూడదని ప్రముఖహీరో, హిందూపూర్​ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అభిప్రాయపడ్డారు. హర్ష కనుమిల్లి, సిమ్రాన్ చౌదరి ప్రధాన పాత్రలో నటించిన ‘సెహారీ’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను బాలకృష్ణ విడుదల చేశారు. ఈ సినిమాను బాలకృష్ణ స్నేహితుడు - మాజీ సీఎం కిరణ్ ​కుమార్​ రెడ్డి మేనల్లుడు అడ్వాయి జిష్ణు రెడ్డి.. కన్య పిక్చర్స్ బ్యానర్‌ పై శిల్ప చౌదరి సహకారంతో నిర్మిస్తున్నారు. గంగసాగర్ డైరెక్టర్​ గా పరిచయం కాబోతున్నారు. జిష్ణు నిర్మాత కావడంతోనే తాను ఈ ఈవెంట్​ కు వచ్చానని బాలయ్య చెప్పాడు.

‘నా సినిమాల్లో అన్ని అంశాలు ఉండాలని అభిమానులు కోరుకుంటారు. అద్భుతమైన ఫైట్లు - డైలాగులు - డ్యాన్సులు ఏవి లేకపోయినా వాళ్లు ఒప్పుకోరు. కానీ సినిమా తీస్తున్నప్పుడు నిర్మాత ఆర్థికపరిస్థితిని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. సినిమాను బడ్జెట్​ లో ఉంచేందుకు ప్రయత్నించాలి’ అని ఆయన పేర్కొన్నారు. రాజకీయాలు - సామాజిక సేవ అంటే తనకు ఎంతో ఇష్టమని బాలకృష్ణ చెప్పారు.

సామాజిక సేవ చేయడం తమ రక్తంలోనే ఉందన్నారు. ‘నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. బసవతారకం క్యాన్సర్​ ఆస్పత్రికి చైర్మన్​గా కూడా ఉన్నాను. ఇవన్నీ ఉన్నప్పటికీ సినిమాల్లో నటించడమే నాకు సంతృప్తి ఇస్తుంది. తెలుగులో కొత్త నటీనటులు - కొత్త దర్శకులు రావాలని.. కొత్త కథలు - విభిన్నమైన దర్శకులు రావాలి.’ అని ఆయన అభిప్రాయపడ్డారు.

బాలకృష్ణ ఇటీవల ఆన్​ లైన్​ లో విడుదల చేసిన ‘నర్తనశాల ’ సన్నివేశాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆ చిత్రంలో బాలకృష్ణ ఆహార్యం - ఆయన డైలాగులు చెప్పిన తీరుకు ప్రశంసలు దక్కాయి. మరోవైపు బాలయ్య.. బోయపాటి శ్రీను దర్శకత్వం లో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఇందుకు సంబంధించిన టీజర్ (బీబీ3) ​కూడా విడుదలై ప్రేక్షకులను అలరించింది. గతంలో వీరిద్దరి కాంభినేషన్​ లో వచ్చిన సింహా - లెజెండ్​ చిత్రాలు భారీ విజయాన్ని నమోదు చేసుకోవడంతో.. కొత్త సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. మరోవైపు బాలకృష్ణ కుమారుడు నందమూరి మోక్షజ్ఞ తెరంగేట్రం పై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.