Begin typing your search above and press return to search.

నన్ను .. బోయపాటిని ఆ దేవుడే కలిపాడు: బాలకృష్ణ

By:  Tupaki Desk   |   21 Jan 2022 3:09 AM GMT
నన్ను .. బోయపాటిని ఆ దేవుడే కలిపాడు: బాలకృష్ణ
X
బాలకృష్ణ - బోయపాటి కాంబినేషన్లో రూపొందిన 'అఖండ' సినిమా డిసెంబర్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజునే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, విడుదలైన ప్రతి ప్రాంతంలో విజయవిహారం చేసింది. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా నిన్నటితో 50 రోజులను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నిన్న హైదరాబాద్ - సుదర్శన్ 35 MM థియేటర్లో అర్థశతదినోత్సవ వేడుకను నిర్వహించారు. ఈ వేదికపై బాలకృష్ణ మాట్లాడుతూ .. కోవిడ్ కారణంగా ప్రేక్షకులు థియేటర్ కి వస్తారో లేదోననే సందేహంతో ఈ సినిమాను రిలీజ్ చేయడం జరిగింది. కానీ మీరంతా ఈ సినిమాకి అఖండమైన విజయాన్ని అందించారు.

ఒక్క తెలంగాణ .. కర్ణాటక .. మహారాష్ట్ర అనే కాదు ప్రపంచమంతా 'అఖండ' అర్థశతదినోత్సవాన్ని జరుపుకుంటోంది. నా అభిమానులంతా పలు చోట్ల ఈ వేడుకను జరుపుకుంటున్నందుకు చాలా గర్వంగా ఉంది. ఇది సంక్రాంతి తరువాత జరుపుకుంటున్న పండుగలా ఉంది. 'అఖండ'లో శివుడి భక్తుడిగా నేను ఆ పాత్రను చేస్తున్నప్పుడు, గతంలో నాన్నగారు చేస్తున్న పాత్రలను గుర్తుచేసుకుంటూ చేశాను .. అందువల్లనే అంత బాగా వచ్చింది. ఇక నేను .. బోయపాటి హ్యాట్రిక్ హిట్ కొట్టాము .. మా కలయిక జన్మజన్మలది .. మమ్మల్ని ఆ దేవుడే కలిపాడు.

సాధారణంగా మానవ పుట్టుకలో ఒకరినో .. ఇద్దరినో భగవంతుడు స్నేహితులుగా ఇస్తుంటాడు. కానీ నాకు కోట్లాది మంది అభిమానులను ఇచ్చాడు. ఎప్పుడు నేను ఏ ప్రయోగం చేస్తున్నా అభిమానులు ప్రోత్సహిస్తూనే వస్తున్నారు. ఇది మా విజయం కాదు .. తెలుగు సినిమా సాధించిన విజయం. హిందూ సమాజం .. హిందూ ధర్మం జోలికి వస్తే దేవుడు 'అఖండ'లా వచ్చి వాళ్లకి బుద్ధి చెబుతాడు .. ప్రక్షాళన చేస్తాడు. ఈ సినిమా విజయంలో తమన్ ముఖ్యమైన పాత్రను పోషించాడు. ఇది పాన్ ఇండియా సినిమా కాదు .. పాన్ వరల్డ్ సినిమా అనుకునేంత విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు" అని చెప్పుకొచ్చారు.

ఇక బోయపాటి మాట్లాడుతూ .. "ఈ సినిమా 100కి పైగా థియేటర్లలో 50 రోజులు పూర్తి చేసుకోవడం ఆనందంగా ఉంది. నాపై బాలయ్య .. రవీందర్ రెడ్డిగారు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నందుకు సంతోషంగా ఉంది. బాలయ్యతో ఏ సినిమా చేసినా ఇలాగే ఆదరిస్తారని భావిస్తున్నాను. ఈ సినిమాను ఎన్టీఆర్ గారికి అంకితం ఇస్తున్నాము" అని అన్నాడు. ఇక నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ .. 'అఖండ' ఇంతటి విజయాన్ని సాధిస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు. కానీ అంతటి విజయాన్ని అందించిన మీకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. మీ అభిమానం ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను .. జై బాలయ్య" అంటూ ముగించాడు.